మాలిక పత్రిక జూన్ 2019 సంచికకు స్వాగతం

 

 

Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మిత్రులు, రచయితలకు నమస్సుమాంజలి.. వేసవి చివరి అంచుల్లో వానచినుకుల సవ్వడికై ఎదురుచూస్తున్నాము. ఎవరేమీ అనుకున్నా బుుతువులు మారవు. తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటాయి. మరి మనకెందుకు అడ్డంకులు, అలసత్వములు..

మీ అందరి ఆదరణతో ముంధుకు సాగుతున్న మాలిక పత్రిక మరిన్ని కథలు, కవితలు, వ్యాసాలు  సీరియళ్లు, సమీక్షలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది.. ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చంటారా? చేద్దామంటారా. మీ ఆలోచనలను మాతో పంచుకోండి. కొత్త కొత్త సాహితీ ప్రక్రియలు, ప్రయోగాలకు మాలిక ఎప్పుడూ సై అంటుంది. ఇది మీకు తెలుసుగా..

మరో ముఖ్య విషయం. మరో వారం రోజుల్లో మాలిక పత్రిక విశేష సంచిక కూడా మీ ముందుకు రాబోతుంది. అదేంటి అనేది ఇప్పటికైతే సస్పెన్స్.. ఆగాలి మరి.

మీ రచనలను పంపవలసిన చిరునామా.. maalikapatrika@gmail.com

ఈ సంచికలోని విశేషాలు;

1. కౌండిన్య కథలు – పరివర్తన
2.  ఆత్మీయ బంధాలు
3.  ఖజానా
4.  గిలకమ్మ కతలు – “పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా?”
5.  నిన్నే ప్రేమిస్తా………
6. కంభంపాటి కథలు – ఫణి క్రిష్ణ స్టోరీ
7.  విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”
8.  చీకటి మూసిన ఏకాంతం – 2
9.  అమ్మమ్మ -3
10.  కార్టూన్స్ – తోట రాజేంద్రబాబు
11.  కార్టూన్స్ .. జెఎన్నెమ్
12.  మేలుకొలుపు!
13.  ఇల్లాలు (భర్త అంతర్వీక్షణ )
14.  ‘పర’ వశం…
15.  అనుభవాలు….
16.  తపస్సు – హింస
17.  మనసుకు చికిత్స, మనిషికి గెలుపు
18.  బుడుగు-సీగేన పెసూనాంబ
19.  వీరి తీరే వేరయా…
20.  అష్టావక్రుడు
21.  కర్ణాటక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు
22.  తేనెలొలుకు తెలుగు
23.  సరదాకో అబద్దం
24.  అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 38
25.  రఘునాథ మందిరం

కౌండిన్య కథలు – పరివర్తన

రచన: రమేష్ కలవల

“అబ్బ! ఎంత హడావుడిగా ఉందో చూడండి?” అంది కమలమ్మగారు, కూతురు కూడా పక్కనే నించొని ఉంది.
“అవునవును. పండగలకు ఊరు వెళ్ళే వారంతా ఇక్కడే ఉన్నారు” అన్నారు రామనాధంగారు.
మళ్ళీ “వాస్తవంగా బస్టాండు కంటే కూడా ఇక్కడే ఎక్కవ ప్రయాణికులు ఉంటున్నారు. ఇసకేస్తే రాలని జనం” అంటుండగా కాళేశ్వరరావు పంతులుగారు హడావుడిగా అటు నడుస్తూ వెళ్ళడం చూసి “కాళేశ్వర్రావుగారు” అంటూ పిలిచారు.
ఆయన ఆగి “అరెరె మీరేంటి ఇక్కడ, ఎన్ని రోజులయ్యింది కలిసి” అంటూ పలకరించారు.
ఇంతలో కాళేశ్వరరావుగారు ఆ పక్కన తన ఫోనులో మాట్లాడుతున్న కొడుకుని పిలిచి “గుర్తుపట్టారా మా వాడిని? పై చదువులకు ఎబ్రాడ్ వెడుతున్నాడు. ఎక్కడికి వెడుతున్నాడని మాత్రం అడగకండి. అన్నీ వాడే చూసుకున్నాడు”
“ఎవరూ, మన శ్రీరామేనా ? ఎంత పెద్దవాడయ్యాడు” అన్నారు రామనాధంగారు.
శ్రీరామ్ ఆయన అన్నదానికి మొహమాటంతో నవ్వనైతే నవ్వాడు కానీ ఆయన ఎవరో ఇంకా సరిగా గుర్తుపట్టలేదు. బాగా పరిచయం ఉన్నవారే అనుకున్నాడు. ఆయన పక్కనే నించొని ఉన్న అమ్మాయి వైపు చూపు మళ్ళింది. ఆ అమ్మాయిని చూసిన తరువాత చిన్నప్పుడున్న పోలికలతో ఉండటంతో కాళేశ్వరరావు గారని గుర్తుకువచ్చింది.
“ఇంతకీ అమ్మాయిని పరిచయం చేయనేలేదు. కుంకుమ, చిన్నప్పుడు నువ్వు చాలా సార్లు చూసావు శ్రీరామ్” అంటూ భుజం మీద ఒక్కటి చరిచాడు. స్కూలు మాస్టారికి ఎపుడూ దూరంగా నిలుచోవాలన్న సంగతి మరిచిపోయినందుకు ముందు జాగ్రత్తగా ఆయనకు కొంచెం దూరంగా జరిగాడు.
“ఫ్లైటు టైమ్ అవుతోందేమో .. ఇక వెళ్ళాలమ్మాయి.. “ అంటూ “రామనాధంగారు ఇక సెలవిప్పించండి. మీ నెంబరు ఇస్తే మీతో వివరంగా ఓ రోజు మాట్లాడుతాను” అన్నారు.
శ్రీరామ్ నెంబరు చెప్పగానే కుంకుమ నోటు చేసుకుంది.
——-
“రేపు ఎక్కడికి వెళ్తున్నాము నాన్నా?” అని అడిగింది కుంకుమ.
“కోటివరం అని ఓ ఊరు, నీ చిన్నప్పుడు అక్కడ స్కూలు లో పనిచేసాను. చక్కటి ఊరు, చిన్న ప్రదేశం. ఓ పని చూసుకొని రావాలి తల్లి” అన్నారు రామనాధంగారు.
“మంచి బట్టలు పెట్టుకోమ్మ” అన్నాడు రామనాధంగారు “సరే నాన్న” అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది.
తరువాత రోజు ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు.
“ఊరంతా ముచ్చటగా పండగకు ముస్తాబవుతోంది చూడు”అన్నారు. “అవును నాన్న” అంది.
“అదిగో పద అక్కడే భద్రం పంతులు గారి ఇల్లు” , “ఊరు కూడా పెద్దగా మారలేదు” అంటూ అక్కడికి చేరుకున్నారు.
రామనాధంగారు రావడం చూసి లేచి ఎదురు వెళ్ళి కౌగలించుకున్నారు. ఆ వరండాలో కుర్చీలు వేస్తూ “ఎవరూ అమ్మాయి?” అని అడిగారు. “గుర్తుపట్ట లేదు మన కుంకుమ” అన్నారు. “ఏళ్ళు అయిపోయింది కదూ కూర్చో తల్లి” అంటూ లోపల “శ్యామలా శ్యామలా..” అంటూ పిలిచి ఆవిడను అమ్మాయిని లోపలకు తీసుకెళ్ళమన్నారు.
ఇద్దరూ కొంచెం సేపు పాతకాలం సంగతులు గుర్తుచేసుకొని “ఇంతకీ ఇన్నాళ్ళ తరువాత మాకు మీ దర్శన భాగ్యం కలిగించారు” అని భద్రంగారు అనడంతో “ఏమీ లేదు అమ్మాయి పెళ్ళీడుకు వచ్చింది కదా. ఈ ఊళ్ళో అయితే మంచి సంబందం దొరుకుతుందేమో?” నని అంటూ తన మనసులో ఉద్దేశ్యం వెళ్ళబుచ్చారు. “ఉన్న చోట చూడకుండా ఇంత దూరం వచ్చారా?” అనడంతో “ అమ్మాయి బాధ్యతలు తీరిపోతే ఇలాటి ఊరికి వచ్చేసి కృష్ణా రామా అనుకుంటే సరిపోతుంది” అన్నారు రామనాధంగారు. “దాని దేముంది అమ్మాయికి మంచి సంబంధం చూద్దాంలెండి” అన్నారు భద్రంగారు.
“ఇంతకీ కాళేశ్వరరావుగారు ఎలా ఉన్నారు? ఓ నాలుగేళ్ళ క్రితం పట్నంలో కలిసారు. ఫోను చేస్తానన్నారు మళ్ళీ కబురు లేదు” అన్నారు.
“ఆయన ఈ వీధిలోనే ఉంటున్నారు. ఈ మధ్య నీర్సపడ్డారు ఎలాగైనా. ఇదివరకట్లా ఉషారు లేదు మనిషిలో. కొడుకు మీద దిగులేమో? పైకి చెబితేగా?” అన్నారు భద్రంగారు.
“ఎలాగూ వచ్చారు కదా పోని కలిసి వెళ్ళండి” అని అంది లోపలనుండి కాఫీ తెస్తూ శ్మామలమ్మగారు. “అలాగే” అంటూ “మీరు బావున్నారా?” అంటూ పలకరించారు రామనాధంగారు. “పెద్దవాళ్ళం” అవుతున్నాం” అంది. “అవును కదమ్మ” అన్నారు.
కాఫీ తాగి “చక్కటి కాఫీ ప్రయాణం బడలిక తీరింది” అన్నారు. “సరే పంతులుగారు, ఇదిగోండి వివరాలు. ఓ మంచి సంబందం చూసే బాధ్యత మీదే” అంటుండగా కుంకుమ బయటకు వచ్చి సిగ్గుపడటం చూసి “శీగ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు” అని దీవిస్తూ “ఎంత వరకూ చదివావు?” అని అడిగారు. “అన్నీ వివరాలు అందులో ఉన్నాయి” అన్నారు. ఆ మాటకు పంతులుగారు “ఇంతకీ అమ్మాయికి మాటలు వచ్చా లేదా? ఒక్క ముక్క మాట్లాడలేదు” అన్నారు. “పరిచయమైతే కానీ నోరు విప్పదు” అని “సరే మేము బయలు దేరుతాం అంటూ కాళేశ్వరరావు గారింటికి చేరుకున్నారు, తలుపు కొట్టారు.
“ఎవరూ?” అంటూ తలుపు తీసారు కాళేశ్వరరావుగారు. మనిషిని చూడగానే కృంగిన వాడిలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో లోపల నుండి కమలమ్మగారు వస్తూ “అలా బయటే నిలబెట్టేసారేమిటి? లోపలకు రమ్మనండి” అంటూ ఆహ్వానిస్తూ “ఏమ్మా కులాసానా?” అంటూ కుంకుమ చెయ్యి పట్టుకొని లోపలకు తీసుకెళ్ళింది. ఆ రోజు ఎయిర్పోర్టు లో అంత హుషారుగా ఉన్న మనిషి ఇలా ఉండటం చూసి అన్నీ సంగతులు లోపల్నుండి వింటోంది. “ఇక సెలవివ్వండి” అనడం విని బయలుదేరాడని సిద్దమయ్యింది. “ఉండమ్మ బొట్టు పెడతాను” అంటూ “నానగారు అన్ని సంగతులు చెప్పారు. ఈ ఊళ్ళో ఎవరైనా దొరికితే మాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు” అంది. ఇద్దరూ బయలుదేరారు. గుమ్మం బయటకు వెళ్ళగానే వెనక్కు తిరిగి “ఒక్కసారి నాన్న” అంటూ లోపలకు నడిచి “శ్రీరామ్ నెంబరు ఉందా?” అని అడిగింది.
“ఉందమ్మ.. కానీ మాట్లాడి చాలా రోజులయ్యింది. పలుకుతాడో లేదో?” అంది కమలమ్మగారు.
“ఫర్వాలేదు ఇవ్వండి” అంటూ తీసుకొంది. “పదండి నాన్న” అంటూ బయలుదేరి అటు వెళ్ళే ఆటో రిక్షాను పిలిచి బస్టాండు తీసుకువెళ్ళమన్నారు.
——
కొన్ని నెలలు గడిచాయి. ఆ రోజు పొద్దుపోయి బాగా చీకటి పడింది. రాత్రి నిద్ర పట్టక మంచ మీద అటు ఇటూ దొర్లుతున్నారు. ఇంతలో ఫోను మ్రోగింది. “ఇంత పొద్దుపోయిన తరువాత ఎవరు చేసారో?” అంటూ లేచి ఫోను తీసారు. “నాన్న” అని వినపడింది. ఓ రెండు నిమిషాలు నిశ్శబ్ధం. “ఎరా, ఎలా ఉన్నావు?” అని అడిగాడు. నిద్రమత్తులో ఉన్న కమలమ్మ హఠాత్తుగా లేచి కూర్చున్నారు మంచం మీద. “పండక్కి ఇండియా వద్దామనుకుంటున్నాను నాన్నా!” అన్నాడు శ్రీరామ్. “మంచిది” అన్నారు. మళ్ళీ నిశ్శబ్దం “సరే నాన్న త్వరలో కలుస్తాను. అమ్మ బావుంది కదా?”అన్నాడు ఊ కొట్టారు. “సరే ఉంటాను నాన్న” అని పెట్టేసాడు.
ఆ ఫోను పెట్టేసి మంచం ఎక్కారు. “ఏమన్నాడు?” అని అడిగింది ఆత్రుతతో. “మళ్ళీ మనకు మొహం చూపిస్తాడుట. పండక్కి వస్తానన్నాడు” అన్నారు.
“రాక రాక వస్తానంటే అంత నీరసంగా మాట్లాడకపోతే ఓ నాలుగు మాటలు మాట్లాడొచ్చు కదా?” అంటూ విసుక్కోబోయింది. మళ్ళీ ఆయనను చూసి తిప్పుకోని ఆ గోడకున్న దేవుడి పటాల వైపుకు చూసి కళ్ళకద్దుకుంది. ఆయన ముభావంగా అటు తిరిగి పడుకున్నారు.
పండగ సమయానికి శ్రీరామ్ వచ్చాడు. ఇంకా కాళేశ్వరరావు గారితో మాటలు సరిగా లేనే లేవు.
పండగ రోజు. ఎవరో తలుపు కొట్టారు. ఎవరూ అంటూ తలుపుతీసి “పంతులుగారు మీరా?” అంటూ లోపలకు ఆహ్వానించారు. “రామనాధంగారిని పిలిపించాను. అబ్బాయి వచ్చాడురా కదా? సాయంత్రం ఓ సారి కలిసి వెడతాం.అన్నీ విషయాలు సాయంత్రం మాట్లాడుతాను” అన్నారు. “అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడండి.నిన్ననే కదా వచ్చింది. ఎక్కడికి బయటకు వెళ్ళే ఉద్దేశ్యం లేదు” అన్నారు సెలవు తీసుకోని బయలు దేరారు భద్రం పంతులుగారు.
———-
సాయంత్రం ఐదు ప్రాంతంలో తలుపు కొట్టడంతో శ్రీరామ్ వెళ్ళి తలుపు తీసాడు. ఎదురుగా కుంకుమ, రామనాధం మాస్టారు. ఏం జరుగుతుందోనని ఆలోచనలో పడ్డాడు. అలా ఉండగా పంతులు గారి బైకు శబ్ధం రావడం “ఏం నాయనా లోపలికి పిలుస్తావా లేదా?” అనడంతో అందరిని లోపలకు రమ్మన్నాడు.
అందరూ పండగ ముచ్చట్లతో మునిగితేలుతున్నారు. ఆ మాటల మధ్యలో శ్రీరామ్ “నాన్న, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి” అంటూ “నేను ఇండియా రావటానికి కారణం ఎవరో తెలుసా?” అన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూడడంతో “కుంకుమ” అన్నాడు.
““ఇన్నాళ్ళ చదువులు, పైగా చిన్నతనంతో చాలా పొరపాట్లు చేసాను. నాకు ఇండియా రావటానికి కుదరక మిమ్మల్ని అక్కడకు రమ్మనా మీరు కుదరదనడటంతో మనస్పర్ధలతో నేనే మొండికేసాను. అందుకు క్షమాపణలు అడుగుతున్నాను” అన్నాడు
“మీ పరిస్తితి అంతా కుంకుమ చెప్తేగానీ నా తప్పు తెలుసుకోలేక పోయాను” అన్నాడు.
“కుంకుమ కూడా అక్కడే ఉద్యోగం వచ్చేలా చూసాను. కొన్ని నెలలుగా అక్కడే ఉంటోంది. అన్నాడు. శ్రీరామ్ తల్లితండ్రులు ఒకళ్ళ మొహాలు మరొకరు చూసుకున్నారు.
“విదేశాలలో ఉంటున్నా ఈ రోజులలో మన సంస్కృతి, పద్దతులను పాటిస్తూ ఇక్కడికి ఏమి తీసిపోని విధంగా ఉండి, నాలాంటి వారికి తోడుగా ఉంటారని మిమ్మల్ని అక్కడికి రమ్మంటే మీరు ససేమీరా ఒప్పుకోలేదు” అన్నాడు.
ఇంతలో పంతులుగారు “ఈ ఊళ్ళో ఓ మంచి సంబంధం చూడమని కాళేశ్వరరావుగారు అడిగారు. అమ్మాయి, అబ్బాయి ఒకరి తోడు ఒకరు కోరుకుంటున్నారు, పైగా ఇష్టపడుతున్నారుట. అందుకే రామనాధంగారిని నేనే పిలిపించాను” అన్నారు భద్రం పంతులుగారు.
“అన్నీ అందరూ ఆలోచించుకున్న తరువాత మా ప్రమేయం ఎందుకు?” అన్నారు కాళేశ్వరరావు గారు.
“అలా కాదు నాన్న.. తప్పుగా అర్థం చేసుకోవద్దు. తను అక్కడ అదే ఊర్లో ఉంటున్నా, తను విడిగా ఉంటోంది. మిమ్మల్ని అడిగి మీకు సమ్మతం అయితేనే పెళ్ళికి సరే చెబుతానంది. అందుకే పండగకు వచ్చి అన్నీ విషయాలు మీతో మాట్లాడాలని వచ్చాము ” అన్నాడు.
కొంతసేపు నిశ్శబ్దంతో గడిచింది. కాళేశ్వరరావుగారు ముభావంగా ఉన్నా కొంతసేపటికి మళ్ళీ మనసు మార్చుకొన్నారు.
“జరిగిందేదో జరిగింది. దూరంగా ఉండటంతో చిన్న మనస్పర్ధలు సహజం.” అంటూ
“ఈ రోజు పండగ రోజు కాబట్టి పాత విషయాలు మరిచిపోయి సరదాగా గడిపేయండి. అబ్బాయి అన్నట్లుగా మరీ పెద్దవారు కాకుండానే ఆ దేశాలు వెళ్ళి చూసిరావడంలో తప్పులేదు” అన్నారు భద్రం పంతులుగారు.
“అయ్యా రామనాధంగారు ఇంతకీ మీరు ఏమి మాట్లాడడం లేదు?” అని అడిగారు పంతులుగారు.
“ అమ్మాయి పెళ్ళై వెళ్ళిపోయిన తరువాత ఈ ఊళ్ళో ఏ వీధిలో కృష్ణా రామా అనుకుందామా అని ఆలోచిస్తున్నాను” అన్నారు నవ్వుతూ రామనాధంగారు.
“మీరు ఇక్కడకు వచ్చేస్తే మాకు కూడా తోడు ఉంటారు” అంది కమలమ్మగారు.
కాళేశ్వరరావుగారి దగ్గరకు వెళ్ళి “మీకు, శ్రీరామ్ కు తోడుగా ఉండే బాధ్యత నాది” అంది కుంకుమ. ఆయన లేచి తల మీద నిమిరి ఆశీర్వదించారు.

