September 17, 2021

సంసారసాగరంలో సుడిగుండం

పెద్దల  ఆశీర్వాదాలతో   పెళ్లి పందిరిలో  ఫెళ్లుమని  కుప్పుస్వామి,   కుప్పుసానమ్మ మెడలో తాళి కట్టేసి అమ్మయ్య నాకు కూడా పెళ్లి అయిపోయింది అని సంతోషించేశాడు. పెళ్లి అయిన నాలుగు రోజుల తరువాత  కుప్పుసానమ్మ సమేతుడై   కుప్పుస్వామి ఉద్యోగం చేసే అస్సాం లోని జోర్హాట్ కి వచ్చేశాడు.  దూరభారం వల్ల ఎవరూ తోడు రాలేదు. కుప్పుసానమ్మ సంగీతం అయితే నేర్చుకుంది కానీ, చదువు స్కూలు దాటలేదు. తెలుగు తప్ప మరో భాష రాదు.  ఇన్స్టిట్యూట్ లో మూడు  తెలుగు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి   ఆవిడకి కాలక్షేపానికి లోటు లేదు. ఇతరులతో సంభాషించేటప్పుడు కుప్పుస్వామి దుబాసీ పాత్ర పోషించేవాడు.  ఇన్స్టిట్యూట్ కేంపస్ పెద్దది. ఊరికి సుమారు 7 km. దూరం లో ఉంది. కాలనీ లో కోపరేటివ్ స్టోర్స్ ఉంది. అక్కడ సౌత్ ఇండియన్ కిచెన్ కి కావల్సిన వస్తువులు కొన్ని దొరకవు. అందుకని జోర్హట్ టౌన్ కి వెళ్ళాలి. కాపురం  పెట్టిన 10 రోజుల్లో మూడు మాట్లు వెళ్ళి కావల్సిన సామాను తెచ్చుకున్నారు.  ఆనందమాయే  అలి నీలవేణీ అని పాడుకుంటూ  ఇంకో పదిరోజులు గడిపేసారు.

 

అప్పుడు ఒక ఆదివారం వచ్చింది. పాపం ఇరవై రోజులు  పైగా సినిమా చూడలేదు అనుకొని వెళదామా అని అడిగాడు కుప్పుస్వామి . నాకు హింది, అస్సామీ సినిమాలు అర్ధం కావండి అంది శ్రీమతి. కుప్పుస్వామి ఒక చిరు నవ్వు నవ్వి ‘ససురాల్’ అని హింది సినిమా మన ‘ఇల్లరికం’ అన్నమాట. నీకు అర్ధం అవుతుంది అని వివరించాడు. మద్రాస్ హోటల్ లో ఇడ్లీలు తిని, ఉదయం ఆట చూసి, మధ్యాహ్నం  హోటల్ ఈస్ట్రన్ లో భోజనం చేసి ఊరు తిరిగి, వద్దామని పెద్ద ప్రోగ్రాము తయారు చేసుకున్నారు.

 
సరే ఉదయం 9 గం. బయల్దేరి