శుభం భూయాత్

ఆత్మీయ బంధాలు

రచన: కె. మీరాబాయి

పసుపు రాసిన గడపలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇంటి ముందు పచ్చని కొబ్బరి ఆకుల పందిరి అమరేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. పెళ్ళి జరిగేది కల్యాణ మండపంలోనే అయినా ఇంటి ముందు పందిరి , రంగవల్లులు వుంటేనే అందం శుభకరం.
పెళ్ళికి నాలుగు రోజుల ముందే రమ్యని పెళ్ళికూతుర్ని చేసారు. ఆ రోజు ఉదయాన్నే రమ్యను, రమ్య అమ్మ నీరజను, నాన్న శ్రీనివాస్ ని పీటలమీద కూర్చోబెట్టి నుదుట , కుంకుమ పెట్టి, హారతి ఇచ్చి , వాళ్ళు తలంటి పోసుకోవడానికి తలకు నూనె పెట్టింది నీరజ వాళ్ళ చిన్నక్క కమల. సున్నం పసుపు నీళ్ళలో కలిపి ఆ ఎర్ర నీళ్ళతో వాళ్ళకు ద్రిష్టి తీసింది నీరజ ఆడపడుచు. తోడికోడళ్ళు, బావగార్లు, భర్త పిల్లలతో బాటు వచ్చిన ఆడబడుచులు ఇంటి నిండా బంధువులు కల కలలాడుతూ తిరుగుతున్నా నీరజ మనసులో మాత్రం వెలితి గానే వుంది. ఆందుకు కారణం అమ్మ లాటి అక్క పార్వతి రాక పోవడం.
ఒకవేళ నిజంగానే ఆమె రాక పోతే అత్తవారింటి వారి ముందు చులకన కాకూడదని పార్వతి తరఫున చదివించడానికి మంచి ఖరీదైన పట్టు చీర , జరీ పంచల చాపు తెప్పించి పెట్టింది నీరజ.
బరువుగా నిట్టూర్చింది నీరజ. అమ్మ మనసులో రేగుతున్న అలజడి అర్థం చేసుకున్న పెళ్ళికూతురు రమ్య అమ్మ చేయి సున్నితంగా నొక్కింది . ‘దిగులు పడకు వస్తుందిలే అన్నట్టు. . ‘
ఆడవాళ్లు అలంకరణ ముగించేసరికి పురోహితుడు రానే వచ్చాడు. ఆయన వెనకాలే మేళగాళ్ళు వచ్చేసారు. ” శ్రీ గణపతిని సేవింపరారే “అంటూ సౌరాస్ట్ర రాగంలో కీర్తనతో పది నిముషాలలో మంగళ వాద్యాలు మొదలయ్యాయి. సన్నాయి, మృదంగం డొలు వంటి వాద్యగోష్టి హోరులో పెళ్ళి ఇంట్లో ఒకరి మాటలు మరొకరికి వినబడడం లేదు.
” కార్యక్రమం మొదలు పెట్టాలి . పెళ్ళికుమార్తె, తల్లి, తండ్రి వచ్చి పీటలమీద కుర్చోండమ్మ “అంటూ హడావిడి చేస్తున్నాడు పురోహితుడు.
“వస్తున్నాము” అన్నట్టు సైగ చేసి ఆశ వదులుకోలేక వీధి గుమ్మంలోకి వచ్చింది నీరజ. అక్క వచ్చే జాడ కనబడుతుందేమో అని చూస్తూ. నిరాశగా వెనక్కి వస్తూ ఎదో తోచినట్టు ఫోనులో పార్వతి నంబరు నొక్కింది. “రారా మా ఇంటిదాకా రఘువీర సుకుమార ” అంటూ అసావేరి రాగంలో వాయిస్తున్న భజంత్రీల ముందు వుంచింది ఫోను.
ఈ సందడి విని అయినా అక్క మనసు కరగకపోతుందా ఆన్న ఆలోచనతో నీరజ కళ్ళు చెమరించాయి.
అటువైపు ఫోనులో ఆ మంగళ నాదాలు వినగానే పార్వతి గుండె నీరయిపోయింది. ముప్ఫై ఏళ్ళ క్రిందట తన చేతులతో స్వయంగా పెళ్ళికూతురుగా అలంకరించిన నీరజ ముద్దు మొగం మనసులో మెదిలింది. ఫోను పక్కన పేట్టి అలా కూర్చుండిపోయింది. ఆడపిల్లలు లేని పార్వతి తోడబుట్టిన చెళ్లెళ్ళను కడుపున పుట్టిన కూతుళ్ళలా చూసుకుంది. ఆమ్మ పోయాక తనే వాళ్ళకు అమ్మ అయ్యింది. ఏ సమస్య వచ్చినా తండ్రికంటే ముందు ఆమెకే చెప్పుకునేవారు కమల, నీరజ .
ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ అర్థం అయినట్టు పార్వతి తల మీద చేయి వేసి నిమిరాడు ఆమె భర్త సారధి.
“వాళ్ళంటే ప్రాణం పెడ్తావు. ఈ పంతాలు పట్టింపులు ఎందుకు?” లాలనగా అన్నాడు సారథి.
“వాళ్ళు నన్ను అవమానిస్తే నేను పట్టించుకుని వుండేదాన్ని కాదండీ ! మా వాళ్ళకు ఎంత చేసారు మీరు? అదంతా మరచిపోయి ఎంతమాట అన్నారు మిమ్మల్ని? ”
తండ్రి దక్ష ప్రజాపతి ఆయన తలపెట్టిన యాగానికి తనను పిలవక పోయినా సహించిన శచీదేవి శంకరుడిని తండ్రి అవమానిస్తే తట్టుకోలేక పోయినట్టు సారథిని వాళ్ళు ఆన్న మాట పార్వతి గుండెకు చేసిన గాయం ఇంకా మానలేదు.
గణపతి పూజ అయ్యాక ముత్తైదువలతో పందిరి పూజ చేయించాడు పురోహితుడు.
కొబ్బరి ఆకులు చుట్టిన పందిరి గుంజలకు పూలు చుట్టి, పసుపు కుంకుమలు పెట్టి అన్ని శుభంగా జరగాలని మొక్కుకుంటున్న నీరజ కళ్ళు ఎవరి రాక కోసమో ఎదురుచూస్తున్నట్టు మాటికి ప్రహరీ గుమ్మం వైపు చూస్తున్నాయి.
తన పిచ్చి గానీ పెద్దక్క పార్వతి పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఈ పెళ్ళికి వస్తుందనే? నిరాశ తొంగి చూసింది నీరజ మనసులో.
మూడేళ్ళ్ల క్రిందట పెద్ద కూతురు పెళ్ళిలో అంతటా ఆమే అయి తిరుగుతూ, పెళ్ళి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది పార్వతి.
“అక్కా ! ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి ఎలా చేస్తానో ఏమో. ఆసలే నాకు ఆ పద్ధతులు, శాస్త్రాలు అంతగా తెలియవు. ” అని నీరజ దిగులు పడినప్పుడు వెంటనే ధైర్యం చెప్పింది పార్వతి “పక్కన నేను వుంటాను కదే అన్నీ నేను చూసుకుంటాను . నీకెందుకు చింత? ” అంటూ చెల్లెలికి భరోసా ఇచ్చింది .
ఇచ్చిన మాట ప్రకారం నీరజ పెద్ద కూతురు రాధిక పెళ్ళికి వారం ముందే వచ్చిన పార్వతి అన్ని బాధ్యతలు మీద వేసుకుని జరిపించింది.
నిజానికి పార్వతి వాళ్ళ అమ్మ పోయాక ఇద్దరు చెళ్ళెళ్ళు, తమ్ముడు బరువు బాధ్యతలు తన భుజాల మీద వేసుకుని కమల , నీరజ , రఘుల చదువులు , పెళ్ళిళ్ళు అన్నిటిలోనూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడింది పార్వతి. ఇవన్నీ పార్వతి చేయగలిగింది అంటే అది ఆమె భర్త సారధి సహకారం వలననే. ఆ తరువాత కూడా కమల, నీరజలకు పురుళ్ళు పుణ్యాలు అన్నిటికీ పార్వతి ముందు వుంది. తండ్రిని చివరి రోజులలో సారధి సహకారంతో తన దగ్గరే పెట్టుకుని ఆలనా పాలనా చూసుకుంది పార్వతి.
బుగ్గన చుక్క , నుదుట కల్యాణ తిలకం, పూలజడతో మెరిసిపోతూ పెళ్ళికూతురు రమ్య వచ్చి పీటల మీద కూర్చుంది. కలశ పూజ, ఇంటి దేవుడి పూజ అయ్యాక పీటల మీద కూర్చున్న వారికి బట్టలు చదివించే కార్యక్రమం మొదలు అయ్యింది. ముందు నీరజ తమ్ముడు రఘు పుట్టింటి వారి తరఫున అక్క బావలకు, రమ్యకు కొత్త బట్టలు చదివించాడు. నీరజ కనుసన్నతో చిన్నక్క కమల లోపలికి వెళ్ళి నీరజ కొనివుంచిన చీర , పంచలు తీసుకు వచ్చి పురోహితుడికి అందించింది.
“పెళ్ళికుమార్తె పెద్దమ్మ పార్వతి, పెద్దనాన్న సారధి ఆశీర్వదించించి చదివిస్తున్న పట్టు వస్త్రాలు అంటూ ఆ పళ్ళెం నీరజ, రమ్య ల చేతికి అందించాడు. శ్రీనివాస్ భార్య వైపు మెచ్చుకుంటున్నట్టు చూసాడు. మిగతా దగ్గరి వాళ్ళ చదివింపులు అయ్యాక వధువును, ఆమె తలితండ్రులను కొత్త వస్త్రాలను ధరించి రమ్మన్నాడు పంతులు గారు
“అదేమిటి అన్ని శుభకార్యాలకు ముందు వుండే మీ పెద్దక్క పార్వతి ఇంకా రాలేదు? నీరజ భయపడుతున్నట్టుగానే ప్రశ్నించింది పెద్ద తోడికోడలు.”
“కొంచం నలతగా వున్నదట . ఎదురుకోళ్ళ సమయానికి వచ్చేస్తుంది.” గొంతులో జీర కనబడకుండా జాగ్రత్త పడుతూ సమాధానం చెప్పింది నీరజ.
మధ్యాన్నం భోజనాలకు ముందు ఆ రోజు వండిన తీపి పదార్థం పూర్ణం పోళీలలో ఒకటి పందిరి మీద వేయించాడు పంతులు గారు . పదహారు రోజుల పండుగ తరువాత పందిరి తీసే రోజున అలాగే చేయమని సూచించాడు.
పైకి అందరితో నవ్వుతూ కబుర్లు చెబుతూ హడావిడిగా తిరిగేస్తున్నా నీరజ మనసు ఆలోచిస్తూనే వుంది. పెద్ద కూతురు రాధిక పెళ్ళిలో జరిగిన సంగతులు మెదులుతున్నాయి.
ముహూర్తం ముందురోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
*****
శుభ ముహూర్తం తెల్లవారు ఝామునే వుండడం వలన ముందురోజు సాయంత్రం ఎదురుకోలు సంబరం ముగిసాక రాత్రి ఎనిమిది గంటలనుండి రిసెప్షన్ ఏర్పాటు చేసారు. రిసెప్షన్ కు అనుకున్న దానికన్న ఎక్కువ మంది రావడం జరిగింది. తీరా మగ పెళ్ళివాళ్ళు భోజనాలకి వచ్చేసరికి కూరలు తక్కువ పడ్డాయి. మారు వడ్డించలేదని పెళ్ళివారు అనడంతో నీరజ బావగారు , పార్వతి భర్త అయిన సారధి కేటరింగ్ చేసిన వంటవాళ్ళ మీద కోపం చూపించాడు. దానితో వంట వాళ్ళు సహాయ నిరాకరణ మొదలు పెట్టి కూర్చుండి పోయారు
రసాభాసం కాకూడదని ఆడపెళ్ళి వాళ్ళు వియ్యంకులకు సర్ది చెపుతూ తామే వడ్దనకు దిగారు.
పార్వతి, ఆమె భర్త సారధి వంటవాళ్ళను శాంతింప చేసారు. . ఇంతలోనే బంధువులలో ఒకరు మాట తూలారు ” ఎంతయినా ఆడ పెళ్ళివారు కదా ఆ సారధి కాస్త అణిగి వుండక అంత దురుసుగా నోరు పారేసుకోవడం దేనికి? కొంచం వుంటే గొడవైపోయి పెళ్ళి అభాసు పాలయ్యేది. ” అని.
“మా బావగారికి కొంచం కోపం ఎక్కువ. కాస్త శాంతంగ వుండాల్సింది ” అంది నీరజ. ఆ మాట పార్వతి చెవినబడింది.
“మా ఆయన నడ్డి విరిగేట్టు చాకిరీ చేసింది ఎవరికీ కనబడలేదుగానీ వంటవాళ్ళను కోప్పడినందుకు ఆయన గారిని ఆడి పోసుకుంటున్నారు. ఆసలు ఈ పెళ్ళికి వచ్చి తప్పు చేసాము. ఇంకోసారి నీ గుమ్మం తొక్కితే ఒట్టే” అనేసి రాత్రికి అభొజనంగా వుండిపోయింది.
మరుచటి రోజు పెళ్ళి సలక్షణంగా జరిగింది. భోజనాలు అయ్యాక సంప్రదాయం ప్రకారం అమ్మాయిని అప్పగింతలు పెట్టడం , రాత్రికి శోభనం అన్నీ నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి.
నీరజతో మాట్లాడకండానే ఏ విషయంలోనూ లోటు రాకండా చూసుకుంది పార్వతి.
వాళ్ళు బయలుదేరేటప్పుడు సారధికి , పార్వతికి బట్టలు పెట్టి కాళ్ళకు నమస్కరించారు నీరజ, శ్రీనివాస్ . ” తెలియక మీ మనసు కష్టపెట్టి వుంటే క్షమించండి” అంది నీరజ. మౌనంగా వెళ్ళి బండి ఎక్కింది పార్వతి.
ఆంతే ఈ మూడేళ్ళుగా ఒక్క సారి కూడా ఫోనులొ పలుకలేదు పార్వతి.
రమ్య పెళ్ళి అనుకోకుండా పదిహేను రోజుల్లో పెట్టుకోవలసి వచ్చింది. పత్రిక పంపించి ఫోనులో ఆప్యాయంగా ఆహ్వానించింది నీరజ . వినడం తప్ప అటునుండి మౌనమే సమాధానం.
నీరజ భయపడినట్టే రమ్యను పెళ్ళికూతుర్ని చేసే రోజుకు కూడా రాలేదు పార్వతి.
” అమ్మా ! నేను , మీ అల్లుడు శ్రీశైలం వెళ్ళి వస్తాము” అని ప్రయాణమయ్యింది నీరజ పెద్దకూతురు రాధిక. ఎల్లుండి పెళ్ళి వారొస్తున్నారు. ఇప్పుడెందుకే? అన్న అమ్మ మాటకు “ఒక్క రోజులో రామూ?” అనేసి వెళ్ళింది.
అన్నట్టుగానే మరుసటి రోజు వచ్చేసింది రాధిక . వెళ్ళిన ఇద్దరు మరో నలుగురిని తీసుకు వచ్చారు.
పార్వతి, సారథి, వాళ్ళ కొడుకు కోడలు కూడా రావడం చూసి నీరజకు ఆనందంతో నోట మాట రాలేదు.
“అక్కా! నువ్వూ వచ్చేసావు ఇది చాలు అక్కా నాకు. “అంటూ అక్కని కౌగలించుకుంది నీరజ.
“రాకుండా ఎలా వుంటానే పిచ్చిదానా? ఏదో మాట మాటా అనుకున్నంత మాత్రాన ఆత్మీయ బంధాలు తెగిపోతాయా? నువ్వలా చూస్తు వుండు అన్నీ నేను చూసుకుంటాను. ఇంతకీ నా చిన్న కూతురు అదే పెళ్ళికూతురు ఏదీ? ఆంటూ లోపలికి నడిచింది పార్వతి.
తల్లికి శ్రీశైలం వెళ్తున్నట్టు చెప్పి విజయవాడలో పెద్దమ్మ పార్వతి ఇంటికి వెళ్ళింది రాధిక. హటాత్తుగా వచ్చిన రాధికను చూసి ఆశ్చర్య పోయింది పార్వతి.
“పెద్దమ్మా , పెద్ద నాన్నా మీరిద్దరూ దగ్గర వుండి నా పెళ్ళి జరిపించారు. మొత్తం బాధ్యత మీరిద్దరే మోసారు అని అమ్మ నాన్నా ఈ రోజుకూ తలచుకుంటారు. మీరు రాకపోతే అమ్మకు రమ్య పెళ్ళి ఆన్న సంతోషమే లేదు. మా అమ్మగానీ నాన్నగానీ మీ మనసు కష్టపెట్టి వుంటే చిన్నవాళ్ళు అని క్షమించేయండి. మీరు నాతో రాకపోతే మేమిద్దరం కూడా వెళ్ళము. ఇక్కడే వుండిపోతాము” చిన్న పిల్లలాగా పార్వతిని రెండుచేతులతో చుట్టేసి అన్నది. రాధిక. కరిగిపోయింది పార్వతి.
ఆప్యాయంగా సారథి భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించాడు శ్రీనివాస్ .
ఆత్మీయ బంధాలు అల్లుకున్న పెళ్ళి వారిల్లు మరింత శోభను సంతరించుకుని కళ కళ లాడింది .

శుభం

ఖజానా

రచన : సోమ సుధేష్ణ

రాత్రి నిద్రలో వచ్చిన కలల తాలూకు ఛాయలు ఉమ మోహంలో నీలి నీడల్లా కదులు తున్నాయి. ఆ నీడలను దులి పెయ్యాలని ఉమ కాఫీ కలుపుకుంది. కూతురికి లంచ్ బాక్స్ తీయాలని ఫ్రిజ్ డోర్ తీయబోయి అలవాటుగా డోర్ పై పెట్టిన ‘ఈ రోజు చేయాల్సిన పనుల’ లిస్టు చూసింది. సరసి డాన్స్ క్లాసు ఐదింటికి, వచ్చే దారిలో కొనాల్సినవి- పాలు, ఆరెంజ్ జ్యూస్, లంచ్ స్నాక్, డ్రై క్లీనర్స్ దగ్గర సూట్ పికప్ – అని ఉంది. అదే కేలెండర్ లో ఫిబ్రవరి 11th నాడు గుండె ఆకారం వేసి ఉంది. కేలెండర్ లో చిన్నగా ఉన్న ఆ సంఖ్య పెద్దదై ఉమ గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ఎనిమిదేళ్ళ క్రితం అదే రోజు నాడు…బాధ శూలంలా దూసుకు వచ్చింది. మనసులో వెలితిగా తోచి, చిన్న పిల్లలా ఒంటరితనం ఫీలయింది. నాన్నగారికంటే రెండేళ్ళ ముందే తల్లి శరీరాన్ని వదిలింది. తండ్రి కూడా ఇక లేడు అనుకుంటే ఆనాధలా అనిపించింది ఉమకు. ఇండియాకు తనకు బంధం తీరి పోయింది. ఆ ఆలోచనకే ఊపిరి అడలేదు.
“ఏమిటలా ఉన్నావ్?” కాఫీ మగ్ లోకి కాఫీ నింపుకుంటున్న సతీష్.
టోస్టర్ అవెన్ లోంచి మఫ్ఫిన్ తీసి స్ట్రాబెర్రి జాం రాసి ప్లేటులో పెట్టి అతనికిచ్చింది.
“షర్ట్ మీద క్రంబ్స్ పడుతున్నాయి.” తింటున్న సతీష్ కు నేప్ కిన్ అందిచ్చింది.
“ఎందుకలా ఉన్నావు చెప్పలేదు.”
“వచ్చేప్పుడు డ్రైక్లీనర్స్ లో మీ సూటు పికప్ చేయండి.” ఫ్రిజ్ పై మాగ్నెట్ కు అతుక్కున్న కాగితం తీసి అతని కందిచ్చింది.
“దీని కోసం అలా ఉన్నావా? పికప్ చేస్తాలే. నో ప్రాబ్లం. అదికాదులే నీ మోహంలో ఏదో కాస్త బాధ కదిలినట్టుగా అనిపిస్తోంది.” మాటల్లో ప్రేమ తోణికిసలాడింది.
“ఏదో కలల కలకలం.” బలవంతపు నవ్వు. అంతలోనే
“గుడ్ మార్నింగ్ లివింగ్ గాడ్స్!” గంపెడు బుక్స్ ఉన్న బేగ్ ను నేలమీద పెట్టి గబగబా వచ్చి తల్లి అందిస్తున్న పాలగ్లాసు, మఫ్ఫిన్ అందుకుని,
“థాంక్స్ మాతాజీ!” హడావుడిగా మఫ్ఫిన్ తింటూ పాలు తాగింది సరసి. ఉమ నవ్వింది.
“డాడ్! షర్ట్ పాకెట్ లో అలా పెన్ను పెట్టుకోకు బావుండదు. గ్రాండు పేరెంట్సు పెట్టుకుంటారు.”
సతీష్ షర్ట్ పాకెట్ లోంచి పెన్ను తీసేసింది.
“ఒక పెన్ను నా దగ్గర ఎప్పుడూ ఉండాలి అదిటివ్వు. నా బంగారు తల్లివి కదూ !”
“నా బంగారు తండ్రివి కదూ, షర్ట్ పేకేట్టులో పెట్టుకోనంటే ఇస్తాను. నీ బర్త్ డేకు అంత మంచి పెన్ సెట్ ప్రజెంట్ చెసాను, అది డ్రాయర్ లో పడేసి ఈ పిచ్చి పెన్ షర్ట్ పెకేట్టులో పెట్టు కుంటావు.” బుంగ మూతి పెట్టింది సరసి.
“నా ప్రేషేస్ ప్రిన్సెస్ వి కదూ, ఇటివ్వు.”
తండ్రి, కూతుర్ల మాటలను మందహాసంతో వింటూ అక్కడే నుంచున్నఉమకు ఖాళి మగ్ అందిచ్చి వెళ్లి బ్రీఫ్ కేసు అందుకున్నాడు.
“ఇది యక్కి పెన్” సరసి మొహం వికారంగా పెట్టింది.
“నువ్వు కూడా అందంగా ఉన్నావు.”నవ్వుతూ కూతురి చేతిలోని పెన్ లాక్కుని అలవాటు ప్రకారం షర్ట్ పేకెట్ లో పెట్టుకున్నాడు.
“ఈ సారి ఆ పెన్ తీసి పడేస్తాను నా ప్రేషస్ పాపడం.”
“కమాన్, లెట్స్ గో మిస్ ఇండియా.” హడావుడి చేసాడు.
“డాడ్ డ్రైవ్ చేస్తున్నపుడు పెద్దగా ఆర్గ్యుమెంటు పెట్టుకోకు. సతీష్ ఎవరైనా ఓవర్ టెక్ చేస్తే చిరాకు పడకు.” ప్రేమతో అప్పగింతలు పెట్టింది ఉమ. ఇద్దరు ఉమకు కిస్ తో బై చెప్పి బయల్దేరారు.
“ఐయాం రడీ పితాజీ. ఆ నర్డ్ ఇంకా అలాగే నన్ను చూసి నవ్వుతున్నాడు.”
సరసి డాడ్ తో ఏదైనా చెప్పగలదు. అ షర్ట్ వేసుకుంటే నర్డ్ లా ఉన్నావు, తల అలా కాదు ఇలా దువ్వుకుంటే హేన్ద్సం డాడ్ లా ఉంటావు. స్లీపోవర్ కు వద్దంటే ‘టిపికల్ కన్సర్వేటివ్ ఇండియన్ డాడ్ లా మాట్లాడుతున్నావు.’ అంటుంది. ఈ జీవితంలోంచి ఆ చనువు అందుకుంది సరసి.
కారు వైపు వెళ్ళుతున్న వాళ్ళ మాటలు తెరిచి ఉన్న కిటికీ లోంచి వినబడుతూనే ఉన్నాయి ఉమకు. కూతురిని స్కూల్లో డ్రాప్ చేసి అఫీసు కేల్తాడు సతీష్. కిటికిలోంచి వాళ్ళిద్దరిని అలా చూస్తూ సింక్ లో ఉన్న మురికి గిన్నెలు అన్ని డిష్ వాషర్ లో పెట్టి బెడ్ రూమ్ లో కెళ్ళింది. సతీష్ షర్ట్ ఐరన్ చేసి ఐరన్ ప్లగ్ తీసేయలేదు. ‘ఈ రోజు ఉదయం నుండే నేను పరధ్యానం పంతులమ్మను’ ఐరన్ ప్లగ్ ఊడలాగింది.
ఫ్రెష్ కాఫీతో వచ్చి బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ పక్కనే ఉన్న ఫ్రిజ్ పై కాలెండర్ లోని 11th డేట్ ‘హలో’ అంది. ఉమ మనసులో దొర్లుతున్న అలనాటి ఆలోచనలను ఆహ్వానించింది.
‘నాన్నగారు ఏ వేళలో ఏం చేస్తారో ఇంట్లో అందరికి తెలుసు. ఉదయమే లేచి కాల కృత్యాలు పూర్తి చేసుకుని యోగ చేసి తర్వాత కాసేపు పేపరు చూసి స్నానం చేస్తారు. నేను, ఉదయ్ బ్రేక్ ఫాస్ట్ తింటున్నప్పుడు నాన్నగారు కూడా వచ్చి మాతోపాటు కలిసి తినేవారు. అమ్మ నాన్నగారి కోసం వెండి పళ్ళెం, నీళ్ళ గాజు గ్లాసు, కాఫీకప్పు విడిగా ఉంచేది. ప్రతి రోజు అందులోనే తినేవారు. మాకెందుకు వెండి పళ్ళెంలో పెట్టవు అని గునిసేదాన్ని. ‘నీ పెళ్ళిలో ఇస్తాను, ఆ తర్వాత నువ్వు అందులోనే తినొచ్చు.’ అమ్మ నవ్వింది. నాకిప్పుడే కావాలని ఒక రోజు మారాము చెసాను. పెళ్ళి చేసుకోకపోతే నాకు వెండిగిన్నె ఇవ్వరేమో అని చాల రోజులు దిగులు పడ్డాను కూడా. బ్రేక్ ఫాస్ట్ తినగానే నాన్నగారు వెళ్లి ఆఫీసు గెటప్ లో టిప్ టాప్ గా రడీ అయి వచ్చి కాఫీ తాగేవారు. ఇస్త్రీ చేసిన తెల్లని షర్ట్, నలగని పేంటు, శాండిల్స్ తో ఉన్న నాన్నగారు ఆఫీసర్ లాగ హాండ్సమ్గా కనిపించేవారు.
వెళ్లే ముందు, టీ తాగి ఆ కప్పు టేబుల్ పై పెట్టి, “హోం వర్క్ బుక్ బేగ్ లో పెట్టుకోవడం మరిచి పోకండి.” ఇద్దరం తలాడించేవాళ్ళం. మా తలపై చేతితో నిమురుతూ నవ్వుతూ ‘గుడ్..గుడ్. అమ్మను విసిగించకండి.’ అంతసేపు కారు కీస్ చేతిలో కదులుతూ ఉంటుంది. ‘బై’ నవ్వుతూ వెళ్లి పోయెవారు. ఈనాటికీ అది నిన్న జరిగినట్టుగానే ఉంది.
ఉదయ్ కాస్త అల్లరి చేస్తే ఎలా బాగుపడతాడో ఏమో అని అమ్మ దిగులు పడేది. ఉదయ్ ని అందరూ ‘పోకిరి’ అనేవారు కానీ సరసి చేసే అల్లరి ముందు ఉదయ్ చాలా నెమ్మది.
‘సరసిని చూస్తే నాన్నగారు ఎంత మురిసి పోయేవారో! గ్రాండు పేరెంట్స్ తో గడపగలగడం కూడా ఒక అదృష్టమే.’ దీర్ఘంగా నిట్టూర్చింది.
‘సరసి తీరే వేరు. తల్లి, తండ్రితో చనువుగా ఉంటూ ఫ్రీగా మనసులో ఉన్నది మాట్లాడు తుంది. ‘ఐ లవ్ యూ’ అని రోజుకు ఎన్ని సార్లైనా చెప్ప్పగలదు. సంతోషంగా ఉంటె వెంటనే కౌగలించుకుని ముద్దు పెడ్తుంది. నేనెప్పుడూ అమ్మకు గాని నాన్నగారికి గాని ‘ఐ లవ్ యు’ అని చెప్ప్పిన గుర్తు లేదు. నాన్నకు నేను, ఉదయ్ అంటే ఎంతో ప్రేమ ఉండేది. నేను, తమ్ముడు ‘నాన్నగారు’ అని పిలిచే వాళ్ళం. అదేమో కానీ మరో విధంగా పిలవడం ఊహకే అందేది కాదు. ప్రేమకు మాత్రం ఎక్కడా లోటుండేది కాదు. ఏదైనా కావాలంటే అడగడంలో, అల్లరి చేయడంలో మేము నాలుగు ఆకులు ఎక్కువే చదివాం. తండ్రి తన నుదుటిపై ముద్దు పెట్టు కోవడం, తలపై ప్రేమగా నిమరడం ఎంతో ఆత్మీయత కనిపించేది.’ అది గుర్తు రాగానే తండ్రిని దగ్గరగా చూడాలని ఉమ మనసెంతగానో తపించింది. చిన్నప్పుడు ఉమను ఎత్తుకుని గిర్రున తిప్పి “నా బంగారు తల్లి” అనేవారు.
ఆయన సంతోషం ఇల్లంతా వ్యాపించేది. కుటుంబంలోని మనుషుల మధ్య అనుబంధాలే వేరుగా ఉండేవి. భావాలన్నీ తెలిసినా బహిరంగంగా చెప్పలేని అదృశ్య నిబంధన. మనుష్యుల మధ్య లేదనిపించే దూరం ఉండేది. కానీ మనసులు కలిసి పోయి ఉండేవి. బందుమిత్రులు అందరూ చేయి చాపితే అందేంత దూరంలో ఉంటూ, పిలిస్తే వచ్చేసేవారు.’
ఆలోచనలు ఆడుకుంటున్నాయి .
‘నాన్నగారు సాయంత్రం రాగానే మాతో కాసేపు ఆడుకునేవారు. అప్పుడప్పుడు మాకోసం పళ్ళు, మిఠాయి, పూలు కొనుక్కొచ్చేవారు. గులాబీలు, మల్లెలు అంటే నాన్నగారికి చాల ఇష్టం. దొడ్లో రెండు గులబీ చెట్లు నాటారు. మొదటిసారి తెల్ల గులాబీ పూవులు పూసినపుడు రెండు తెచ్చి ఒకటి నాకు మరోటి అమ్మకు ఇచ్చారు. మల్లె చెట్టుకు పందిరి కూడా వేసారు. క్రోటన్ మొక్కలను గుండ్రంగా బంతి ఆకారంలో కత్తిరించేవారు.. మేము హోంవర్క్ చేస్తుంటే నాన్నగారు న్యూస్ పేపర్ లేదా ఏవో బుక్స్ చదువుతూ మా పక్కనే కూర్చునేవారు. ఎక్కువగా వివేకానంద బుక్స్ చదవేవారు. అవి పెద్దగా, బరువుగా ఉండటం నాకు బాగా గుర్తు. ఎప్పుడేనా నాన్నగారు పుస్తకంలోని పేజీలు గబగబా తిప్పుతూంటే కోపంగా ఉన్నారని మాకు తెలిసి పోయేది. ఉదయ్, నేను కిక్కురు మనకుండా హోం వర్క్ చేస్కునేవాళ్ళం.
సరసి ఆలోచనే వేరు. సతీష్ కాస్త సీరియస్ గా ఉంటే చాలు రెండు నిమషాల కంటే ఎక్కువసేపు భరించలేక ‘అలా సీరియస్ గా ఉంటే నాకేం బాలేదు. నాకు దిగులుగా ఉంది.’ అని బిక్క మొహం పెడ్తుంది. వెంటనే సతీష్ నవ్వేసి కూతురితో కబుర్లు చెబుతాడు. సరసి కాబట్టి అలా జరిగింది.
నాన్నగారి పుట్టినరోజు నాడు బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి ఒక్క గోధుమ రొట్టె నా చేతులతో స్వయంగా చేసి పెనం మీద కాల్చి వడ్డించాను. నాన్నగారు ఎంత ఇష్టంగా తిన్నారో నాకు ఇంకా గుర్తున్నది. దగ్గర ఉండి కూర కూడా వడ్డించాను. స్కూల్లో నా స్నేహితులందరికి చెప్పాను. తర్వాత అమ్మ నాకు రొట్టె చేయడం నేర్పించినపుడు చెప్పింది మందంగా చేస్తే రొట్టె కాలక పిండి పిండిగా ఉంటుందని. పెద్దయ్యాక చాలాసార్లు చేసాను. కానీ నేను నాన్నగారికి చేసి వడ్డించడం నా ఖజానాలో దాచుకున్నాను.
కొన్నిసార్లు అందరం పార్కుకు వెళ్ళేవాళ్ళం, వచ్చేప్పుడు హోటల్లో డిన్నర్ తిని వచ్చేవాళ్ళం.
అది నా ఫెవరేట్ డే. అమ్మ, నాన్న కలిసి సాయంత్రాలు బయట కెళ్ళడం తక్కువే. ఎప్పుడేనా వెళ్ళడానికి అమ్మ తయారవుతూ ఉంటే నేను అమ్మ దగ్గరే నుంచుని చూసేదాన్ని. నీలం చీర, ముత్యాల గొలుసు, ముత్యాల కమ్మలు పెట్టుకుని అమ్మ చాల అందంగా ఉంది. నాన్నగారు కూడా తెల్ల బట్టలు వేసుకుని విజిల్ వేస్తూ కారు కీస్ ఊపుతూ నిలబడ్డారు. ఎడేళ్ళున్న నాకు నేను వేసుకున్న ఆకుపచ్చ ఫ్రాకు బరువై పాతదనిపించింది. వాళ్లతో వెళ్ళనందుకు అలా అనిపించిందని తర్వాత తెలుసుకున్నాను. నాన్న నన్ను దగ్గరగా తీసుకుని ‘రాములమ్మను విసిగించకుండా తమ్ముడితో ఆడుకో. నీకు మిఠాయి తెస్తాగా అమ్మకు చెప్పకు.’ అని నా చెవిలో రహస్యం చెప్పారు. నా రెండు చేతులు పట్టుకుని సుతారంగా ‘లాలలా లాలా’ పాట విజిల్ వేస్తూ ఇంగ్లీషు మూవీలో లాగ డాన్స్ చేసాం. ‘నా బంగారు తల్లివి.’ అని ముద్దిచ్చారు. అవి నా జీవితంలోని బంగారు ఘడియలు. నాన్న నా ఎవర్ గ్రీన్ హీరో.
శనివారం వేంకటేశ్వరుని గుడికి వెళ్లి నపుడు అమ్మ అన్నం లడ్డూలు చేస్తుంది. నాకు అవి చాల ఇష్టం. అన్నం, ఆలుగడ్డలు ఇంకా చాలా వేసి వండాక నాన్నగారు, అమ్మ ఇద్దరూ కలిసి వాటితో పెద్ద లడ్డూలు కట్టేవారు. నా రెండు చేతులలో కూడా పట్టనంత పెద్దగా ఉండేవి. వాటిని గుడి ముందు కూచునే బిచ్చగాళ్ళకి ఒక్కొక్కరికి ఒకోటి పేపర్లో పెట్టి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు సంతోషంగా తింటూంటే నేను, ఉదయ్ కూడా ఉత్సాహంతో ఇచ్చి ఆ తర్వాత గుళ్ళో కేల్లెవాళ్ళం. ‘వాళ్ళ కడుపులో దేవుడుంటాడు. మనం ఇచ్చిన ఆహరం తిని ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు’ అని నాన్నగారు చెప్పారు. అలాంటి సంఘటనలు ఎన్నింటినో నా ఖజానాలో దాచుకున్నాను.
*****************
“మాం!” స్కూల్ నుండి వచ్చిన సరసి తల్లి మొహం చూసి,
“మదర్ థెరీసా! సేవలతో అలసి పోయావని ఫేస్ చెప్తోంది. నేను హెల్ప్ చేస్తాను, ఏ పని చేయాలి?”
“నేను చేసుకుంటాలే. నువ్వెళ్లి నీ హోమ్ వర్క్ చేసుకో. ఈ రోజు నా ఖజానా తెరిచి నా నాన్నగారిని ఆహ్వానించాను.”
“నేను కూడా గ్రాండ్ పాను మిస్సవుతున్నాను మమ్మీ. ఉంటే ఎంత బావుండేది. సియ గ్రాండ్ పా లాగే నాక్కూడా అన్నీ కబుర్లు చెప్పుకోవడానికి బావుండేది.”
“అవును, ఉంటే చాలా బావుండేది. ఎనిమిదేళ్ళ క్రితం ఈ రోజు నేను గ్రాండుపా దగ్గిరే ఉన్నాను.”
“అప్పుడు నన్ను సియ వాళ్ళింట్లో వదిలి వెళ్ళావు. నాకు గుర్తుంది మమ్మీ.”
“అవును ఇండియా నుండి వచ్చిన మూడు నెలలకే మళ్ళి వెళ్ళాల్సి వచ్చింది.”
సరసి తల్లికి దగ్గరగా వెళ్లి హగ్ కిస్ ఇచ్చి, తల్లి మొహంలోకి కాసేపు చూసి హోమ్ వర్క్ లో మునిగిపోయింది.
ఎనిమిదేళ్ళ క్రితం ఉన్నట్టుండి తండ్రిని చూడాలనే బలమైన కోరిక కలగడంతో వెంటనే సరసిని తీసుకుని ఇండియా వెళ్ళింది ఉమ. ఆరునెల్ల క్రితమే ముగ్గురూ వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్ళారు. ఉమ కూతురితో మళ్ళి రావడం, సతీష్ వెంట లేకపోవడంతో చూసి కూతురిని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసాడు తండ్రి. చూడాలని అనిపించి వచ్చానంది. తండ్రిలో వచ్చిన మార్పు చూసి గాబరాపడింది. ఒక్కుమ్మడిగా వయస్సంతా వచ్చి మీద పడ్డట్టుగా చిక్కిపోయి ఉన్నాడు. విజిల్ వేస్తూ ఎంతో తీయగా పాటలు వినిపించే నాన్న ఇప్పుడు ఊపిరి తీయడానికే బాధ పడ్తున్నారు.
డాక్టరు దగ్గరకు వెళ్దామని ఉమ ఎంత వత్తిడి చేసినా ఆరోగ్య సమస్య ఏమీ లేదు. వయస్సు నాతో పరాచికాలాడుతోంది అంటూ నవ్వాడు. తరుచుగా అలసిపోయి వెళ్లి విశ్రాంతి తీసుకునేవాడు. అతనిలో తిండి మీద అయిష్టం, మనుషుల మీద నిరాసక్తత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో, ఒంటరిగా ఉండటం విషయంలో ఉదయ్ ఎన్నిసార్లు వాదించినా, ప్రేమగా చెప్పినా అతను అసలు పట్టించు కునే వాడు కాదు’.
ఉమ, సరసి ఉన్న మూడు వారాలు సంతోషంగా గడిపాడు. తిరిగి అమెరికా ప్రయాణం రెండు రోజుల్లో ఉంది. ఉమ మనసులో అలజడి. డేట్ మార్చుకుని ఇంకా కొన్ని వారాలు ఉండాలనుకుంది. కానీ తండ్రి ససేమిరా కుదరదు సతీష్ ఒక్కడే ఉంటాడు వెళ్ళాల్సిందే అన్నాడు.
ఎయిర్ పోర్టులో ఓపిక లేకున్నా చాలా సేపు అలా నిలబడి ఉమను, సరసిని చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.‘నాన్నగారు! మీ ఆరోగ్యం జాగర్తగా చూసుకోండి.’ అంటున్న ఉమను గుండెలకు హత్తుకున్నాడు. ‘నా బంగారు తల్లి’ అంటున్న నాన్నగారి కళ్ళ ల్లోంచి నీటి చుక్కలు రాలాయి.’
ఏనాడూ తండ్రి కళ్ళల్లోంచి నీళ్ళు రావడం చూడని ఉమకు గాబరాగా అనిపించింది. కంటిలో ఊరె నీటిని వెంట వెంటనే తుడుచుకుంటున్నాడు. -ఆ కొద్ది క్షణాలు కనిపించే బిడ్డలను స్పష్టంగా చూడాలని గాబోలు. ఉమ కూడా కన్నీటిని తుడుచుకుంటూ తండ్రిని అతను ఊపే చేతిని చూస్తూ తండ్రి ప్రతిమను మనసులో నిలుపుకుంది. కనుమరుగయ్యే వరకు ఊపుతున్న తండ్రిని చూస్తూ తాను చెయ్యి ఉపుతూ వెనక్కి మరీ మరీ చూస్తూ ఉమ ముందుకు కదిలింది. అదే ఆఖరి చూపు అవుతుందని ఉమ అనుకోలేదు.
ఆ తర్వాత మూడు నెలలకే తండ్రి సీరియస్ అని ఉదయ్ చెప్పడంతో ఉమ వెంటనే ఇండియా వచ్చినా స్పృహలేని తండ్రిని ఐ సీయులో చూసింది.
తండ్రి చిక్కి పోవడానికి కారణమేమిటోఉదయ్ చెప్పే వరకు ఉమకు తెలీదు. నాన్నగారికి డిప్రెషన్ ఒక వ్యాధిలా ముదిరిందని డాక్టర్ చెప్పాడట. అమ్మ చనిపోయాక నాన్నగారు ఎప్పుడూ సంతోషంగా లేరు. వాళ్ళ పెళ్ళయ్యాక నాణేనికి రెండు వైపులా ఉండే బొమ్మ, బొరుసులాగ బతికారు. ఎటూ వెళ్ళినా, ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. అమ్మ లేని జీవితం ఎంత శూన్యంగా ఉందో! తిండి మీద ధ్యాస లేదు. మనుషుల మీద ఆసక్తి లేదు. అన్నాళ్ళ అనుబంధం! అతన్ని తీరని మనోవేదన తినేస్తోంది.
‘నాతో వచ్చేయండి నాన్నగారు’ విషాదాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తూ, ‘అమ్మ పోయిన ఇంట్లోంచే నేను పోతానమ్మా, నాకిక్కడే ఉండాలని ఉంది. ఉదయ్ కు కూడా ఈ మాటే చెప్తున్నాను.’
‘ఆ మాటల విన్నాక మరెప్పుడూ నాతో రమ్మని అడగలేదు. దేనికి బలవంతం చేయలేదు’. ఎంత శక్తిని పుంజుకుని ఎయిర్ పోర్టుకు వచ్చి ఉంటాడో తలుచుకుని ఉమ రోదించింది.
ఈ పరదేశం వెళ్ళడం, ఈ దూరాలు ఎందుకు ఏర్పరచుకున్నాము అని ఉమ మనసు విల విల లాడింది. ‘విదేశాలకు వెళ్తుంటే ఆప్తులను వదిలి వెళ్ళాలి, ప్రాణాలు పొతే ఆప్తులను వదిలిపోవాలి. అందల మెక్కిస్తూ, అధః పాతాళానికి తోసే ఈ ఆత్మీయత, ఈ అనుబంధం ఎందుకు సృష్టించావు భగవంతుడా! ఈ మనఃస్తాపాన్ని దాటటానికి ఆధ్యాత్మిక చింతన అన్నావు కాని ఆ జ్ఞానం లేని వాళ్లు కోకొల్లలు ఇలా నలిగి పోవలసిందేనా!’ ఉమ మనసు బాధతో సుళ్ళు తిరిగింది.
పియానో చప్పుడు వినిపించి ఉమ తానున్న ప్రపంచంలోంచి బయటికి వచ్చి కళ్ళు తుడుచుకుంది. ఉమ మనసు ఇప్పుడు కాస్త తేలికగా ఉంది. ఉదయమంత బరువుగా లేదు.
సరసి పాడుతూ పియానో ప్లే చేస్తోంది.
“మాం! నా హోమ్ వర్క్ అయిపొయింది. ఓ..నువ్వింకా అలాగే ఉన్నావా! మమ్మీ! తాతయ్య అరవై ఏళ్లకే చనిపోయాడు. సియ తాతయ్య డేబ్బైఐదు ఉంటాడు. సియతో చాల గేమ్స్ ఆడతాడు. నా తాతయ్యకు ఏమయింది మమ్మీ?”
“అందరు ఒక్కలాగే ఉండరు. కొందరు ధృడంగా ఉండి ఎక్కువకాలం జీవిస్తారు. తాతయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చింది. బలహీనంగా ఉండటంతో తట్టుకోలేకపోయారు. మన అదృష్టం నువ్వు, నేను వెళ్లి మూడు వారాలు తాతయ్యతో సంతోషంగా గడిపాం.”
“తాతయ్యను మన దగ్గరనే ఉంచుకుంటే మనం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం కద మమ్మీ.”
“అవును. తాతయ్యకు ఆ ఇల్లు వదిలి ఎవరి దగ్గరా ఉండటం ఇష్టం లేదు. అందుకే తాతయ్య బెంగుళూరులో ఉన్న ఉదయ్ మామ దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఆ ఇంట్లోనే ఉండాలని అతని కోరిక.”
ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఒంటరి తనాన్ని భరించలేక డిప్రెషన్ లో జీవిస్తున్నాడని ఆ బలహీనతలో హార్ట్ ఎటాక్ ను తట్టుకోలేక పోయాడని సరసికి ఎలా చెప్పాలో ఉమకు తట్టలేదు.
నా మనసులోని ఖజానా తెరిచి దుఃఖించే నా మనసును ఓదార్చాను.
‘నాలాగా సరసికి కూడా మరపురాని సంఘటనలు ఉంటాయా! నాలాగే ఖజానాలో దాచు కుంటుందా!’
ప్రదర్శించే పద్దతి వేరైనా ఆనాడు ఈనాడు అంతే ప్రేమ అంతే ఆత్మీయతలు ఉన్నాయి. ఆశలు, అవకాశాలు తన మనసును లొంగ దీసుకోకుండా ఉంటే సరసి కూడా నాలాగే అతి ప్రియతమమైన బంధాలను తన ఖజానాలో దాచుకుంటుంది.
మనసులో ప్రేమ ఉండాలే కాని బంధాలు నిలవడానికి ఏ పద్ధతి అయితేనేమి! భగవంతుడి పై మనసుండాలే కానీ యోగమైనా, యాగమైనా– సన్యాసమైనా, సంసారంమైనా గమ్యం ఒక్కటే. అన్నింటికి మనసు ఉండాలి, ఆ మనసులో ఉండే పవిత్రమైన ప్రేమ ముఖ్యం.

***** సమాప్తం *****

“పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా? “

రచన: కన్నెగంటి అనసూయ

“సరోజ్నే…సరోజ్నే…! లోపలేంజేత్తన్నావో గానీ ఓసారిలా వత్తావా బేటికి..”
గుమ్మం ముందు నిలబడి అదే పనిగా పిలుత్తున్న గౌరమ్మ గొంతిని లోపల బోషాణం పెట్టెలో ఏదో ఎతుకుతున్న సరోజ్ని ఇంకో రెండడుగులేత్తే లంగా సిరిగిపోద్దా అన్నంత ఏగంగా వచ్చేసింది పెద్ద పెద్ద అంగలేసుకుంటా..
“ఏటి గౌరొదినే..ఇంత పొద్దున్నే..ఇలాగొచ్చేవ్..?” అంది ..
“ఏవీ లేదు ..పెసరొడేలు పెడదావని..తవ్విడు పప్పు నానబోసేను..గబ గబా పని కానిచ్చుకుని ఒకడుగు అటేత్తావేమోనని..”
“..వత్తాన్లే గానీ మొన్నేగదా పెట్టేవు..కుంచుడో, మూడడ్లో అయినాయన్నావ్..? మల్లీ ఇయ్యెంతుకు?”
“పిల్లడిగింది..దానికి పెసరొడేలే ఎక్కువ కావాలంట. ఆల్లాయనకి రాత్రుల్లుమాటు సాంబారులోకి రోజూ వడియాలుండాలంట. దాని పెళ్లైన కొత్తలో..పొయ్యి పక్కనే మూకుట్లో నూనోసి దానామట్నే ఉంచి అందులోనే ఏపేత్తా ఉంటే మా సెబ్బరి పడిపోయేది..మరిగీ మరిగీ వడేలు ఏపినప్పుడల్లా ఇల్లంతా కంపమ్మా..అని.
ఆల్లకి వడియాలు బాగానే కరుసవుతాయ్. పెట్టుకోపోయావా అదెంత పనంటే..ఆ అపార్టుమెంటుల్లో నాకెలాక్కుదురుద్ది అంతది..”
“అదీ నిజవేలే..మరి. పైనెక్కడో టెర్రస్ మీదెట్టుకోవాలి. ఎండేదాకా అక్కడే కూకోవాలి. అయ్యన్నీ అయ్యే పన్లేనా?”
“అంతుకే..పనయ్యాకా ఒకడుగెయ్..”అంటా రెండడుగులేసి..
“వత్తానే సరోజ్నీ..అల్లం, పచ్చిమిర్గాయ్ ముక్కలు కోస్కోవాలి..”
“సర్లే ..” అని లోనకడుగేసిన సరోజ్ని..గబ గబా పన్జేసేసుకుని నాలుగు సెంబుల్నీల్లు ఒంటి మీంచి గుమ్మరిచ్చుకుని గౌరమ్మ ఇంటికేసి..ఎల్లింది. అప్పటికే ఆ ఈధిలో కిట్టవేణి, గౌరమ్మా. ..మంచం పక్కమ్మటా ఎత్తు పీటల మీద కూకుని రెండోకంటోల్లకి ఇనపడకుండా గుసగుసలుగా మట్తాడుకుంట్నారేవో..సరోజ్నిన్జూసి ఆపేసి మొకం నిండా మెరిసిపోయే రంగులల్లే నవ్వు పూసుకుని లోనకి రమ్మన్నారు.
తనొత్తంతోనే ఆల్లాపేసినంతుకు కాసేపు అదోలాగున్నా అంతలోనే మాటల్లోబడి..
ఆ మాటా ఈ మాటా మాట్టాడుకుంటుంటే…పక్కింటి సేసమ్మ..”గౌరొదినే..! తవ్విడే అన్నావని రాలేదు.ఒకడుగెయ్యమంటావా..” అంటా వచ్చి అక్కడే సరోజ్ని ఉంటం సూసి గౌరమ్మ ఏంజెప్పుద్సో ఇందావని గూడా సూడాకుండా వచ్చిందొచ్చినట్తే ఎల్లిపోయింది ఎనక్కి..
ఎంత్కో సరోజ్నికి అర్ధం కాలేదు…
“వచ్చిందెలాగూ వచ్చింది..లోనకొకడుగేత్తే పోయిందేవుందో..!” లోపలనుకోబోయి పైకే అనేసింది సరోజ్ని.
అప్పటికే మొగుడికి టీ పెట్టాలని కిట్తవేణి ఎల్లిపోయిందేవో..గౌరమ్మా, సరోజ్నీ ఇద్దరే ఉన్నారు..
“అన్నట్టు..మొన్నామజ్జన పెసరొడేలెట్టినప్పుడు..సేసమ్మని పిల్వలేదా ఏటి నువ్వు..”
అంది గౌరమ్మ..పెసరొడియాల పిండి సేతిలోకి తీసుకుని..సరోజ్ని వంకే సూత్తా..
“అయ్యా..ఇది మరీ బాగుంది. సేసమ్మనెంతుకు పిల్వలేదు.మా గిలకనంపితేని.
కేకెయ్యలేదని సెప్పిందా..? దాన్నోరడిపోను..సెల్సిత్తం ముండ..”
కోపంతో..కయ్యుమంది సరోజ్ని.
“అయ్యో..ఊరుకో..! మల్లీ ఇందంటే అదొగ్గోల..ఎంతుకొచ్చిన గొడవ. “నసిగింది గౌరమ్మ..
“మా గిలకెల్లొచ్చింది. పిల్సినోల్లందరూ ఒచ్చేరు..సేసమ్మే రాలేదు. ఏమ్ములిగిందో ఏవోలే అనుకున్నాను. అంతుకేనా పిండొడియాలు పోసుకుంటా అందర్నీ పిల్సి నన్ను పిలవలేదు..”
అంది సరోజ్ని..గుడ్ద మీద పెద్ద బఠాని సైజులో పెసరొడియాలు కొస్రి కొస్రి పెడతా..
“ఏదో ..తిరగేసుకుంది..కారాలు కొట్టుకున్నా..ఆవపిండ్లో పోటేసుకున్నా.. ఆవకాయలప్పుడైనా .. వడియాలూ అప్పడాలూ పెట్టేటప్పుడైనా ఈధిలో వోళ్లం అంతా ఒకరికొకరం సాయం సేసుకుంటా రాబట్టే గందా..సులాగ్గా అయిపోతన్నయ్..మరెంతుకు పిలవలేదో..అని తిరగేసుకుందిలే. అంతే .అంతకన్నా ఏవన్లేదమ్మా..పాపం..ఏమాటకామాటే సెప్పుకోవాలి..”
“అందుకే నన్నూ పిల్వలేదు..సరిపోయింది. అయినా గిలకనడుగుతానుండు..పిల్సిందో లేదో..! దానికి గుణం కుదిరితే పిలుత్తుది. ఇట్టం లేపోతే పిలవదు..”
“అడిగి సూడు..ఇలాటియ్యే..సిలికి సిలికి ఈదురుగాల్లవుతాయనేది మాయమ్మ..”
అయ్యాల మజ్జానం బళ్లోంచి కిలక అన్నానికని ఇంటికొచ్చినప్పుడు..అడగనే అడిగింది సరోజ్ని..”ఏవే గిలక..! అయ్యాల పెసరొడియాలెట్టిన్నాడు సేసమ్మామ్మని పిలవమన్జెప్పేను. పిల్సవా? ఎల్లి..”
“ఊ..ఊ..” అంటా ఆలోసిత్తా అల్లమ్మొంకే సూత్తా నిలబడిపోయింది అయ్యాలని గుత్తు దెచ్చుకుంటా..
అయ్యాల..తెల్లారి కాసేపయ్యిందేవో..
అప్పుడే నిద్దర్లేసి కల్లు నులుముకుంటా తిన్నగా వంటింటికాడికొచ్చిన గిలకెనక్కి సూత్తా..
“.అదిగో..ఆ గెడంచీ మీద డబ్బులెట్టేను. భద్దర్రావ్ కొట్టుకాడికెల్లి పావుకేజీ అల్లమిమ్మని పట్రా .”
అన్నవారుత్తానే వారకంట్న గిలకమ్మని సూత్తా అంది సరోజ్ని.
అల్లవనగానే గిలకనోట్టో నీరూరిపోయి..కల్లింతంతజేస్కోని..
“అల్లవెంతుకే అమ్మా..! పెసరట్టేత్తన్నారా?” అంది..ఆశగా..
“ఎప్పుడూ తిండిగోలే..ఏత్తే ఏత్తాన్లే. పెసరొడియాలెడతన్నాం..నువ్వెల్లి అల్లం పట్రా..”
పన్జేసుకుంటానే అంది సరోజ్ని..
“దాన్ని కాతంత మొకంకడుక్కోనీ. పాసి ముఖంతో ఎల్లద్దా..? నీ సేదత్తం ఎక్కడికోయింది? “అని కూతురితో అని..గిలకెనక్కి తిరిగి..
“ఎల్లు. తూంకాడికెల్లి సుబ్బరంగా పళ్ళుదోంకొన్రా. తెల్లగా మెరిసిపొవ్వాలి..” అంది అక్కడే రోట్టో పెసర పిండి రుబ్బుతున్న గిలకాళ్ల అమ్మమ్మ.
ఆవిడి ఏసంకాలంలో కూతురు పిండొడియాలూ, అప్పడాలూ , పెసరొడియాలూ, పచ్చల్లు పెట్టుకుంటాదని సాయంజేత్తాకి వచ్చి నెలా, నెలాపదేన్రోజులు కూతురింటికాడే ఉండిపోద్ది.
అప్పటికొచ్చి వారంరోజులవ్వుద్దేవో..అప్పటికే పిండొడియాలెట్టేసి ఎక్కడా తడన్నది లేకుండా ఇరగెండబెట్టేసి దబ్బాల్లోకెత్తేసేరు.
ఇయ్యాల పెసరొడియాలెడదామని తెల్లారగట్ట లేసి పెసరపప్పు నానబోసేరు.
మినప్పప్పుల్లాటియ్యయితే రేత్రికాడ నానబెట్టుకున్నా పరవాలేదుగానీ పెసరపప్పు మాత్రం మూడు నాలుగ్గంటల ముందే నానబెట్టాలని సరోజ్ని ఆల్లమ్మమ్మాళ్లూ సెప్తా ఉంటం గేపకేవేనేవో..
తెల్లారగట్త నానబెట్టేరు.
“ఏసంకాలం ఎండ బేగినే వచ్చేత్తింది. పొద్దున్నే కాపీల్తాగి.. ఆరింటికల్లా రుబ్బుతుం మొదలెట్తేత్తే…ఎండెక్కే టయానికి అయిపోతయ్యి. ఏటే అమ్మా… !” అంది సరోజ్ని ఆల్లమ్మతో..
“అంత పొద్దున్నే రుబ్బేత్తే పెట్టీవోల్లో? పెట్టీవోళ్లుండద్దా? ..మనక్కోడి కూసేసిందని ఇరుగూపొరుగోల్లక్కూడా కూసేత్తాదా? సేత్రం సెప్పినట్తుంది .. ఏడింటికి మొదలెడితే రెండుమూడు వాయలయ్యాకా పిలుత్తానని ముందే కవురెట్టు. నీడపట్టున కూకుని పెట్టేసి పోతారు. ఎండెక్కే కొద్దీ సిరాకొత్తాది ఎవురికైనాను..”
“సర్లే అయితే ..! గిలక లేసేకా కవురెడతాను..అయితే ఎంత పప్పోద్దాం..? అంది సరోజ్ని..ఆల్లమ్మనెక్కే సూత్తా..
“ఉల్లిపాయలూ..పచ్చి మిర్గాయలూ సూసేవా సరిపడా ఉన్నయ్యో లేవో..?”
“సూర్రావ్ సేలోకంపి నిన్నే కేజీకాయల్దెప్పిచ్చేను…”
“సరిపోతయ్యా..?” ఆల్లమ్మ గొంతులో ఆత్రం..
“అయ్యబాబోయ్..కుంచెడు పప్పు పెసరొడియాలకి సరిపోతయ్యయ్యి. పైగా వరం కాయలు కాదు. పొట్టి కాయలే. కారం బాగానే ఉందంట. వల్లూరోరి రాఘవమ్మ సెప్పింది. రాఘవమ్మక్కడ్నించే తెప్పించ్చిందట పచ్చిమిర్గాయలు. తనే సెప్పింది. లేపోతే నాకెక్కడ తెలుత్తాది..తనెట్తేసిందిలే. కుంచెడు పప్పోసి పెట్తేసింది. అయిదార్రోజులు అదే సరిపోయింది ఈది ఈదందరికిన్నీ..”
“కుంచెడు పప్పే? వామ్మో..! అన్నెంతుకో..?” బుగ్గమీచ్చెయ్యేసుకుని తెల్లబోతా అంది..సరోజ్ని ఆళ్లమ్మ.
“కూతురు పెళ్ళికుందిలే..! కుదిరితే పెట్తాలి కదావియ్యవోల్లకి కావుళ్ళు. అంతుకే అన్నీ ఎక్కువెక్కువే పెట్టి డబ్బాల్లో పోసేసుకుంటంది..పచ్చళ్ళు కూడా పెట్తేసుంచుకుంటదంట. కారలయ్యీ కొట్టిచ్చేసి కుండల్లో అణిసణిసి వాసిని గట్టి మరీ మసిరి మీదెట్టేసింది..”
“కుదరా పోతేనో..” అని ఒక వంకర నవ్వు నవ్వి..
“అప్పుటికప్పుడు పెట్టుకుంటే అవ్వదా ఏటి? ఉట్టు పట్తేత్తన్నాయ్ పురుగులు..”
“నువ్వూ బానే సెప్తాయ్. ఏసంకాలం అయితే బాగా ఎండుతాయ్. వాన్లడ్దాకా ఎండద్దా?
ఎండ రాపోతే అయ్యలా సాగుతా ఉంటాయ్ గుడ్ద మీద. నూన్లాగేసి అస్సలు బాగోవు ఏయించేటప్పుడు. కూరకైతే తప్ప..” అని అక్కడకదాపేసి..
“సర్లేగానీ ..కారం మరీ ఎక్కువైపోతే పిల్లలు తిన్రే అమ్మా..! ఆల్లు తినాపోతే ఇంకెంతుకు ఇంత
కట్తవూను..”
“అంతేలే..కానియ్. రెండు తవ్వల పప్పోత్తావా? ఇంకా తగ్గిద్దావా?”
“పోసేద్దాం లే. ఎండేకా సూడొచ్చు సరిపోతయ్యో లేదో. సరిపోపోతే అప్పుడే సూడొచ్చు.. “ “వద్దులే పోసేద్దాం. సీకట్లో లెగుత్తుం ఎంతుక్కానీ సెప్తే…కొలిసేసి దాకలో పోసేసి..దాకా, నీళ్ళూ మంచంకాడెట్టుకుంటాను. మెలకువ రాగానే దాకలో నీళ్ళోసేత్తాను..ఇంక లెగవక్కాలేదు..’ అంది సరోజ్ని..
సర్లెమ్మని రెండు తవ్వల పప్పు కొల్సి సేట్లో పోసి..ఆ పక్కనే సీవెండి దాకలో నీళ్ళు కూడా పోసేసి పడుకునే ఏల లైట్లన్నీ ఆరిపేసాకా..సరోజ్ని మంచం కాడెట్టింది..
పెందలాడే లేసి రోజూ కంటే ముందే కాతంత ఉడకేసి అక్కడ పడేసి..పప్పుకడగటం మొదలెట్టింది పెద్దావె. ఆవిడ కూతురింటో ఉన్నన్నాల్లూ..తనే వండుద్ది పొయ్యి కాడ కూకుని..
వంటయ్యిందనుకున్నాకా పప్పురుబ్బటం మొదలెట్టిందేవో..
సరోజ్ని ఇల్లిపాయీ, పచ్చి మిర్గాయీ సన్నగా ముక్కలు కోత్తుంటే గిలక లేసొచ్చిందేవో..అల్లానికని దాన్ని కొట్టుకాడికంపి అదొచ్చేకా..ఆ ఈధిలో ఇరుగూపొరుగోల్లు సేసమ్మ, గౌరమ్మా, కిట్తవేణి, సొరాజ్జం అందరికీ సెప్పి రమ్మని పంపింది..
అయ్యన్నీ గేపకవొచ్చి..
“సెప్పలేదు..” అంది గిలక ఆల్లమ్మతో..
ఆ మాటతో తెల్లబోయింది..సరోజ్ని..
“సెప్పమని సెప్పేను గదా సిలక్కి సెప్పినట్టు. నీకేమ్ పొయ్యేకాలవొచ్చిందే పిలవాపోతాకి?
అంతుకే నన్ను పిల్లేదంట..మొన్నాల్లింటికి..సిచ్చేట్టెవ్ గందా..?” కసురుకుంది కూతుర్ని..
“అయినా పెద్దోల్లు సెప్పినట్టు సెయ్యాలిగందా..సొంత పెత్తానాలేంటో..? ”అక్కడే కగోడకానుకుని కూచ్చుని వత్తులు సేత్తన్న పెద్దావె అంది..
“కావాల్నే సెప్పలేదు..”
“అదే ఎంతుకంటన్నాను..నేను సెప్పమన్నప్పుడు సెప్తే నీ సొమ్మేం పోద్దో..”
“నాకా సేసమ్మామ్మ ఇట్టం లేదు..”
“నీ ఇట్టం ఎవడిక్కావాలి? నేన్సెప్పమన్నాను సెప్పాలి . అంతే..
“సెప్పను. ఆ సేసమ్మామ్మ..ఆల్లింట్లో తాతమ్మ ఉంటస్సూడు. ఆ తాతమ్మకి ఏవీ పెట్టదు. ఆ తాతమ్మ..కిటికీకాడ కూకుని …నువ్వు ఏదైనా పెడ్తే నేను బళ్ళోకి తింటా ఎల్తాను సూడు .. అప్పుడు నన్ను కిటికీ దగ్గరకి పిల్సి పెట్తమని అడుగుద్ది. సేసమ్మామ్మ..ఏవీ పెట్టదంట..”
“ఆసి ముండా..! అంతుకేనా ..?”
“అంతుకే మరి. ఇంకెంతుకనుకున్నా..? అయినా పెద్దోల్లైపోతే ఏం పెట్రా..”
గిలకమ్మనే సూత్తా ఉండిపోయారిద్దరూ..
ఏం సెప్పాలో తెలవక.

నిన్నే ప్రేమిస్తా………

రచన: మణికుమారి గోవిందరాజుల

“యేమిటలా చూస్తున్నావు?”
“స్ఫటికం లాంటి నీ మనసుని. యెంత స్వచ్చంగా మెరిసిపోతూ కనపడుతున్నదో” తన్మయంగా అన్నది.
“నా మనసులో యేముంది? నిన్ను నువ్వు చూసుకో యెంత అందంగా కనపడతావో?”
“నేనా? అందంగానా? వెక్కిరిస్తున్నావా? యెటుపోయింది ఆ అందమంతా?” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది.
“మై డియర్ సాజీ నాకు ఇప్పుడు నువు వేరేగా కనపడవు. అప్పుడెలా వున్నావో ఇప్పుడూ అలానే కనపడతావు”
“అయినా ఇదిగో ఇలా మాట్లాడావంటే నేను నీ దగ్గరికే రాను” బెదిరించాడు.
“లేదు..లేదు.. ఇంక అలా మాట్లాడను.” చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
“చూడు శ్రీ ఇన్నాళ్ళకు భగవంతుడు నా కళ్ళు నేనే తుడుచుకుందుకు చేతులిచ్చాడు” నవ్వింది.
“ఓకే ..ఓకే.. ఇక అలా మాట్లాడను” అలిగినట్లుగా పోజు పెట్టి కూర్చున్న శ్రీకర్ ని చూస్తూ చేతులు చాపింది.
యెదురుగా ఇంకో కుర్చీలో కూర్చున్న శ్రీకర్ లేచి వచ్చి ఆమె పక్కన కింద కూర్చుని చాపిన ఆ చేతులను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆ చేతులను తన మెడ చుట్టూ వేసుకుని ఆమె మోకాళ్ళమీద తల పెట్టుకున్నాడు.
“శ్రీ “
“ఊ!”
“ఇదంతా నిజమే నంటావా?నా చేతులకు తగులుతున్న నీ శరీర స్పర్శ నిజమేనంటావా? నా కళ్ళకు కనపడుతున్న నువ్వు నిజమేనంటావా?కల కాదు కదా?”బేలగా అడిగింది.
తన మెడ చుట్టూ వేసుకున్న ఆమె యెడమ చేతిని తన కుడి చేత్తో పట్టుకుని సున్నితంగా తన చెంప మీద కొట్టుకున్నాడు.
“నా చెంప పగిలినంత నిజం సరేనా?”
తన రెండు చేతులతో శ్రీకర్ మొహం, నుదురు,కళ్ళు, పెదాలు, గడ్దం నిమురుతూ “నిజంగా నిజం. నిజంగా నిజం” అనుకోసాగింది.
“అమ్మాయ్! ఇక నన్నొదిలితే ఆఫీసుకు వెళ్ళొస్తాడీ దీనుడు.”
“ఇంకొద్ది సేపు వుండొచ్చుకదా?”
“నాకు మటుకు వెళ్ళాలనుందేమిటి? కానీ తప్పదు కదా?”
“నా వల్లే కదా నీకీ కష్టాలు? నీకు అవసరం లేని బాధ్యత నెత్తిన వేసుకున్నావు.” బాధగా అన్నది. కళ్ళల్లో నుండి అశ్రువులు రాలాయి.
“నేనిది బాధ్యత అనుకోవడం లేదు సాజీ” ప్రేమగా ఆమె కళ్ళు తుడిచి ముంగురులు సవరించాడు. “నన్ను నేను కాపాడుకుంటున్నాను”
“అవును కానీ ఈ రోజు ఫిజియోథెరపిస్ట్ వచ్చి వెళ్ళిందా? ఆమె చెప్పినట్లు చేస్తున్నావా? చాలా బాధ వుంటుంది కాని గుడ్ గర్ల్ లాగా ఆమె చెప్పినట్లు చేసెయ్యాలి మరి. నువు యెంత తొందరగా కోలుకుంటే మనం అంత తొందరగా కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు మరి.” మాట మార్చి వూరించాడు.
“నువు నా గురించి పడుతున్న కష్టం ముందు నేను పడే బాధ యేపాటిది శ్రీ? యెంత బాధనైనా భరించే శక్తి నీ అపారమైన ప్రేమ నాకంద చేస్తున్నది. అయినా యెందుకు? యెందుకు శ్రీ? నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఇప్పటికి నాలుగు సంవత్సరాలయింది ..వేరే సరదాలు వేరే ప్రపంచం లేకుండా నా గురించే ఆరాటపడ్డావు, పడుతున్నావు. నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకుని వొంటరి పోరాటం చేసావు. యెంత సర్దుకుందామన్నా నీ బాధ చూస్తుంటే తట్టుకోవడం నా వశం కావడం లేదు. ఇంకా యెన్నాళ్ళిలా అనే ప్రశ్నకు బదులే లేదు. వదిలేయ్ శ్రీ.. నా మానాన నన్ను వదిలేసి నువన్నా హాయిగా వుండు..”
“వదిలేసి పోవడానికి, నువు బాగున్నప్పుడు నువు అందంగా వున్నావని నిన్ను కామించలేదు సాజీ..అప్పుడూ ప్రేమించాను. ఇప్పుడూ ప్రేమిస్తున్నాను.ఈ మాట యెన్నిసార్లు చెప్పడానికైనా నాకు ఓపిక వుంది. చెప్తూనే వుంటాను… ఐ లవ్ యూ..ఐ లవ్ యూ…” గట్టిగా అన్నాడు.
“యెన్ని వూసులు చెప్పుకున్నాము? యెన్ని కలలు కన్నాము? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించు కున్నాము. అదంతా అంతా బాగుంటేనేనా? ఇప్పుడు నీకు బాలేదని నిన్ను వదిలేసి నా దోవ నేను చూసుకుంటే దాన్నేమంటారు? నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్లే. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే భరోసా.. ఆ నమ్మకం, ఆ భరోసా మన ఇద్దరి మధ్యా మనం జీవించి వున్నంత కాలం వుండాలి..,వుంటుంది… అయినా అన్నీ బాగుండి అంతా బాగుంటేనేనా ప్రేమ నిలిచేది? నా అదృష్టం బాగుంది కాబట్టి నీకేమీ కాలేదు.” తృప్తిగా నిట్టుర్చాడు…
“నాకేమీ కాలేదా? మూడేళ్ళు కోమాలో వున్నాను. తెలివొచ్చి ఆరు నెలలు మంచంలో వున్నాను. అయిదు నెలల క్రితం వరకు కళ్ళు తప్ప యే అవయవం కదల్లేదు. నాలుగు నెలల క్రితం వరకు మాట కూడా లేదు. మూణ్ణెల్ల నుండే కదా లేచి కూర్చుంటున్నాను. ఇంకా నడక రానే లేదు. యెక్కడి నుండి డబ్బు యెలా తెస్తున్నావో తెలీటం లేదు .యెలా అయిపోయావో చూడు?”
“ఇదిగో చూడు ..పలుకులకు చిలకలు ఇప్పించలేదనే కదా నీ గొడవ ఇప్పిద్దాములే.. అడుగులకు అరిశలు కూడా ఇప్పిస్తాను సరేనా?” నవ్వుతూ తేల్చేసాడు.
“అయినా నువు చెప్పిన దాన్ని బట్టే తెలుస్తున్నది కదా ఇంప్రూవ్ మెంట్ యెంత బాగా వున్నదీ?..డబ్బు దేముంది? అంతా పోయినా కూడా నువు జీవంతో వున్నావు. అదే పదివేలు. యెప్పటికైనా లేచి తిరుగుతావు అన్న వూహే నాకు బలాన్ని ఇస్తున్నది. సాజీ… నా చేతిలో విద్య వున్నది. గుండెల్లో నువున్నావనే ధైర్యం వున్నది. నీకేమన్నా అయిన నాడు నేను కూడా వుండను..”
చటుక్కున శ్రీకర్ నోటికి చేయి అడ్డం పెట్టింది అలా మాట్లాడొద్దన్నట్లుగా.. చేయి తప్పించి మళ్ళీ చెప్పసాగాడు..
“కోమాలో నుండి బయటపడ్డాక నీ పరిస్తితి యెలా వుంటుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. యెంత భయపడ్డానో…యెన్ని..యెన్ని రాత్రుళ్ళు నిన్నే చూస్తూ గడిపానో … యెంతమంది ..దేవుళ్ళకు మొక్కు కున్నానో..యే దేవుడు కరుణించాడో నీకు తెలివి రావటమే కాకుండా అన్నీ చక్కగా గుర్తున్నాయి.. చక చక నడిచేసేయ్…ఇద్దరం కలిసి వెళ్ళి అన్ని మొక్కులూ తీర్చుకుందాము.” వుత్సాహపరిచాడు.
“సాజీ ! ప్లీజ్. నువు సంతోషంగా వుంటేనే తొందరగా కోలుకుంటావు. లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్తావు..డాక్టర్స్ మరీ మరీ చెప్పారు. నువు మనసులో కూడా బాధ పడకూడదని.. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వాళ్ళను నేనేమీ వదులుకోలేదు. వాళ్లు నన్ను వదల్లేదు. వాళ్ళ సహకారం లేకుంటే నేనేమీ చేయలేకపోయేవాడిని. మొదట్లో యేదో అన్నారు ..తలిదండ్రులు కదా వాళ్ళకేవో ఆశలు వుంటాయి మరి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు.. అందుకే నా కంటే వాళ్లే నిన్ను యెక్కువగా కనిపెట్టుకుని వుంటున్నారు.” ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు.
“ఒక తపస్సు లాగా నిన్నీ స్థితికి తెచ్చుకున్నాను డియర్ . ఇక అలసిపోయాను. సాజీ.. నేను డిప్రెషన్ లోకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీదే మరి. లేదంటే మళ్ళీ మన జీవితంలోనుండి నాలుగేళ్ళు మైనస్ అవుతాయి. ఛీరప్ బేబీ…. ఇప్పుడు కాస్త వీల్ ఛెయిర్ లో తిరుగుతున్నావు కదా ?త్వరలోనే నీ కాళ్ళ మీద నీవు నిలబడతావు. తొందరలో మనం ఇంటికెళ్తాము ప్రామిస్…ప్లీజ్ నిరాశను నీ దరి చేర నివ్వకు..అది నిన్నూ నన్నూ కూడా తినేస్తుంది. నాకు ఆఫీస్ టైం అవుతున్నది. పరిగెత్తుకుని సాయంకాలం వస్తాను సరేనా?రోజంతా నీ పక్కనే వుండాలనిపిస్తున్నది డియర్…కాని వుద్యోగ ధర్మం తప్పదు ” నుదుటి మీద చుంబించి వదిలేసాడు.
“ఓకే! మరి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళు… ఈ రోజు ఇంకో గంట యెక్కువ కూర్చుంటాను.”
“గుడ్ గర్ల్” మెచ్చుకున్నాడు.
అలా సాజీని యెత్తి అపురూపంగా వీల్ ఛెయిర్ లో కూర్చోబెట్టాడు.
“ఓకే! బై బై డియర్..” చెప్పి వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళాడు శ్రీకర్.
********************
సహజ కోమాలో నుండి బయటకు వచ్చాక అన్ని నెలలు మంచంలో నిద్ర పోతున్నట్లు వున్నా మనం చెప్పేవి తనకు వినపడి అర్థం చేసుకో గలుగుతుందని , ప్రమాదం విషయం కూడా చెప్పమనీ అందువల్ల పూర్తి తెలివి వచ్చాక దాని ఇంపాక్ట్ తక్కువుంటుందనీ డాక్టర్లు చెప్పడంతో శ్రీకర్ పక్కనే కూర్చొని సహజ వినే దానితో సంబంధం లేకుండా యెన్ని కబుర్లో చెప్పేవాడు. అందువల్ల శ్రీకర్ ఒక విషయం కాదు మామూలు మనుషులతో యెలా మాట్లాడతారో అలా అన్ని విషయాలు మాట్లాడేవాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే అన్నీ అర్థమవుతుండేవి సహజకు. కానీ కన్ను కూడా కదల్చ లేకపోయేది. అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో సడన్ గా ఒక రోజు కళ్ళు తెరిచి అందర్నీ చూడటం మొదలు పెట్టింది. మెడికల్ హిస్టరీలోనే చాలా ఆశ్చర్యమనీ అంతా శ్రీకర్ కృషి ఫలితమనీ వైద్యులు చెప్పారు.
తెలివి వచ్చిందే కాని కొద్దిగా లేచి కూర్చోగలగడానికి తొమ్మిది నెలలు పట్టింది. కొద్దిగా కూర్చొని కాళ్ళు చేతులు కదిలించడం మొదలు పెట్టగానే లాప్ టాప్ తెచ్చివ్వమంది. శ్రీకర్ కి సహజ తెలివితేటల మీద గొప్ప నమ్మకం వుంది. అందుకే వెంటనే అడిగినవన్నీ సమకూర్చాడు. ఒక పదిహేను రోజులు కంప్యూటర్ నాలెడ్జి అంతా రీకలెక్ట్ చేసుకుంది. పదిహేను రోజులు అన్ని జాబ్స్ కి అప్ప్లై చేస్తూ కూర్చుంది. చివరికి పెద్దది కాకపోయినా టైంపాస్ జాబ్ దొరికింది.. యేదైనా మొదలు మెదడుకి మేతలాగా యేదో ఒక పని చేయకపోతే ఆలోచనలు యెక్కువవుతాయని శ్రీకర్ అభ్యంతరం చెప్పలేదు
చిన్నగా వీల్ ఛెయిర్ ని జరుపుకుంటూ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళింది సహజ. వెళ్ళిందే కాని పని మీద ధ్యాస నిలవడం లేదు.
చదువుకునే రోజుల్లో కాలేజీలో పరిచయమయ్యాడు శ్రీకర్.
శ్రీకర్ వ్యక్తిత్వం, స్త్రీలను గౌరవించే విధానం యెంతో ఆకట్టుకున్నాయి సహజను.
సహజ రూప లావణ్యాలే కాకుండా , ఆమె స్నేహస్వభావము,అందరితోను కలుపుగోలుగా వుండడం , వెనుకా ముందూ చూడకుండా అందరికీ సహాయం చేసే తీరు చూసి ముగ్ధుడయ్యాడు శ్రీకర్. యెప్పుడు జరిగిందో తెలీకుండానే ఒకరినొకరు ఇష్టపడటం మొదలయింది. సాధారణ కుటుంబమని మొదలు వద్దన్నా తప్పదని ఒప్పుకున్నారు తలితండ్రులు. పెళ్ళి ఇక నెల రోజుల్లో కొచ్చేసింది.
ఆ రోజు గుర్తొచ్చేసరికి భయంతో వొళ్ళు జలదరించింది సహజకు.
ఆ రోజు శ్రీకర్ తానూ కలిసి షాపింగ్ చేసుకుని ఎంఎంటీసీ కోసమని స్టేషన్ కి వచ్చారు. ట్రైన్ వస్తున్నట్లుగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ మీదికి రైల్ వచ్చేస్తున్నది.ఇంతలో ఒక మూడేళ్ళ బాబు, తలితండ్రులు యేమయ్యారో, బంతితో ఆడుకుంటూ ప్లాట్ ఫారం చివరికి వెళ్ళిపోయాడు. చేతిలో వున్న బంతి కిందపడి దొర్లుకుంటూ పట్టాలమీదికి వెళ్ళిపోయింది. బంతి కోసమని యేడుస్తూ ప్లాట్ ఫాం దిగడానికి ట్రై చేయబోతున్నాడు బాబు.అందరూ అరుస్తూ కేకలు పెడుతున్నారు.
పక్కనే శ్రీకర్ తో మాట్లాడుకుంటూ ఆ కేకలు విని అదాటుగా అటు చూసిన సహజకు గుండాగినంత పనయింది. పరుగునా వెళ్ళి బాబుని లాగి ఇవతలికి పడేసింది. ఆ వూపులో అప్పుడే వస్తున్న రైలుకి ప్లాట్ ఫాం కి మధ్యలో పడటం రైలు కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్ళి వదిలేయడం కన్ను మూసి తెరిచినంతలో జరగడంతో శరీరం లో ప్రాణం వుందే కాని విరగని యెముక లేదు. సహజకు ఆ క్షణంలో తల వెళ్ళి రైలుకు కొట్టుకోవడం వరకే స్పృహలో వుండడంతో గుర్తుంది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తెలివి రావడమే.
కోమాలోకి వెళ్ళడమంటే ప్రాణం పోయిన వాళ్ళతో సమానమని సహజ పేరెంట్స్ తో సహా యెంత మంది చెప్పినా శ్రీకరు సహజ చెయ్యి, ఆమెకు బాగవుతుందన్న ఆశ వదల్లేదు. తనకొచ్చిన వాటామొత్తం అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టాడు. ఈ విశయాలన్నీ రోజు సహజ కోమాలో వున్నప్పుడూ,ఆ తర్వాత కళ్ళు తెరిచాక చెప్తూ వుండేవాడు శ్రీకరు.
అన్నీ కాకపోయినా కొన్ని గుర్తుండేవి. కళ్ళతో పాటు మెమొరి కూడా రావడంతో తర్వాత అన్నీ గుర్తు వచ్చాయి సహజకు. తనకు పునర్జన్మనిచ్చిన శ్రీకరు మీద,అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని తనకు దగ్గర చేసిన దేవుడి మీదా చాలా ప్రేమ భక్తి కలిగాయి సహజకు. ఆలోచనల్లో సమయం తెలియలేదు …..
“హల్లో సహజా..యెలా వుందీ రోజు?”పలకరించుకుంటూ లోపలికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ ని చూసి
“హలో ఆశా ! బాగున్నాను..హౌ ఆర్ యు?” తను కూడా నవ్వుతూ పలకరించింది..
“యేడి?మీ హీరో?ఇంకా రాలేదా?”
హాస్పిటల్లో అందరికీ కూడా శ్రీకర్ ని చూస్తే హీరో వర్షిప్..అందరూ హీరో అని పిలుస్తుంటారు
“వచ్చే టైం అయింది..ఇప్పుడు మన టైం కదా ?ఇదవ్వగానే వస్తాడు.మొదలు పెడదామా”
ఆశాకి సహజ ఇచ్చే కో ఆపరేషన్ యెంతో నచ్చుతుంది…రెగ్యులర్గా చేయించేవన్ని చేయించి వెళ్ళిపోయింది. నర్స్ వచ్చి స్నానం చేయించి చక్కగా పక్క దులిపి చిన్నగా పక్క మీద పడుకోబెడుతుండగా శ్రీకరు వచ్చాడు.
లోపలికి వస్తున్న శ్రీకరుని కళ్ళ నిండుగా చూసుకుంది సహజ.దగ్గరికి రమ్మన్నట్లుగా చెయ్యూపింది ..ఆ లోపలే వచ్చి పక్కన కూర్చున్నాడు
“శ్రీ! యే జన్మలో యే పుణ్యం చేసుకున్నానో ఇంత అదృష్టవంతురాలనయ్యాను. ఇంతగా ప్రేమించటం యెవరివల్ల నన్నా అవుతుందా? డబ్బు అందం చదువు ఇప్పుడు ఆకారంలో ,అన్నిటిలో నేను చాలా సామాన్యురాలిని. శ్రీ! నిన్నందుకునే అర్హత నాకు లేదు. ఇది చివరివరకూ వుంటుందా అని భయంగా వుంటుంది” కళ్లు భయంతో రెపరెప లాడాయి.
యెంతటి ట్రౌమా నుండి సహజ బయట పడిందో శ్రీకరుకి తెలుసు. ఆ భయంలో యెటువంటి అనుమానాలొస్తాయో వూహించగలడు.
“పిచ్చి సాజీ! నువు మాటా పలుకూ లేనప్పుడే నీ చెయ్యి వదల్లేదు. ఇప్పుడు వదుల్తానా?నో వే! కోటి సార్లు చెప్పనా నిన్నే ప్రేమిస్తా అని? చూడు నా గుండె లబ్ డబ్ బదులు సాజీ సాజీ అని కొట్టుకుంటుంది” సహజ తలని సుతారంగా యెత్తి తన గుండెకు ఆనించుకున్నాడు.
“అన్నయ్యా పబ్లిగ్గా ఈ వేశాలేంటి?మేమొప్పుకోము” నవ్వుతూ లోపలికి వచ్చారు శ్రీకర్ చెళ్ళెళ్ళిద్దరూ.. ఆ వెనకే “హ్యాపీ బర్త్ డే డియర్ సాజీ” పాడుతూ సహజ పేరెంట్స్, ఫ్రెండ్స్, శ్రీకర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ లీడ్ చేస్తూ శ్రీకర్ తల్లితండ్రులూ వచ్చారు….
శ్రీకర్ కి తెలుసు సహజ ఇక జీవితాంతం నడవలేదన్న సంగతి. కాని ప్రేమించటం మాత్రమే తెలిసిన శ్రీకరుకి సహజ నడవగలుగుతుందా లేదా, అందంగా వుందా లేదా అన్న దానితో సంబంధం లేదు.. కాని ఆశ మాత్రం వుంది తన ప్రేమతో నడిపించగలనని….
శ్రీకరు ఆశ తీరాలని మనం కూడా ఆశపడదాము మరి.

శుభం..

కంభంపాటి కథలు – ఫణి క్రిష్ణ స్టోరీ

రచన: రవీంద్ర కంభంపాటి

ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల పెద్దమ్మాయిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు.

లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసక మసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం ఉండబట్టేలా లేదు.

ఆ రోజెందుకో ఏదైనా కూర తినాలనిపించిందావిడకి. వీధి చివరనున్న నారాయణ కొట్లోకి వెళ్లి ఏమైనా తెచ్చుకుందామనుకుంటే ఆ వాన నీళ్లలో నడిచే ఓపిక లేదు. ఆ ఇంటిముందున్న నేరేడు చెట్టు, మునగ చెట్టు వర్షానికి అటూ ఇటూ ఊగుతున్నాయి.

అలా చూస్తూన్నావిడ కాస్తా ఒక్కసారిగా విస్తుబోయింది. ఆ మునగచెట్టుకి వేలాడుతూ ఓ ములక్కాడ కనిపించింది! అదేమిటి ఆ మునగచెట్టుకి ఆ ములక్కాడ ఎప్పుడు కాసింది అనుకుందావిడ, కళ్ళు నులుముకుని చూసింది..సందేహం లేదు..లేతగా ఉన్న ములక్కాడే ! మెల్లగా వెళ్లి కోసుకొచ్చేస్తే ఏ పప్పులోనో ఉడకేసుకోవచ్చనిపించిందావిడకి.

ఇంక ఆలస్యం చేస్తే ఆ ఒక్క ములక్కాడ కూడా రాలిపోయేలా ఉంది, అసలే ఆ గాలికి అటూ ఇటూ ఊగుతూంది, ఇంక తప్పదని కూడదీసుకుని లేచిందావిడ.

మెల్లగా అడుగులో అడుగేసుకుంటా ఆ వర్షం నీళ్లలో నడుస్తా ఆ మునగ చెట్టు దగ్గరికెళ్లి ఆ ములక్కాడ మీద చెయ్యేద్దామనుకుంటూంటే ‘భలే వారే మామ్మగారూ..ఆగండాగండి’ అని అరుపు వినిపించి గుమ్మం వేపు చూసేసరికి, అక్కడ్నుంచి పెద్ద పెద్ద అడుగులేసుకుంటా వచ్చి ఆ పెద్దమ్మాయిగారిని అదాట్న పక్కకి లాగేసేడా అబ్బాయి.

బిత్తరపోయి చూస్తున్న పెద్దమ్మాయిగారికి జరాజరా పాక్కుంటా వెళ్ళిపోతున్న పసిరిక పాముని చూపించి అన్నాడు, ‘ములక్కాడ అనుకున్నారా మామ్మగారూ, పసిరిక పాముని చూసి?’

నోటమాట రాక అలా చూస్తూండిపోయిన ఆవిడని జాగ్రత్తగా చెయ్యట్టుకుని ఇంట్లోకి నడిపిస్తా అన్నాడు,’ నాపేరు ఫణికృష్ణండి..ఇక్కడే తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా రెండ్రోజుల క్రితమే చేరేనండి..ఇటుపక్క ఇళ్ళు ఏమైనా అద్దెకి దొరుకుతాయేమో చూద్దామని ఇలా వర్షం లోనే బయల్దేరేనండి.. ప్రస్తుతం మన శ్రీ చిత్రా లాడ్జీలో ఉంటున్నానండి ‘

‘నిన్ను చూస్తుంటే నా మనవణ్ణి చూసినట్టే ఉంది బాబు ‘ అందావిడ మెల్లగా

‘నేనూ మీ మనవణ్ణే అనేసుకోండి మామ్మగారూ..ఇంతకీ ఆళ్లందరూ ఏరీ ‘ అని ఫణి కృష్ణ అడిగితే ‘ఆళ్ళందరూ అమెరికాలో ఉంటారు.. మా ఆయనగారితో కలిసి ఎప్పుడో యాభయ్యేళ్ళ క్రితం కట్టినిల్లు కదా.. వదలబుద్ది కాదు ఈ ప్రాణానికి ‘ అంది పెద్దమ్మాయి గారు

జాగ్రత్తగా ఆవిణ్ణి ఇంట్లోకి నడిపించుకొచ్చి వరండా గట్టు మీద ఎత్తి కూర్చోబెట్టి, ‘చొరవ తీసేసుకుంటున్నానని ఏమీ ఆనుకోకండేం..’అని గబగబ ఇంట్లోకి పరిగెత్తి లోపలి గదుల్లోనుంచి ఓ నేత తువ్వాలట్టుకొచ్చి ఆవిడ తల తుడిచేసేడు.

‘ఈ వయసులో వర్షం లో తడిస్తే న్యుమోనియా గారంటీగా వచ్చ్చేస్తుందండి.. లోపల్నుంచి ఈ పొడి చీర కూడా తెచ్చేను..గబుక్కున కట్టుకునొచ్చేయండి ‘ అని ఆవిడకి ఓ పొడి చీర ఇచ్చి లోపలికంపేడు

ఆవిడ చీర మార్చుకుని బయటికొచ్చేక అడిగాడు ‘ఉదయం నుంచీ ఏమైనా తిన్నారా మామ్మగారూ ?’, లేదన్నట్టు తలూపిందావిడ, ‘చెప్పారు కారేం.. ఇలా కూర్చోండి మీరు ‘అని చొరవగా ఇంట్లోకి వెళ్లి చూసొచ్చి ‘ఇంట్లో వంట సామాన్లేవీ ఉన్నట్టు లేవు..ఇక్కడే కాస్సేపు కూర్చోండి ‘ అని వర్షంలోనే పేరంటాలమ్మ గుడి దగ్గరున్న అబ్బులు గారి కిరాణా కొట్లోనుంచి కొంచెం పాలు, బియ్యం, పెసరపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కొనుక్కునొచ్చి, ‘మీకు ముందుగా వేడి కాఫీ కలిపిచ్చేస్తానండి’ అని వేడి వేడి కాఫీ కలిపి ఇచ్చేడు.

ఆవిడ అలా వర్షంకేసి చూస్తూ కాఫీ తాగుతూంటే, లోపలికెళ్ళి వంట చేసేసి, ఆవిడకి వేడివేడిగా అన్నం పెట్టేసేడు ‘మీ వయసుకి కందిపప్పు కన్నా పెసరపప్పు తినడం మంచిదండి..జీర్ణం తొందరగా అవుతుంది ‘ అంటూ అన్నం వడ్డిస్తూన్న ఆ ఫణికృష్ణ చేతులట్టుకుని ఏడ్చేసింది పెద్దమ్మాయిగారు, ‘నువ్వు నాతోపాటు ఇక్కడ ఉంటావా బాబు..నీకు తోచిన అద్దియ్యి చాలు ‘ అని ఆవిడనేసరికి అలా నవ్వుతూ చూస్తూండిపోయేడు ఫణికృష్ణ.

అక్కపల్లి నర్సింహం గారి పిల్లలందరూ పెద్ద చదువులూ అవీ చదివేసుకుని అమెరికాలో ఉండిపోతే, ఆయన భార్య పెద్దమ్మాయిగారు మట్టుకు ఇలా ఆ ఊళ్లో ఒక్కరూ మిగిలిపోయేరు. ఆళ్ళ దగ్గిరికెళ్లే ఓపిక ఈవిడికి లేకపోతే, ఈవిణ్ణి పట్టించుకునే తీరిక ఆళ్ళకి లేదు.

పిల్లల్ని చదివించడానికి ఉన్న పొలాలన్నీ పెద్దమ్మాయిగారు అమ్మేయగా ఈ ఇల్లొక్కటీ మిగిలింది. ఆ పిల్లలు క్రితం సారొచ్చినప్పుడు తల్లికో సెల్ ఫోను కొనిచ్చేరు, ఆవిడతో అప్పుడప్పుడూ మాట్లాడ్డానికి.

ఆ తర్వాత ఆ పిల్లలు అమెరికా నుంచి ఫోన్ చేసినప్పుడు, ఆవిడ ఇంట్లో ఇలా ఫణికృష్ణకి ఓ రెండు గదులు అద్దెకిచ్చేనని చెబితే ఆళ్ళు చాలా సంతోషించి ‘అమ్మయ్య.. ఇంట్లో పోలీసాడు ఉంటే నిన్ను చూసుకోవడమే కాదు.. ఇల్లు కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు ‘ అన్నారు

ఫణికృష్ణకిచ్చిన గదుల్లో పాత సామాన్లు గట్రా ఉంటే, వాటిని అటక మీద పెట్టేసుకోమంది పెద్దమ్మాయిగారు. ఆ పాతసామాన్లు పైకెక్కిస్తూ ఫణి అన్నాడు ‘ఏంటండీ..అస్సలీ ఇంటికీ, మీకూ బొత్తిగా సంరక్షణ లేనట్టుంది.. అటకంతా ఒకటే ఎలకలు.. తెగ పరిగెడుతున్నాయి..రేపు ఎలుకల మందట్టుకొచ్చి ఈటి పని పడతానండి. ఇంక మీ సంగతంటారా, నాకు వంట బాగా వచ్చునండి. రోజూ ఇద్దరికీ వండేసిల్లిపోతుంటానండి. మీకే ఇబ్బందీ ఉండదింక’ అని ఫణి చెబితే పెద్దమ్మాయి గారు సంతోషంగా వింటూండిపోయారు.

చెప్పిన మాట ప్రకారం, ఫణి ఆ పెద్దమ్మాయిగారినే కాకుండా ఇంటిని కూడా బాగా చూసుకునే వాడు. ఆవిడకి వండిపెట్టడంతో పాటు, వీలైనప్పుడు తన పోలీసు జీపట్టుకొచ్చి ఆవిణ్ణి గొల్లల మామిడాడ, సామర్లకోట, ద్రాక్షారామం, అయినవిల్లి గట్రా గుళ్లన్నీ తిప్పేసరికి ఆవిడ మురిసిపోయి ‘నా కొడుకులే నన్నెప్పుడూ ఈ ఊళ్ళయీ తిప్పలేదు, నేనేం తిన్నానో పట్టించుకోలేదు.. అలాటిది నువ్విన్ని చేస్తున్నావంటే..నువ్వు నా కొడుకులకంటే ఎక్కువ ‘ అంటూ పొంగిపోయిందావిడ.

ఆ దీపావళెళ్ళిన మర్నాడు రాత్రి పది దాటుతూండగా, పెద్దమ్మాయిగారింటికి కాస్త దూరంగా హెడ్లైట్లు ఆపేసున్న పోలీస్ జీపాగింది. ఇంటి ముందు చీకట్లో నేరేడు చెట్టు కింద నుంచుని సిగరెట్టు కాల్చుకుంటున్న ఫణి గబుక్కున సిగరెట్టు పక్కన పడేసి, గబగబా జీపుకేసి నడిచి, ‘రండి దొరగారు.. ముసిలావిడ నిద్దరోయింది ‘ అంటే మెల్లగా జీపు దిగిన ఎస్సై బుచ్చిబాబు ‘ఒరే.. ఇవ్వాళ ఆ రెండో గది కూడా కావాల్రా, ఓ ఎన్జీసీ ఆఫీసరుగారినట్టుకొచ్చేను..ఆరు మన శకుంతల రుచి చూస్తానన్నారు ‘ అన్నాడు.

‘తప్పకుండానండి.. నేను వసారాలో పడుక్కుంటానండి.. మరి ఇయ్యాల శకుంతలని ఆరుంచుకుంటే.. మరి మీకండి?’

‘నేను వేరే తెచ్చుకున్నాలేవో..తినడానికేటన్నా అరంజిమెంటు చేసేవా ‘ అని బుచ్చిబాబు అడిగితే ‘గదిలో రమ్ము సీసా రెడీగా ఉందండి.. చికెన్ ఒండిపెట్టేనండి..రెండు గదుల్లో అరేంజిమెంటు చేసేస్తానండి.. ‘ అని ఫణి చెప్పేడు

‘బాబూ ఏ అవసరం ఉన్నా నా సెల్ఫోనుకి మిస్సెడ్ కాలివ్వండి.. వెంటనే వచ్చేస్తాన్నేను.. కొంచెం గట్టిగా నవ్వులూ అయీ వినపడకుండా చూసుకోండి బాబు ‘ అని ఫణి ఆ ఓఎన్జీసీ ఆఫీసరు పట్నాయక్ తో చెబితే ఆయన ఫణి కేసి చూసి ‘ఠీక్ హై ‘ అని ఆ శకుంతలనట్టుకుని ఆబగా తనకిచ్చిన గదిలోకి దూరిపోయేడు.

ఒంటిగంటకి బుచ్చిబాబు మిస్డ్ కాలిచ్చి ఫణిని పిలిచి చెప్పాడు ‘నేను ఇంకాసేపు తెలివేసే ఉంటాను..నువ్వెళ్ళి ఎన్ని ఓఎన్జీసీ లారీలు వెళ్ళాయో చూడు.. రేపు ఆదినారాయణ తో మాటాడతాను ‘

తెల్లవారుఝామున మూడున్నర అవుతూండగా ఫణి వచ్చి బుచ్చిబాబుకి చెప్పేడు ‘ఐదువేల లీటర్ల లారీలు తొమ్మిదండి..ఆదినారాయణాళ్ళు ఒకో దాంట్లోంచి పదిహేను పర్సెంటు క్రూడాయిలు తీసేసేరండి.. ఇదిగో మీకిమ్మన్నారండి.. ‘అని ఐదొందల కట్ట చేతిలో పెడితే, బుచ్చిబాబు ఆ కట్ట తీసుకుని తలుపేసుకున్నాడు. కాసేపటికి ఆ గదిలోనున్న ఆడమనిషి మూలుగులు వినిపించాయి.

మర్నాడు ఎర్రగా ఉన్న ఫణి కళ్ళు చూసి పెద్దమ్మాయిగారు ఏమైందని అడిగితే, ‘. మీకు ఒంట్లో బాలేనట్టు కలొచ్చి అస్సలు నిద్దరట్టలేదండి ‘ అన్నాడు.

ఓఎన్జీసీ వాళ్ళతో కలిసి ఆళ్ళ టేంకర్లలోంచి ఆయిల్ కొట్టేసే గేంగుతో చేతులు కలిపి తెగ సంపాదించేస్తూ, ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ల సరదాలు తీర్చడానికి పెద్దమ్మాయి గారిల్లు వాడేస్తున్నాడు ఫణి.

వారంలో రెండు మూడు రాత్రులు ఎస్సై బుచ్చిబాబు రావడం, తనతో పాటు ఎవడో ఒకడు ఓఎన్జీసీ ఆఫీసరూ, ఆళ్ళతో ఉండే పెద్దాపురం, రాజానగరం నుంచి తెచ్చుకున్న ఆడంగులకి మర్యాదలు చెయ్యడం ఇదే పనైపోయింది!.

ఫణి ఆ ఇల్లు తీసుకున్నప్పుడే ఆ ఇంటిని ఎస్సై బుచ్చిబాబుగారికి ఎరగా వేసి ఎగస్ట్రా డబ్బులు సంపాదించొచ్చు అనుకున్నాడు గానీ, మరీ ఇంత అమ్మాయిల్ని సప్లై చేసే ఎదవ బతుకై పోతుందనుకోలేదు.

పైగా ఒచ్చినప్పుడల్లా ఆ బుచ్చిబాబు రెండువేల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ఇంక లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నాడు ఫణి.

కాకినాడెళ్ళి అక్కడ మెయిన్ రోడ్డులో ఉన్న చొప్పారపు గన్నిబాబు గారి మొబైల్ షాపులో సీసీ కెమెరా కిట్టు కొన్నాడు. దాన్నెలా ఆపరేట్ చెయ్యాలో తెల్సుకుని, ఓఎన్జీసీ ఆఫీసరు గారొకాయన వస్తే, అటక మీద ఆ కెమెరా పెట్టి ఆయన చేసిన పనులన్నీ షూటింగు చేసేసేడు. బాగానే రికార్డయ్యింది గానీ మొహాలు స్పష్టంగా తెలీడం లేదు. అదే విషయం ఆ మొబైల్ షాపులో కుర్రాడితో చెబితే ‘ఇదేమన్నా సినిమా కెమెరా అనుకుంటున్నారేటండీ.. అంతగా క్లారిటీ కావాలంటే.. ఏదైనా లేటెస్టు సెల్ ఫోనుతో షూటింగు చేసెయ్యండి ‘అన్నాడు.

ఆ రోజు ఎస్సై బుచ్చిబాబు చెప్పాడు ఫణికృష్ణ తో ‘ఒరే..నీకు రాజమండ్రి ట్రాన్స్ఫర్ ఒచ్చింది.. ఆపుదామని ప్రయత్నించేను.. కుదర్లేదు మరి.. ఆ ఇల్లు మటుకు నా అవసరానిక్కావాలి…. ఏదోలా నువ్వే చూడు..నీ రెండు వేలు నీకిస్తాలే ‘ అని నవ్వేడు

తన ట్రాన్స్ఫర్ విషయం విని బిక్కచచ్చిపోయిన ఫణి ఏమ్మాట్లాడలేదు. ‘సరేగానీ..ఇయ్యాల రాత్రి శకుంతలని తీసుకునొస్తున్నాను.. మందూ అయి కొంచెం ఆరెంజీ చెయ్యి ‘ అని బుచ్చిబాబు చెప్పాడు.

‘అలాగేనండి.. ఊరినుంచి మా మావయ్యాళ్ల ఫ్యామిలీ ఒచ్చేరండి..ఆళ్ళకి అనుమానం రాకుండా మా ఇంటి ఓనరు గారి దగ్గిర పడుక్కుంటామండి .. నేను అన్నీ అక్కడ పెట్టేసి తలుపు దగ్గిరగా వేసెళ్లిపోతానండి.. మీకే అవసరం వచ్చినా ఒక్క మిస్డ్ కాలివ్వండి ‘ అన్నాడు ఫణి

రాత్రి పదకొండవుతూండగా శకుంతలనట్టుకుని బుచ్చిబాబు పెద్దమ్మాయిగారింటికొచ్చేడు. ఫణి చెప్పినట్లే తన గది తలుపు దగ్గరగా వేసుంది. లోపలికెళ్ళి లైటేసి చూస్తే మంచం నీటుగా సర్ది, పక్కనే ఒక హాఫ్ బాటిలు ఓల్డ్ మాంక్ రమ్ము, గ్లాసులు, కోడి బిరియాని, గుడ్డు పొరటు అన్నీ సర్దిపెట్టి ఉన్నాయి.

ఇద్దరూ మందుకొట్టేసి మంచం మీద దొర్లుతూంటే శకుంతల అడిగింది, ‘అటక మీద ఏదో కదిలినట్లు లేదూ ‘..’ఆ అటక నిండా ఎలకలంట.. ఆ ఫణిగాడు చెప్పేడోసారి’ అని శకుంతలని మీదకి లాక్కున్నాడు బుచ్చిబాబు

అటక మీద పడుక్కుని జాగ్రత్తగా కొత్తగా కొనుక్కొచ్చిన సెల్ల్ఫోన్ తో ఇదంతా వీడియో తీస్తున్న ఫణి ‘అమ్మయ్య బతికిపోయేను ‘ అనుకున్నాడు. కాలి మీద ఏదో పాకుతూంటే ఎదవ ఎలక అనుకుని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు.

రోజూ ఉదయాన్నే వచ్చి చేతికి కాఫీ అందించే ఫణి కనపడకపోవడంతో పెద్దమ్మాయిగారు కాస్త కలవరపడ్డారు. ఒంట్లో బాగోలేదోమోనని అతని గదిలోకెళ్ళి చూస్తే తలుపులు తీసున్నాయి, కానీ మనిషి లేడు.

ఆ గదంతా ఒకటే మందు కంపు. బిత్తరపోయిన ఆవిడ ఇల్లంతా వెతికేరు ఫణికోసం. ఎక్కడా కనపడకపోయేసరికి అలాగే ఆ వీధి వసారాలో కూలబడిపోయి రోజంతా ఎదురు చూసారు. తన బాగోగులన్నీ దగ్గరుండి చూసుకునే మనిషి కనపడకపోయేసరికి ఆవిడకి ఏమీ తినబుద్ది కాలేదు. ఆ రాత్రి అదే దిగులుతో ఆ వీధి వసారా మీదే పడుక్కున్నావిడ, మళ్ళీ మర్నాడు లేవలేదు.

రెండ్రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కి ఎవరో ఫోన్ చేసి చెప్పేరు, ‘ఊళ్ళో పెద్దమ్మాయిగారు ఆళ్ళ అరుగు మీదే పోయేరు..ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒకటే కంపంట..ఆ చుట్టుపక్కలంతా ‘

అసలే రెండ్రోజుల నుంచీ ఫణి కనపడకపోవడంతో కొంచెం టెన్షన్ గా ఉన్న ఎస్సై బుచ్చిబాబు ఈ విషయం తెలిసి, ఇదెక్కడి గొడవరా అనుకుని వెళ్తే, ఆ ఇంటి దగ్గిర అంతా కంపు కంపు.. ఆ పెద్దమ్మాయిగారి సెల్ ఫోన్ ద్వారా అమెరికాలో ఉన్న ఆవిడ కొడుకులకి కబురంపేరు.
ఆవిడ శవానికి పంచనామా చేయిస్తే సహజ మరణమే అని తేలింది. అమెరికా నుంచొచ్చిన ఆ పెద్దమ్మాయిగారి పిల్లలు ఆవిడకి దహనకాండ జరిపించేసి, శవం కంపు కొడుతున్న ఆ ఇంటికి తలుపులేసుకుని అమెరికా వెళ్ళిపోయేరు.
ఆ అటక మీద పాము కాటేసిన ఫణి కృష్ణ శవం అలాగే పడుంది, చేతిలో సెల్ ఫోన్ తో!

విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”

రచన: విజయలక్ష్మీ పండిట్

 

అది చలికాలం.ఉదయం ఆరు గంటలకు  మదనపల్లెలో రైలు దిగి  నాగరాజు తెచ్చిన వ్యాన్లో మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేప్పటికి ఏడుగంటలు కావస్తోంది. సూట్కేస్ ఇంట్లో పెట్టి నాగరాజు వెళ్ళాడు.

వెళ్ళేప్పటికి అమ్మ ,నాన్న సుజాత మేలుకొని ఉన్నారు. సుజాత వంటపనే కాకుండా అమ్మ నాన్నకు  సహాయం చేస్తుంది వాళ్ళ అవసరాలలో.

నేను గడపలో అడుగు పెట్టగానే ఇంట్లోనుంచి కాఫీ వాసన నా ముక్కుపుటాలలో దూరి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది.

మా అమ్మ చేతి కాఫికి ప్రత్యేకమయిన రుచి.

వర్మ కాఫీవర్క్స్ కొట్టులో అప్పటికపిపుడు వేయించిన కాఫి గింజలు చికోరి కలిపి మిషన్ లో పొడి చేసి ఇస్తారు. ఆ కాఫీపొడి తెప్పించుకుని వాసన పోకుండా గట్టిమూతుండే ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుంటుంది మా అమ్మ.

ప్రొద్దున్నే లేవగానే మరిగే వేడి నీళ్ళు డికాషిన్ ఫిల్టర్ లోని కాఫీపొడిలో పోసి మూతపెడుతుంది. అమ్మ పండ్లు తోముకుని మొహం కడుక్కుని తల దువ్వుకుని, బొట్టు సరిచేసుకుని వంటింటిలోకి వచ్చేటప్పటికి పాలామె శకుంతల పాలు తెస్తుంది.

అమ్మ వాళ్ళు జర్సీ ఆవులను పెట్టుకోవడం మానేసిన తరువాత ఆమె వాళ్ళ ఇంటిలో ఆవులతో పాలు పిండి మాకు ఆవుపాలు తెస్తుంది ఉదయం ఆరు గంటలలోపు.

తాజాగా తెచ్చిన పాలు పొంగినాక తేరిన డికాక్షన్ లో పోసి, కాఫి చేసి రెండు గ్లాసులలో పోసుకుని హాల్లోకి వస్తుంది. మా అమ్మ తెచ్చే కాఫీగ్లాస్ కోసం కాచుకున్న మా నాన్నకిచ్చి, తాను ఇద్దరు కూర్చుని కాఫీ ఆస్వాదిస్తు తాగుతారు. బహుశ రోజు ఆ సమయంలో ఆ కాఫీ వాసనను పసిగట్టి ఆ సమయానికి సూర్యుడు మా వరండాలోకి వచ్చి తన కిరణాలతో ఫిల్టర్ కాఫీని ఆస్వాదిస్తున్నట్టు ఉంటాడు

***

రాత్రి ట్రైన్లో మెలకువతో నిద్ర లేనందున రాగానే అమ్మను నాన్నను పలకరించి , బాగున్నావా సుజాతా అని పలకరిస్తూ బాత్ రూమ్ లో కెళ్ళాను. పనులు ముగించుకుని త్వరగా బయటపడ్డాను అమ్మ చేతి కాఫీ కోసం.

చలికాలంలో ఆ కాఫి వెచ్చదనం ,రుచిని అన్నీ  మరచి నింపాదిగా బయటి ప్రకృతితో కలిసి కూర్చొని ఆ కాఫీతాగే క్షణాలను తాగుతూ ఆస్వాదించడం దినంలో ఒక మంచి సమయం.

ఢైనింగ్ టేబుల్ దగ్గర నేను అమ్మ కూర్చొని మాట్లాడుతుంటే సుజాత కాఫీ గ్లాసు నా కందించింది. కాఫీ గ్లాసు తీసుకుని ఒకసారి సిప్ చేసి కాఫీ గొంతులో మెల్లగా దిగుతుంటే కాఫి గ్లాసు టేబుల్ మీద పెట్టాను. నాకు

ఎదురుగా ఉన్న డైనింగ్ హాలు గోడ మీదకు పాకాయి నా చూపులు.

నాకు ఎదురుగా మా అమ్మమ్మ ఫోటో. ఆ ఫోటోకు కుడివైపున మా మేనమామ ఫోటో. వెనుతిరిగి చూశాను అటువైపు గోడపై మా నాన్నమ్మ ఫోటో. ముగ్గరివి బస్ట్ సైజు పెద్ద ఫోటోలు. ముగ్గురు ఈ ప్రపంచాన్ని వీడారు. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నా వయసు దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల మధ్య, మా నాన్నమ్మ చనిపోయనపుడు నేను నా మొదటి పాపకు గర్భంతో వున్నాను. మా మేనమామ మా పెండ్లి అయిన రెండు సంవత్సరాల తరువాత చనిపోయారు హర్ట్ అటాక్ తో.

అప్పుడప్పుడు ఆ ఫోటోలు మన్మల్ని మా నాన్నమ్మ, అమ్మమ్మలతో, సెలవుల్లోమా మేనమామ ఇంట్లో గడిపిన రోజులు గుర్తు చేస్తుంటాయి.

ఆ ఫోటోలో ఉన్న మా అమ్మమ్మ మా అమ్మ. వాళ్ళను అయిదు మందిని పెంచిన అమ్మ.

మా అమ్మకు ముగ్గురు అక్కలు ఒక అన్న. మా అమ్మ చిన్నపుడే సొంతమమ్మ  చనిపోయింది.

మా ముత్తాతలు ముగ్గురు. ఆ కాలంలో వారిది  చిన్న సంస్థానం. విజయ నగర రాజుల కాలంనుండి శిస్తు వసూలు , ఇతర ప్రజా పనులు , రైతుల బాగోగులు చూడడం. ఆ ముగ్గురుకి మా అమ్మమ్మ ఒక్కతే కూతురు ఆ సంస్థానానికి వారసురాలు.

మా అమ్మమ్మకు పెండ్లి అయిన ఆరు నెలలకే భర్త చనిపోవడంతో వారసులు లేక ఆ సంస్థానానికి మా మేనమామ దత్త పుత్రుడిగా ఆ సంస్థానానికి వారసుడయ్యాడు.

తెల్లగా, ఎంతో ఆప్యాయత నిండిన పలుచని మొహముతో, లేత పసుపుకు ఆకుపచ్చ అంచు కంచిపట్టు చీరతో, మెడలో పగడాల దండతో , కొంగు కుడిబుజము మీదకు కప్పు కుని ఉన్న ఆ ఫోటో చూస్తూ అమ్మ నడిగాను“ అమ్మా ఆ ఫోటోలో బొజ్జమ్మవ్వకు ఆ ఫోటో తీసినపుడు ఎంత వయసు “అని.

అమ్మ రెండు నిమిషాలాగి బహుశ డెబ్బయి ఇయిదు సంవత్సరాలు ఉంటుందేమో ..,

ఆ కాలంలో మీ అమ్మమ్మ పుట్టిన తేదీ, జాతకం రాసినారు కాని భద్రంగా దాచిపెట్టడం ఎక్కడుంది..,అవన్ని చేతులు మారి మాసిపోయి ఎటుపోయాయో.” అని ఆగి మరలా…,

“మీ అమ్మమ్మ ఆ సంస్థానంలో మా ముగ్గురు తాతలకు ఒకటే ముద్దుల కూతురు. ఆమె పుట్టినపుడు ప్రసూతి గదినుండి బయటికి నిమ్మకాయ విసిరినారట. జ్యోతిష్యులు ఆ నిమ్మకాయ బయట పడగానే ఆమె పుట్టిన ఘడియలను లెక్కగట్టి ఆమె జాతకం రాశారంట”. అని ఆగి  “జాతకం లో రాసినట్టు పెండ్లి అయిన ఆరు నెలలకు భర్త చనిపోయారు..”అన్నది అమ్మ.

తన పుట్టింటి సంస్థానం విషయాలు కథలు కథలుగా చెప్పేది మా అమ్మ మాకు సందర్భాలను బట్టి .

అమ్మ లేచి “నేను స్నానం చేసి వస్తాను పాప విజయా” అని వెళ్ళింది.

మా పిల్లలకు పాపలు పుట్టినా, మా అమ్మకు మాత్రం ఎప్పటికి మేము పాపలం బాబులం.

నేను అమ్మ పద్దతిలో నా కూతుర్ల పేరు ముందు పాప పెడుతుంటాను అప్పుడప్పుడు.

మావారు “మన పాపలకు పాపలిప్పుడు నీవేమో ఇంకా పాప అంటున్నావు”అని ఆట పట్టిస్తారు.

“అది అంతేలేండి మన అమ్మలు ముని మనవళ్ళు, మనవరాళ్ళు పుట్టినా మనలను పాప, నాయనా, బాబు అని పిలుస్తారు. మనమున్నంతకాలము మన పిల్లలు మనకు పిల్లలే మన కుటుంబ వ్యవస్థలో” అని సమర్థించుకుంటాను.

మా అమ్మమ్మ, మా మేనమామ ఫోటోలు చూస్తూన్న నన్ను నా ఎదురుగా వున్న ఆ జ్ఞాపకాలగోడ టైమ్ మెషిన్ లాగ అమాంతం నన్నునా బాల్యం జ్ఞాపకాల తోటలోకి తీసుకెళ్లి దించిందని గ్రహించలేదు.

***

అది మా అమ్మమ్మ ఊరు కలిచెర్లలో నేను పుట్టిన ఇల్లు. నా చైతన్యం ఆ ఇంటిలో నన్ను ఇదు సంవత్సరాల పిల్లను చేసి నడిపిస్తూ ఉంది. మా అక్క నేను మా బాల్యంలో తిరుగాడి ఆడి పాడి గడిపిన లోగిలి. నేను సాక్షినై చూస్తున్నాను.

ఇంటి ముందు వత్తుగ అల్లుకున్న నిత్యమల్లి పందిరి. రెండివైపుల ఎరుపు, తెలుపు ముద్దగన్నేరు చెట్లు , కనకాంబరం, మాసుపత్రి, మరువము, నేలమీద అల్లుకున్న ఆ ఆకుల సువాసనలు. పందిరి క్రింద రాలిన ఆకులు పూలపై నడుచుకుంటూ వరండా దాటి నాలుగు ఏనుగుతలల స్థంబాలతో నిలిపిన హాలులోకి వెళ్ళాను. హాలులో ఈశాన్యం మూల తెల్లని పెద్ద కృష్ణుని విగ్రహం నడుము మీద చేతులు పెట్టుకుని నవ్వుతూ నన్ను పలకరిస్తున్నట్టు. మా అమ్మకు ఇష్టమయిన శ్రీకృష్ణ విగ్రహం. పక్కన రెండు పెద్ద గదులు, వెనకల , వంటిల్లు, దినుసుల నిల్వ గది,ఆ గదిలో వ్రేలాడుతు మూడు పెద్ద ఉట్టెలు వెన్న నెయ్యి పాత్రలను పెట్టడానికి.

ప్రక్కన భోజనాల హాలు. భోజనాల హాలులో మా తాతలు కూర్చొని భోచేసే పెద్ద పీటలు మూలల్లో వెండి నగిషీతో .భోజనాల గది దిగగానే వెనకల పది అడుగుల దూరంలో మూడు అడుగుల ఎత్తు ఉన్న తులసి కోట. నాలుగు వైపుల దీపపు గూళ్ళతో .ఇంటి ముఖద్వారం నుండి కనిపిస్తుంది.

వెనకల చేదబావి, కుడి వైపు పెద్ద స్నానాల గది.అందులో దాదాపు ఆరడుగుల పొడవు ,మూడడుగుల వెడల్పు, నాలుగడుగుల ఎత్తు వున్న నీళ్ళతొట్టి. లోపలికి తెరిచిన పెద్ద వేడి నీళ్ళు కాచుకొనే అండా. బయట నుండి కట్టెలు ,పొట్టు,తుంగలు పెట్టి నీళ్ళు కాచే పొయ్యి.

ఆటునుండి నేను పక్కన ఒక అర్థ ఎకరా అంత పశువులను కట్టే కొటం , గడ్డి, కట్టెలు, తుంగలు ఉన్న స్థలం లోకి నడిచాను.

ఆ ప్రహరీ గోడ ప్రక్కన మునగ, కరివేపాకు , టెంకాయ చెట్లు. అక్కడ మూల వున్న పేడ దిబ్బ ప్రక్కన అమ్మ నాటించిన రామ బాణం చెట్లు గుబురుగా తీగలు సాగి మునగ చెట్టెక్కి బాగా విస్తరించాయి. చిన్న కాడతో తెల్లని బాణం లాగా పొడుచుకొచ్చిన పెద్ద రామబాణం మెుగ్గలు. మా అమ్మమ్మ ఆదేశం ప్రకారం ఆ మొగ్గలను సాయంత్రం నాలుగయిదు గంటలకు మా యింట్లో ఉండే రామన్న గోడమీద కెక్కి కోయాలి అవి విడిగి పోకముందే. అవి కోసేప్పుడు చిన్ని చిన్ని పూల మేదరి బుట్టలు పట్టుకుని నేను మా అక్క క్రింద నిలుచుండే వాళ్ళం. ఆ కోసిన మొగ్గలను మా బుట్టలోకి వేసేవాడు రామన్న. కొంచెం నిండగానే హాలులోకి వెళ్ళి అమ్మమ్మ ముందు చాపమీద పోసేవాళ్ళం. దాదాపు ఒక కేజి మొగ్గలు కాసేవి.

అమ్మమ్మ రెండు రెండు మొగ్గలను చాపమీద పేర్చేది. సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు పని అమ్మాయిలు , అప్పుడప్పుడు మా అమ్మ మొగ్గలు కట్టడం మొదలు పెట్టి రెండు గంటలపాటు ముగించేవారు.

కట్టిన మొగ్గలను వెడల్పు వెదురు బుట్టలో తడిగుడ్డ పరచి అందులో కట్టిన మాలలను పెట్టి తడి గుడ్డ కప్పి పెట్టేది అమ్మమ్మ.

సాయంత్రం ఏడు గంటల సమయానికి విచ్చుకుని రామబాణం పూల పరిమళం ఇల్లంతా చుట్టి వేసేది. సాయంత్రం మా అక్కకు , నాకు రెండు జడలు వేసి అడ్డంగా రెండు జడలను కలుపుతు ఒకొక్క మూర మాకు పూలు పెట్టేది మా అమ్మమ్మ.

దేవుని పటాలకు, అమ్మకు తీసిపెట్టి, వంటమనిషి రెడ్డేమ్మకు, పనిపాప వసంతకు, మిగిలిన పూలను ఆ వీధిలో వారికి రోజుకు నాలుగయిదు ఇండ్లకు ఇచ్చి పంపేది. మరచిపోలేని రామబాణం పువ్వులు.

ఒడిలో పోసుకుంటూ ఆడుకున్న జ్ఞాపకాలు ముసురుకున్నాయి ఆ పరిమళంతో పాటు.

అటు నుండి ఇంటిని ఆనుకుని ఉన్న మిద్దె మెట్లు ఎక్కాను. మిద్దెపైకి ఎక్కాక నా చూపులు ఎడమవైపుకు మళ్ళాయి.

దాదాపు నాలుగు వందల గజాలదూరంలో ఆ వీధికి కుడి మలుపులో మా మేనమామ ఇల్లు. అది దాదాపు మూడుఎకరాల స్థలం. నాలుగు వైపుల దాదాపు నలభై యాభై అడుగుల ఎత్తు గల రాతి ప్రహరీ కోటగోడలు. గోడలపై కొనలోఇనప బాణాలు. అటువైపు వీధిలోనుండి ఇంటిలోకి పెద్ద ఇనుప గేటు. చిన్న సంస్థానంలోని హంగులతో పెద్ద వరండ.

ఆ వరండాలో పులిచర్మంతో ఈజీ చెయిర్ లాంటి పెద్ద  కుర్చీ. మా మేనమామ నరసింహారెడ్డి కూర్చుంటారు ఆ కుర్చీలో.ప్రక్కన కొన్ని కుర్చీలు .

మా మామ మంచి వేటగాడు. రెండు పులులను వేటాడి చంపినారు. ఒక పులిని బాకరాపేట అడవిలో పులి తారసపడితే వేటాడి చంపి కారు డిక్కులో వేసుకుని వచ్చారు.అపుడు వా స్నేహితురాళ్ళతో బడినుంచి ఇంటికి వస్తూ మా మేనమామ కారులో వెనకల తెరచిన డిక్కీ లో పులిని చూసి మేము భయపడిపోయిన సీను నా కనులముందు మెదిలింది. నేను మూడో ,నాలుగో తరగతి చదువుతున్నానప్పుడు మదనపల్లిలో. మా అమ్మమ్మ చనిపోయిన తరువాత మా చదువులకోసం మదనపల్లె లోమా నాన్న (B.A. Hons. L.L.B.) లాయర్ గా మదనపల్లెలో ప్రాక్టీసు పెట్టారు.

మా మేనమామ ఇంట్లో లోపల దాదాపు నాలుగు పెద్ద హాలులు , ఆరు రూములు, కొంచెం విడిగా పెద్ద వంటిల్లు , దానికి ఆనుకుని పెద్ద స్టోర్ రూము. వంటగది ప్రక్కన పెద్ద భోజనాల గది పది మందికి పెద్ద డైవింగ్ టేబుల్ .ముఖద్వారానికి ఎదురుగావెనుక ఆరడుగుల ఎత్తు తులసి కోట.ఆ తులసి బృందాలనానికి మూడు వైపుల చుట్టూ దీపాలు పెట్టడానకి దీపపు గూళ్ళ తో ఐదడుగుల ఎత్తు గోడలు. దీపావళి, కార్తీక పౌర్ణమి పండుగలు,రాములవారి , పోలేరమ్మ తిరునాళ్ళ రోజులలో వెలుగుతాయి అన్ని దీపాలు.

ఆ బృందావనానికి ప్రక్కన వర్తులాకారంలో పెద్ద దేవుని గది. ఆ కోటగోడలకు లోపల ఒక మూల దాదాపు నలబై అడుగుల ఎత్తు నాలుగు పెద్ద రూముల లాంటి గెరిసెలు ధాన్యాలు పోసి నిల్వకు. మిద్దె ఎక్కి ఆ గరిసెలలోకి వడ్లు పోసేవారు.

ఆ ఇంటికి ముందు యాబై అడుగుల దూరంలో దాదాపు వందమంది పట్టే పెద్ద చావుడి ఉంది. మా తాతలు రైతులతో, ఇతర ఆఫీసుల నుండి వచ్చే సిబ్బందితో ఆ చావిడిలో మాట్లాడేవారు. ఆ పెద్ద చావిడిపై నుండి తిరనాళ్ళప్పుడు తప్పెటలు , కీలుగుఱ్ఱాలు,నెమలి నాట్యము, మాకు చూపెట్టేవాళ్ళు. పీర్ల పండగప్పుడు

పైనుండి తీపి మిఠాయిలు చల్లేవాళ్ళము. మా మేనమామ ఒక పీరును చేయించారు.

మా అమ్మమ్మ ఉన్న ఇంటికి ఎడమ వైపు సందు మలుపులో ఒక చావిడి. ఎవరు బయటి ఊరువాళ్ళు వచ్చినా అక్కడ ఉచిత భోజనము తినమని దండువారా వేయించేవాళ్ళట.

మా మామ వాళ్ళ ఇంటి ముందు కుడి వైపుకు ఐదారు వందల గజాల దూరంలోమా తాతలు కట్టించిన శ్రీరాములవారి దేవాలయం. అమ్మతో అప్పుడప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళం.

గుడికి దగ్గరే మేము వెళ్ళిన బడి. పక్కా గదులతో ప్రాథమిక పాఠశాల.

మిద్దె పైన నా చూపులు కలియతిరిగి ఆ పరిసరాలను జ్ఞాపకం చేసుకున్నాక క్రింద ఇంటి లోపలికి వచ్చాను.

మా అమ్మమ్మ హాలులో చాపపైన కూర్చొని వెండి తట్టలో వేడి అన్నంలో తన కుడిచేతి నిండ నెయ్యి పోసి, వట్టి పప్పు కలిపి, దానిలో పప్పు చారుపై తేట వేసి కలిపి మా ఇద్దరిని పిలిచింది .

ఇద్దరం వెళ్ళి అమ్మమ్మ ముందు కూర్చున్నాము. ఒక ఖాళి గిన్నెలోకి నీరు పోస్తూ మా చేతులు కడిగింది. తరువాత మాకు చేతి ముద్దలు పెడుతూంటే ఇద్దరం తింటున్నాము.

అంతలో మా అమ్మ స్నానం ముగించుకుని దేవుని గదిలోకి వెళుతూ “ఎన్ని రోజులు ఉంటావమ్మా, మరలా ఎప్పుడు నీ హైదరాబాదు ప్రయాణం” అని అడగటంతో ఆ కాలంలో అమ్మమ్మ చేతి ముద్దలు తింటున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న నన్ను ఈ కాలంలోకి తెచ్చి దింపింది ఆ జ్ఞాపకాల గోడ.

 

*****

 

 

 

చీకటి మూసిన ఏకాంతం – 2

రచన: మన్నెం శారద

‘నిన్న లేని అందమేదో నిదుర లేచేనెందుకో. నిదుర లేచేనెందుకో!’
అద్దంలో బొట్టు పెట్టుకుంటున్న నిశాంత తృళ్లి పడి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి నిలబడి చుట్టూ చూసింది. అక్కడ రేడియో కాని – టేప్ రికార్డర్ కాని ఆన్ లో లేవు.
ఘంటసాల పాటలంటే ఆమెకి ప్రాణం తీసుకునేంత ప్రాణం! అతని పాటల కేసెట్లన్ని సంపాదించి పెట్టుకుంది.
మనసు బాగున్నప్పుడు- బాగొలేనప్పుడు కూడా అవి హృదయాన్ని తెలిక పరిచి డోలలూగించి ఎవో లోకాలకి తీసుకుపోతాయి.
ఆ రోజుల్లో సంగీతం, సాహిత్యం, గళ మాధుర్యం- ఒక దానితో మరొకటి పోటీపడుతూ ఒక అద్భుతమైన రస సృష్టి చేసేవి.
దానికోసం ఆనాడు పడిన శ్రమ, ఆరాటం, ఏకాగ్రత అలాంటివి!
సంగీత మాధుర్యం ఆమెకి బాగా అర్ధమయ్యే స్థాయి వచ్చేనాటికి ఘంటసాల ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం- నిశాంతకిప్పటికీ తలచుకొనే కొలది బాధని కలిగిస్తుంటుందీ.
అతని పాట వింటే ఆమెకి లోకమే తెలియదు.
“ఇంకా తెమల్లేదా? ఇవాళ ఎగ్మూర్ మదరెండ్ చైల్డ్ హస్పిటల్ కి వెళ్లాలన్నావు” అంటూ ఆమె తల్లి వసుంధర పాల గ్లాస్ తో నిశాంత గదిలోకొచ్చిండి.
“ఇప్పుడు పాలొద్దు” నిశాంత తల్లిని చూసి గునుస్తూ కోటు చేతిలోకి తీసుకుంది.
“ఆ వయ్యారాలే పోకు. మొన్న శకుంతలాంటికి బాగోక చూడ్డానికి వెళితేనే ఆ హాస్పిటల్ లో వార్డులన్నీ తిరిగి తిరిగి ప్రాణం పొయింది. హాస్పటల్ అంతా తిరుగుతూ పేషంట్స్ ని చూడాల్సినడానివి. కాసిన్ని పాలన్నా తాగకపోతే నువ్వు వాళ్లని చూడటం కాదు- నిన్ను వాళ్లు చూడాల్సొస్తుంది.” అంది వసుంధర కాస్త కోపంగా.
తల్లి మాటలకి నిశాంత కిలకిలా నవ్వింది.
“అమ్మా! ఎంత బాగా నవ్వేవు! వరస పెట్టి పళ్లన్నీ లెక్కెట్టొచ్చు.
నిశాంత బుంగమూతి పెట్టి “డేడీ కి చెబుతా వెక్కిరిస్తున్నావని.” అంది చూపుడువేలితో బెదిరిస్తూ..
“ఆయన బోనులో నిలబెట్టి ఉరిశిక్ష వేయించేస్తారు. ఇలాంటివి చాలా చూసాను గానీ ముందా పాలు తాగు, చల్లారిపోతాయి” అంది విసుక్కుంటూ వసుంధర.
నిశాంత ఏడుపు మొహం పెట్టి పాల గ్లాస్ అందుకుంది.
‘ఇన్నాళ్లీ అందమంత ఎచట దాగెనో!’ నిశాంత గబుక్కున తాగుతున్న పాల గ్లాసు తల్లి చేతిలో పెట్టేసింది.
ఆ పాటకి మ్యూజిక్ ఎవరో పాడుతున్నారని గ్రహించేసిందామె.
“అయ్యో ఎంటిది?” అంది వసుంధరా తెల్లబోతూ.
“ఎవరో అచ్చం ఘంటసాల్లా పాడుతున్నారు కదూ!”
“పొద్దున్నే అడుక్కు తినే బేరం తగిలింది మీ నాన్నకి. ఆయనకేం పనా పాటా. పేరుకు లా ప్రాక్టీసు. ఒక కేసు చివరి వరకు వాదించింది లేదు. వచ్చిన క్లైంటు చేత సూటేయించడం. అవతలి పార్టీ వాడు కాంప్రమైజెశన్ కొస్తాడా లేదా ఆని కళ్లప్పగించి చూడటం” తల్లి మాటలు వినిపించుకోకుండానే హాల్ లోకి పరిగెత్తింది నిశాంత.
తేనెలు జాలువారుతున్న అతని గళంలోంచి బయట పడ్డ గానం సుగంధభరితమై గాలిలో కలిసి సర్వవ్యాప్తమై విన్నవారి హృదయాలన్నీ ఆనందమయ రసడోలికలూగిస్తున్నదీ.
ఘంటసాల పుట్టడనుకున్నాం పుట్టాడు!
ప్రకృతి అదిరిపాటుగా నిదుర లేచినట్లు, మ్రోడు వారిన శాఖోపరిభాగాలు చిగురించి, పుష్పభరితమై గాలి వాటుకి పూలని దోసిళ్ళతో రాలుస్తున్నట్లు, జలపాతాలు ముత్యాల రాసులై కొండ చరియల నుండి దూకుటున్నట్లు, మబ్బులో లేలేత సూర్యకిరణాల కాంతికి వెండి అంచులు సరిచేసుకుంటున్నట్లు… ఆమె కళ్లల్లో ఒక అద్భుత దృశ్యకావ్యం మువ్వలు కదిలిస్తూ నర్తిస్తోంది.
పాట ఆగింది.
ఆమె కళ్లలో కదలాడుతున్నా దృశ్యం ఫ్రీజ్ అయ్యింది.
ఎంతో ఎత్తు నుండి క్రిందకి జారినట్లయ్యింది నిశాంతకి.
నవనీతరావు జేబులోని పది రూపాయల నోటు తీసి అతని చేతిలో పెడుతూ “బాగా పాడావయ్యా, ఎప్పుడైనా కనిపిస్తుండు.” అన్నాడు.
“నమస్కారమండీ!” తన గొంతులో దైన్యమ్, కృతజ్ఞత కలబొస్తూ వినిపించేయి నిశాంత చెవులకి.
“మంచిది, మంచిది! వెళ్లిరా!” అతను మెట్లు దిగి వెళ్ళిపోతూంటే స్పృహలోకొచ్చింది నిశాంత.
కాని, అప్పటికే అతను గేటు దాటిపోయేడు.
“డేడీ!” అంది నిశాంత రివ్వున తండ్రి దగ్గరకి పరిగెత్తినట్లుగా వెళ్ళి,
నవనీతరావు కూతురివైపు ఆశ్చర్యంగా చూశాడు.
“అతను… అతనెవరు డేడి?”
నవనీతరావు నవ్వి “ నాకు తెలీదమ్మా , నేనడగలేదు . ఏదో చదువుకుంటున్నాడట . ఫీజు కట్టడానికి డబ్బు తగ్గితే … ఇట్లా నాలుగిళ్ళలో పాటలు పాడి పది రూపాయలు నంపాదించి గట్టెక్కుతున్నాడు.” అన్నాడు.
నిశాంత మనసు చివుక్కుమంది.
“బాగా పాడేడు కదూ!” తిరిగి అతనే అడిగేడు.
“మరీ పదిరూపాయలే ఇచ్చి పంపేవు డేడి!” కొంచెం బాధగా.
“పది రూపాయలు కాకపోతే ఒక పరగణా రాయమన్నావా? సాయంత్రమయ్యేటప్పటికి ఇంకెంత మంది తయారవుతారో! కొంప ధర్మసత్రమైపోయింది . నా ప్రాణమున్నంతవరకైనా ఈ యింటి నుంచుతారో లేదో!” అంది వసుంధర మళ్ళీ పాలగ్లాసు తీసుకోనక్కడికొచ్చి.
భార్య మాటలకి నవనీతరావు కూతురి వైపు చూసి నవ్వేడు.
“అదమ్మా సంగతి! ఈ యిల్లు వాళ్ళ నాన్న యిచ్చేడన్న సంగతి రోజుకి నాలుగుసార్లన్నా గుర్తు చేస్తుంది!”
తండ్రి మాటకి నిశాంత కూడ నవ్వింది.
“అద్సరే! నువ్వింకా హాస్పిటల్ కి బయల్దేరలేదేంటి? ” అన్నాడాయన. చేతి గడియారంకేసి చూనుకుంటూ.
“తండ్రికి, కూతురికి ఎవరన్నా బయటవాళ్ళని చూసుకుంటే పనులెక్కడ గుర్తుంటాయి. తాగే పాలగ్లాను ఆ ముష్టిపాట కోసం నా చేతిలో పెట్టి మరీ పరిగెత్తుకొచ్చింది” అంది వనుంధర నిష్ఠూరంగా.
నిశాంత మొహంలో నవ్వు మాయమైంది.
తల్లివైపదోలా చూసి “వస్తా డేడీ” అంటూ రివ్వున వెళ్ళి పోర్టికోలో నిలబడున్న కారెక్కేసింది.
కారు వెంటనే బయల్దేరింది.
“అయ్కో ఈ పాలు తాగనే లేదు” అంటూ తల్లి పెట్టిన కేక ఆమెకు వినబడనే లేదు. కారు రోడ్డు మలుపు తిరుగుతుంటే రోడ్డు వారగా తలవంచుకుని నడుస్తున్న అతను కనబడ్డాడు.
కొనల్లో దారాలు వ్రేలాడుతున్న పేంటు , హవాయి చెప్పులు , చిరిగిన కాలరుతో వున్న స్లేక్ – ఆమె అతని వరిస్టితి చూసి మనసులోనే బాధపడింది .
“డ్రైవర్ కారాపు!” అంది.
కారు సడన్ బ్రేక్ వేసినట్లాగిపొయింది.
“ఏమండి!”
అతను కారు వైపు చూసి తనని కాదేమోనన్నట్లుగా మళ్ళీ తల దించుకు నడవబోయేడు.
“ఏమండీ, మిమ్మల్నే!” అంటూ మళ్ళీ పిలిచింది నిశాంత.
అతనీసారి నిలబడి కారు వైపు అర్ధం కానట్లుగా చూసాడు.
“మిమ్మల్నే, మా చిన్నమ్మ గారు పిలుస్తున్నారు” అన్నాడు డ్రైవర్.
అతను కారు దగ్గరగా వచ్చి నిశాంత వైపు చూసాడు.
“మీ పాట చాలా బాగుంది. కేవలం బాగోవడం కాదు, అద్భుతంగా ఉంది”
“నా పాట… ఆహా… థాంక్స్ అండి” అన్నాడతను అయోమయంగా చూస్తూ.
“ఎక్కడికెళ్లాలి! రండి, నా కార్లో డ్రాప్ చెస్తాను” అంది నిశాంత చనువుగా.
“అబ్బే! వద్దండీ నేను… నడిచే వెళతాను” అన్నాడు సిగ్గుపడుతూ.
అతని మాటలకి నిశాంత నవ్వేసింది.
“అదేంటలా ఉరిశిక్ష పడినట్లు కంగారు పడిపోతారు. మా కారు బ్రేకులు సరిగ్గానే ఉన్నాయి. రండి” అంది చనువుగా కారు డోర్ తెరచి.
అతనికిక తప్పదన్నట్లుగా ఇబ్బందిగా కారెక్కి ముడుచుకున్నట్లుగా కూర్చున్నాడామె పక్కన.
కారు స్టార్టయింది
“ఎక్కడికి సార్!“ అన్నాడు డ్రైవర్.
“యునివర్సిటీ కేంపస్.”
“ఏం చదువుతున్నారు?”
“ఎమ్.ఏ ఎకానమిక్స్. మీరు?” అన్నాడతను కొంచం ధైర్యం చేసి
“హౌస్ సర్జనీ చేస్తున్నాను.”
అతనింకా కుంచించుకుపొయినట్లయిపొయేడు.
అదేం గమనించడం లేదు నిశాంత.
ఇంకా అతని పాట మైమరపులోనే ఉందామె హృదయం. మీరెంత బాగా పాడేరనుకున్నారు! మ్యూజిక్ లేకపోబట్టే, ఘంటసాల చనిపోబట్టి కానీ… లేకపోతే ఇది మీరు పాడేరంటే నమ్మేదాన్ని కాదు. నేను పరిగెత్తుకొచ్చేసరికే మీరెళ్లిపోయేరు లేకపోతే ఈ రోజు డ్యూటీ యెగ్గొట్టి మీ పాటలు వింటూ కూర్చునేదాన్ని!” అంది నిశాంత గలగలా.
అతనామె మాటలు వినిపించుకోవడం లేదు.
ట్రిమ్ చేసి పాలిష్ చేసిన గోళ్ళతో, ఖరీదైన హైహీల్స్ స్లిప్పర్స్లో ముడుచుకున్న కమలంలా వున్న ఆమె పాదాల్ని చూస్తున్నాడు. పక్కనే మట్టిపట్టి , రెండు సార్లు కుట్టించుకున్న హవాయి చెవుల్లో పెరిగిన గోళ్ళతో వున్న తన మోటు పాదాన్ని చూసుకొని ఎక్కడామె తన అవతారాన్ని గమనించి చీదరించుకుంటుందోనన్న సిగ్గుతో పాదాల్ని గబుక్కున వెనక్కి లాక్కున్నాడు.
ఆమె అదేం గమనించే స్థితిలో లేదసలు.”సంగీతం నేర్చుకున్నారా?”
“ఉహు! కుదర్లేదు!” అన్నాడతను దిగులుగా.
“కుదరకపోవడమేంటండీ! మనసుంటే మార్గముంటుంది. మీలాంటి గాయకుడికి సంగీత జ్ఞానం కూడ వుండి తీరాలి!” అంది నిశాంత.
అతను నవ్వి వూరుకున్నాడు. కారు యూనివర్శిటీ క్యాంపస్లో ఆగింది. అతను కారు దిగి మరోసారామెకు చేతులు జోడించేడు. నిశాంత ప్రతి నమస్కారం చేస్తూ “మళ్ళీ ఎప్పుడయినా కన్పిస్తారు కదూ! మీ పాటలు తీరుబడిగా వినాలి!” అంది.
అతను తల పంకించేడు.
ఆమె చెయ్యి వూపుతుండగా కారు వెనక్కు తిరిగి సాగిపోయింది.
* * *
నిశాంత గైనిక్ వార్డులో కెళ్తుండగా “హలో!” అన్నాడు విద్యాసాగర్.
నిశాంత వెనుతిరిగి నవ్వి “హలో! ఎక్కడ పోస్టింగ్!” అనడిగింది.
“సర్టికల్ వార్డ్.”
“అద్సరే నీతో మాట్లాడాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ” అంది గమ్మత్తుగా భుజాలెగరేసి నవ్వుతూ.
విద్యాసాగర్ కళ్ళగరేసేడు.
“ఇప్పుడే, ఇక్కడ, ఇలా కుదరదా?” అన్నాడు నవ్వుతూ.
“అబ్బా. డెట్టాల్ కంపు కొడ్తూనా,కుదరదు” అంది ముక్కు చిట్లిస్తూ.
“సరే! సాయంత్రం వరకూ వెయిట్ చెయ్యి. ఎటైనా వెళ్దాం” నిశాంత సంతోషంగా తలూపి వార్డులోకి వెళ్ళిపోయింది.
ఆ రోజు వార్డులో అంతగా పనిలేదు. కేసులు తక్కువ. హౌస్ సర్జన్స్ ఎక్కువగా వుండటంతో చేతికంత పని తగల్లేదు.
నిశాంత ఫైండింగ్స్ రాయడంలో పి.వి. చేయడంలో మాంచి నేర్పరిగా వుండేది. వార్డుకి పోస్టింగిచ్చినా డయాగ్నైజు చేస్కొని తొందరగా ప్రొసీడయ్యేది.
“నువ్వు మంచి ఫిజిషియన్‌వవుతావు” అని మెచ్చుకునేవాడు విద్యాసాగర్ అప్పుడప్పుడు.
“నువ్వు మాత్రం!” అనేది నిశాంత నవ్వుతూ.
“ఒక్కడిగా నేనేం చెయ్యలేను. నువ్వు తోడుంటే.. అయ్ మీన్.. మనిద్దరం కలిసి ప్రాక్టీస్ పెడితే ఫీమేల్ కేసులన్నీ నువ్వు చూసుకోవచ్చు” అని భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేస్తుండేవాడు విద్యాసాగర్.
“చూద్దాంలే!” అంటూ నవ్వేసేది నిశాంత.
నిశాంతలా చీటికి మాటికి నవ్వడం అతనికి చిత్రంగానూ వుండేది, ఇష్టంగానూ వుండేది.
నిశాంత బయటకి రాగానే స్కూటర్ తీసుకుని నిలబడి వున్నాడు విద్యాసాగర్.
నిశాంత కారుని ఇంటికి పంపించి అతని స్కూటరెక్కింది.
స్కూటర్‌ని శాంథోం బీచ్‌కి మళ్ళించేడు సాగర్.
సముద్రం మీద గాలి చల్లదనాన్ని ఆపాదించుకుని ఒడ్డునున్న వాళ్లని పరామర్శిస్తోంది. ఆకాశంతో విలీనమై రెండింటి మధ్యనున్న హద్దుని తుడిపేస్తోంది.
మంచిని మోసుకొచ్చే రాయబారుల్లా కెరటాలు నురుగుని ఒడ్డుకి వదిలేసి వెనక్కు మళ్లుతున్నాయి.
స్కూటరుని పార్కు చేసి యిద్దరూ మెట్లు దిగి ఇసుకలోకి నడిచేరు.
“నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో!”
ప్రొద్దుట హృదయాన్ని అగరుధూపంలా ఆవరించి అలరించిన పాట తిరిగి నిశాంత స్మృతిపథంలో కదలాడటం ప్రారంభించింది.
“ఇక్కడ కూర్చుందామా?” అడిగేడు విద్యాసాగర్.
“సముద్రం బాగుంది కదూ!” నిశాంత ఇసుకలో కూర్చుని చేతులు వెనక్కి ఇసుకపై ఆన్చి పరవశంగా అంది.
విద్యాసాగర్ జేబులోంచి చిన్న నోట్‌బుక్ తీసేడు.
“ఏంటది?”
“నువ్వీమాట ఎన్ని వందలసార్లన్నావో లెక్కలతో సహా చెబుదామని” అంటూ నవ్వేడు విద్యాసాగర్.
“ఎన్నివందలసార్లు చూపినా నాకు కొత్తగనే అనిపిస్తుంది సముద్రం” అంది నిశాంత సముద్రంకేసి తన్మయత్వంగా చూస్తూ.’
“ఏవుంది బోర్! నీ కోసం వస్తాను గాని ఏవుందీ ఉప్పు నీళ్లలో. దాహానిక్కూడ పనికిరావు”అన్నాడు సాగర్ నిర్లక్ష్యంగా.
నిశాంత అతనివైపు కోపంగా చూసింది.
ఆమె కోపం చూసతను గట్టిగా నవ్వేసేడు.
“నీకసలు టేస్ట్ లేదు” అంది కసిగా.
“ఈ మాట కూడా ఎన్ని వందలసార్లన్నానో పుస్తకం చూడాలి!” అంటూ నోట్‌బుక్ పేజీలు తిప్పబోయేడు విద్యాసాగర్ మళ్లీ.
అతని చేతిమీద గట్టిగా కొట్టి కోపంగా లేచి నిలబడింది నిశాంత.
పుస్తకం ఎగిరి ఇసుకలో పడింది.
విద్యాసాగర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆపి “నీకస్సలు స్పోర్తివ్ నేచర్ లేదు. ఏదో అర్జెంటుగా మాట్లాడాల్ని పిలిచి సముద్రం గురించి వర్ణనని ప్రారంభిస్తే ఏమనాలి?” అన్నాడూ.
నిశాంత నవ్వుతూ తిరిగి కూర్చుంది.
“హమ్మయ్యా! చీకట్లు తొలిగిపోయేయి. ఇక అసలు సంగతి చెప్పు!” అన్నాడు సాగర్.
“నువ్వు నాకో సహాయం చెయ్యాలి విద్యా!” అంది నిశాంత సీరియస్‌గా.
ఆమె వైపు తదేకంగా చూస్తూ “నేను… నీకు సహాయం చెయ్యడమా బాగుంది జోక్!” అన్నాడు.
“నేను జోక్ చేయడంలేదు. నిజంగానే చెబుతున్నాను. ఈ పని నీవలనే అవుతుంది” అంది నిశంత మోకాళ్లమీద తలనుంచుకుని అతనివైపు చూస్తూ.
ఆమె పెద్ద పెద్ద వాలుకళ్లలో సిన్సియారిటీని, సీరియస్‌నెస్‌ని గమనించేడతను.
అందుకే ఈసారతను నవ్వలేదు.
మౌనంగా ఆమె చెప్పఓయే విషయం వినడానికి సిద్ధపడ్దాడు.
“ఎంత బాగా పాడేడనుకున్నావు. ఘంటసాలే దిగివచ్చేడనుకున్నాను. అలాంటి వ్యక్తి కేవలం కాలేజీ ఫీజు కట్టడానికి గుమ్మాల దగ్గర నిలబడి తన గొంతుని బిచ్చమెత్తడానికి ఉపయోగిస్తున్నాడంటే.. నాకు పొద్దుట్నించి వార్డులో వున్నానే గాని మనసు మనసులో లేదు” అంటూ బాధగా వివరించింది పొద్దుట జరిగిన ఉదంతాన్ని.
అంతా విని మళ్ళీ నవ్వేడు విద్యాసాగర్.
“నీ మనసు పాడవ్వడానికి ఏమంత గొప్ప విషయం కావాలి. ఏ శుద్ధోధన మహారాజు పుత్రుడో ఇలా ఆడజన్మ ఎత్తేడనుకుంటాను. ఏ కిటికిలో నుండో తమకి ఏ ముసలమ్మో, ఏ అడుక్కుతినేవాడో తారసపడతారు. తర్వాత తమ హృదయం ఫ్రిజ్‌లోంచి తీసిన అయిసు ముక్కలా కరిగి నీరవడం ప్రారంభిస్తుంది. వాటిని ఎత్తడానికి నేనున్నానుగా దోసిళ్లతో!”అన్నాడు సాగర్ నాటక ఫక్కీలో.
“నువ్వింత హేళనగా మాట్లాడుతావనుకోలేదు. అతనికేదైనా సహాయపడ్తావని ఆశించేను.”అంది నిశాంత బాధగా.
“సారీ! మనమేవిధంగా అతనికి సాయపడగలం!” అన్నాడు సాగర్.
“అనుకుంటే ఏమైనా చెయ్యగలం. ఏదైనా ప్రోగ్రాం అతని చేతిప్పించి టిక్కెట్సు అమ్మి ఆ డబ్బు అతనికందిస్తే అతని చదువు సజావుగా సాగిపోతుంది. తర్వాత ఏవైనా ప్రోగ్రామ్స్ అతనికి దొరికి పాపులరయితే..”
“అంచెలంచెలుగా ఆకాశంలోకి ఎదిగిపోతాడంటావు!” అన్నాడు సాగర్ వెక్కిరింతగా.
“ఎవరదృష్టం ఎలా వుంటుందో ఎవరు చెప్పగలం?”
“కాదని నేననడం లేదు. మనం హౌస్ సర్జెన్సీలో వున్నాం. ఈ ఆర్నెల్లూ గట్టిగా కృషి చేస్తే మనకి డాక్టర్ డిగ్రీ చేతికొస్తుంది. మధ్యలో ఈ చికాకులు దేనికని?”
“నీ యిష్టం. ప్రొద్దునతని పరిస్థితి చూస్తే ఏదో ఒకటి చేసి అతనికి సహాయపడాలనావేశం వచ్చింది. మీరంతా సహకరించకపోతే నేనొక్కర్తినీ ఏం చేస్తాను?”
ఆమె మొహంలో ఆశాభంగం చూసి సాగర్ మెత్తబడ్డాడు
“సరే. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంతకీ అతని పేరేంటి?
“పేరా?… పేరు నేనసలడగనే లేదు.”అంది కంగారుగా.
సాగర్ నవ్వి “సర్లే.. అతన్ని కనీసం గుర్తుపట్టగలవా?”
“బాగా”
“అయితే పద వెళ్దాం” అంటూ లేచి నిలబది ఆమెకు చెయ్యందించేడు.
నిశాంత అతని చేతి ఊతతో లేచి నిలబడి చీరకంటిన ఇసుక దులుపుకొని అతన్ననుసరించింది.
ఇద్దరూ మెట్లెక్కుతుండగా నిశాంత కళ్లలో మెరుపు మెరిసింది.
“అదుగో! అతనిటే వస్తున్నాడు” అంది ఉత్సాహంగా.
సాగర్ అటువైపు చూశాడు.
అతను తలదించుకొని మెల్లిగా ఇసుకలో అడుగులేస్తున్నాడు.
నిశాంత అతనివైపు పరిగెత్తి “ఏమండి?” అంది గట్టిగా.
అతను తలతిప్పి నిశాంతవైపు చూసి “మీరా మేడం!” అన్నాడు ఆశ్చర్యంగా.
“అవును. నేను మీకోసమే బయల్దేరబోతున్నాను. గమ్మత్తుగా మీరే ఎదురు పడ్డారు”అంది నిశాంత ఉత్సాహంగ.
అతను తెల్లబోతూ “నా కోసమా?” అన్నాడు.
విద్యాసాగర్ వాళ్ల దగ్గరగా వచ్చి “ఇప్పటిదాకా మీ సంగతులే చెబుతోంది. ఇంతకీ మీ పేరు తెలీదట. ఫన్నీ..”అన్నాడు నవ్వుతూ.
అతను సాగర్ వైపు ఎవరన్నట్లుగా చూశాడు.
“ఈయన పేరు విద్యాసాగర్! నా క్లాస్‌మేట్!” అంటూ పరిచయం చేసింది నిశాంత.
అతను సాగర్‌తో చెయ్యి కలిపి “గ్లాడ్ టూ మీట్ యూ! నా పేరు హితేంద్ర!” అన్నాడు నవ్వుతూ.
“రండి. అలా కూర్చుని మాట్లాడుకుందాం.” అంటూ మళ్లీ బీచ్‌లోకి దారి తీసింది నిశాంత.
ముగ్గురూ జనరద్దీకి కొంచెం దూరంగా సముద్రాని కభిముఖంగ దగ్గరగా కూర్చున్నారు.
కెరటాల హడావుడెక్కువయింది.
చీకటి జాలరి విసిరిన వలలా సముద్రంలోకి పాకుతోంది.
“మీ గురించి నిశాంత అంతా చెప్పింది” అన్నాడు సాగర్ ఉపోద్ఘాతంలా.
అతను తల దించుకున్నాడు.
“చాలా చాలా బాగ పాడతారట. ఈ వాతావరణంలో ఒక పాట వినిపిస్తే..”అభ్యర్తిస్తున్నట్లుగా అడిగేడు సాగర్.’
హితేంద్ర నిశాంతవైపు ఇబ్బందిగా చూశాడు.
ఆమె కనుదోయిలో ప్రార్ధన తొణికిసలాడింది.
కాదనలేనట్లుగా అతను సముద్రం కేసి చూపులు నిగిడించేడు.
సముద్ర తరంగాలు వెన్నెల్ని చూసి ఉత్సాహంగా పడి లేస్తున్నాయి.
ఆందమె ఆనందం.. ఆనందమె జీవిత మకరందం.. వసంత కుసుమ మకరందంలా అతని గొంతులోంచి పాట బయల్వడింది.
కెరటాల ఘోష పక్క వాయిద్యమైంది.
సంగీతాభిరుచి లేని సాగర్ కూడా తనకి తెలియకుండానే పాటలో లీనమైపోయేడు.
“మీ పరిచయం కావడం నా అదృష్టంగా భవిస్తున్నాను” అని చెబుతూ “భలే మంచి రోజు, పసందైన రోజు” పాడేడు.
అలా ఎంతసేపో.
ఇక చాలు అనలేకపోయారిద్దరూ.
చీకటి ఆకాశంలో తన గుడారమెప్పుడు బిగించిందో వెన్నెల దాన్ని చీల్చి చెండాడాలని ఎప్పట్నుంచి ప్రయత్నిస్తుందో ఆ ముగ్గురిలో ఎవరు గమనించలేదు.
“అన్నీ ఘంటశాల పాటలే పాడుతున్నారు!” అంటూ సందేహం వెలిబుచ్చేడు సాగర్.
“నా గొంతుకు అవే బాగా సూటవుతాయి” వినయంగా చెప్పేడు హితేంద్ర.
“అవును” అంది నిశాంత.
“మీదొక ప్రోగ్రాం ఎరేంజ్ చేద్దామనుకుంటున్నాం” అంటూ తమ ఉద్ధేశ్యం చెప్పేడు విద్యాసాగర్.
“ప్రోగ్రామా?” అన్నాడతను అపనమ్మకంగా చూస్తూ.
“అవును నిశాంత చాలా పట్టుబడుతున్నది. ఇంకా ఎలా అన్నది మేము నిర్ణయించుకోలేదు. కాని ఈ లోపున మరికొన్ని మంచి పాటలు ప్రాక్టీసు చెయ్యండి. వీలయితే కాస్త సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఆర్ట్ గురించి నాకంత బాగా తెలియదనుకోండి.”అన్నాడు సాగర్.
అతను మాట్లాడలేదు.
నిశాంతవైపు కృతజ్ఞతగా చూశాడు.
ముగ్గురూ లేచి నీబడి నడవడం ప్రారంభించేరు.
“మా నిశాంత దృష్టిలో పడటం మీ అదృష్టమనే చెప్పాలి. ఇక మీ గురించి మీకు బెంగక్కర్లేదు.”అన్నాదు సాగర్ మళ్లీ నవ్వుతూ.
వాళ్ళిద్దరూ స్కూటర్ ఎక్కుతుంటే అతను చేతులు జోడించేడు.
“ఎలా పాడేడు?” స్కూటర్ వెళ్తోంటే అడిగింది నిశాంత.
“నువ్వు చెప్పేవంటే దానికి తిరుగుంటుందా?” అన్నాదు సాగర్ స్కూటర్ వేగాన్ని పెంచుతూ.
నిశాంత గర్వంగా నవ్వుకొంది.
*****

ఇంకా వుంది.

అమ్మమ్మ -3

రచన: గిరిజ పీసపాటి

అన్నపూర్ణ శాస్త్రులు గారు చెప్పిన విధంగా సింహాచలం వరాహ నృసింహస్వామి సన్నిధిలో నలభై రోజుల పాటు సుందరకాండ ఒకరు పారాయణ చేస్తుండగా, ఇంటి దగ్గర పాలు ఇస్తున్న ఆవుకి, దాని దూడకి అమ్మమ్మ సేవ చెయ్యసాగారు. నలభై రోజుల పారాయణ, గో సేవ పూర్తయాక ఆ పుణ్యఫలాన్ని అన్నయ్యకి ధార పోసారు అమ్మమ్మ. తరువాత కొన్ని రోజులకే గవర్నమెంట్ రద్దు చేసిన సర్టిఫికెట్లు చెల్లుతాయని చెప్పి, తిరిగి ఇవ్వడమే కాకుండా ఆయనకి హెల్త్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కూడా ఇవ్వడంతో తన శ్రమ ఫలించి అన్నయ్య జీవితం బాగుపడినందుకు ఎంతో సంతోషించారు అమ్మమ్మ. తరువాతి కాలంలో ఆయన ఆంధ్రప్రభలో వారఫలాల శీర్షికను నిర్వహించేవారు. జాతకాలు బాగా చెప్తారనే పేరు గడించారు.

తాతయ్య ఉద్యోగం చేస్తూ స్వయంగా ఇంగ్లీష్ నాటకాలు రచించి వాటిని, వాటితో పాటు షేక్‌స్పియర్ నాటకాలను కూడా తమ విద్యార్ధులతో స్కూల్ యొక్క ‘ప్లే డే’ నాడు వేయించేవారు. స్కూల్ నుండి తిన్నగా టౌన్ హాల్ కి వెళ్ళి పేకాట ఆడేవారు. ఇంటికి రావడానికి ఒక సమయమంటూ ఉండేది కాదు. ఇంటి అవసరాలను పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు. ఈ విషయం అమ్మమ్మని చాలా బాధపెట్టేది. ఎంత చెప్పినా వినేవారు కాదు.

తనకి సాహిత్యం, నాటక రంగం మీద ఉన్న అభిలాషతో గౌతమ బుద్ధ, పృథ్వీ పుత్రి, రాజ్య కాంక్ష మొదలైన నాటకాలను రచించారు. ఈ సమయంలోనే ఆయనకి హెడ్ మాస్టరుగా పదోన్నతి కూడా లభించడం జరిగింది. తాతయ్య ఇల్లు పట్టకుండా తిరిగినా లోలోపల బాధ పడిందే తప్ప అమ్మమ్మ ఏనాడూ తాతగారిని ఎదిరించలేదు. ఆయన ఏ సమయానికి ఇంటికొచ్చినా అప్పటికప్పుడు స్నానానికి వేడినీళ్ళు సిధ్ధం చేసి, ఆయనకు ఇష్టమైన వంటకాలు చేసి పెట్టేది. అమ్మమ్మ వంట చాలా బాగా చేస్తుంది. ఆవిడ వండే రకరకాల వంటలు చాలా మందికి రావు కూడా.

ఆఖరికి తాతయ్య వ్యవహారంతో విసిగిపోయిన అమ్మమ్మ ‘నేను చస్తే గానీ ఈయనకి బుధ్ధి రాదు. అయినా నా పిచ్చి గానీ… నేను కూడా పోతే ఏ బంధాలు, బాధ్యతలు లేవని ఇంకా స్వేఛ్ఛగా, అదుపు లేకుండా తిరుగుతారు. ఒక బిడ్డ పుట్టిన తరువాత నేను చచ్చిపోతే, ఆ బిడ్డను సాకడం, పెంచడం చేస్తే అప్పుడు తెలిసొస్తుంది ఈయనకి నా బాధ. అవును. ఇదే సరైన మార్గం. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన ఫలాలన్నిటినీ తిరిగి తీసుకుపోయాడు. నిర్దయుడు. అనుకుంటూ…

దేవుడి గదిలోకి వెళ్ళి తన ఇష్ట దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి నమస్కరిస్తూ… స్వామీ! నన్ను కరుణించి నాకో బిడ్డను ప్రసాదించు. బిడ్డ పుట్టాక నీకు కంఠానికి కాటు ఇచ్చి, నా ప్రాణాలను నీకు ఇచ్చేస్తాను. నా ఈ ఒక్క కోరిక తీర్చు’ అంటూ కన్నీళ్ళతో వేడుకున్నారు. ఈ సంఘటన జరిగాక అమ్మమ్మకి నెలసరి రాలేదు. అప్పుడు అమ్మమ్మ వయసు నలభై మూడు సంవత్సరాలు. మెనోపాజ్ అనుకుని ఊరుకున్నారు అమ్మమ్మ.

నాలుగు నెలలు గడిచాక ఆమెను చూసినవాళ్ళందరూ పొట్ట ఎత్తుగా కనిపిస్తోంది, ఏమైనా విశేషమా!? అని అడగడం, అందుకు అమ్మమ్మ అలాటిదేమీ లేదని చెప్పడం జరిగేది. కానీ, దగ్గర వాళ్ళు, తోడికోడళ్ళు మాకెందుకో అనుమానంగా ఉంది. ఒకసారి డాక్టర్ ని కలువు అంటూ మందలించేసరికి, అమ్మమ్మకి బాగా పరిచయస్తురాలు అయిన లేడీ డాక్టర్ రాజేశ్వరమ్మగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. ఆవిడ అమ్మమ్మను పరీక్ష చేసి, తల్లివి కాబోతున్నావు అనే శుభవార్త చెప్పారు.

ఆ వార్త విన్న అమ్మమ్మకి సంతోషించాలో, బాధపడాలో అర్ధం కాలేదు. ఈ వయసులో నెల తప్పి నలుగురిలోకి ఎలా వెళ్ళడం, ముఖ్యంగా బావగార్లకి ముఖం చూపించలేని సిగ్గు, చిన్నతనం ఒక పక్క, ఈ బిడ్డ కూడా దక్కకపోతే ఈ వయసులో ఆ శోకాన్ని భరించగలనా అనే బాధ, ఇప్పటికైనా మళ్ళీ తన కడుపు పండిందనే ఆనందం. ఇలా అన్ని భావాలు ఒకేసారి చుట్టుముట్టి ఆవిడని ఉక్కిరిబిక్కిరి చేసేసాయి.

నెలలు నిండాక రాజేశ్వరమ్మగారు పురుడు పోయగా, మహాలక్ష్మిలాంటి ఆడపిల్లకు (మా అమ్మగారికి) జన్మనిచ్చింది అమ్మమ్మ. ఆ పిల్లకు ఇది వరకు పిల్లలకు చేసిన ఏ వేడుకా చెయ్యలేదు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నపూర్ణ శాస్త్రులగారి సూచన మేరకు ‘నాగ’ అనే పేరుని కలిపి, లక్ష్మీ నాగకుమారి అని నామకరణం చేసారు. బారసాలనాడు కూడా పాపకి కొత్త బట్టలు కొనలేదు. కారణం తాము ఏ ముచ్చట, వేడుక చేసినా ఈ పాప కూడా దక్కదేమోననే భయమే. ఆఖరికి అన్నప్రాశన కూడా జరిపించలేదు. అసలు తన పిల్ల కానట్లే ఉండేది. తన చెయ్యి మంచిది కాదు. తను ఆ పాపకి ఏం చేసినా తనకు దక్కదు. ఇదే భయంతో కొట్టుమిట్టాడేది. కడుపు తీపి ఒక పక్క, భయం మరో పక్క. ఎంత ఆవేదన అనుభవించిందో పిచ్చితల్లి.

నాగ ఆలనా, పాలనా పక్క వాటాలోని వారే చూసుకోసాగారు. నాగ బంగరడం మొదలు పెట్టాక ఒకరోజు బంగురుకుంటూ వెళ్ళి పక్కింటి వాళ్ళు అన్నం తింటుంటే వాళ్ళ విస్తరిలోని ఎంగిలి మెతుకులు తన చేతితో తీసుకుని తింది. ఇదే నాగ అన్నప్రాశన వేడుక. ఆరోజు నుండి వాళ్ళే నాగకు అన్నం తినిపించేవారు. కూతురు పుట్టాక తాతయ్యలో కొద్దిగా మార్పు వచ్చింది.

సహజంగానే నటనా రంగంపై ఆసక్తి ఉన్న తాతయ్య తెనాలిలో ఏ నాటకం ఉన్నా అమ్మమ్మతో కలిసి వెళ్ళేవారు. ఈ విధంగానే స్వర్గీయ శ్రీ పీసపాటి నరసింహమూర్తి (మా నాన్నగారి నాన్నగారు, నాకు తాతగారు) గారి నాటకాలకు కూడా వెళ్ళేవారు. కానీ ఒకరినొకరు పరిచయం చేసుకోలేదు. నాగ పుట్టాక కూడా పాపను తీసుకుని తరచూ నాటకాలకు వెళ్ళేవారు.

ఈ సమయంలోనే పీసపాటి నరసింహమూర్తిగారి సహ నటుడు ఆయనతో ఎంతో నమ్మకంగా ఉంటూ, ఇన్కమ్ టాక్స్ చెల్లించే విషయంలో తప్పుడు లెక్కలు చూపించడం, డిపార్ట్మెంట్ వాళ్ళు పీసపాటి తాతగారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సరైన లెక్కలు చూపించేవరకూ తన ఆస్తులలోని పైసా కూడా వాడరాదనే ఉత్తర్వులను జారీ చేసింది.

************** సశేషం **************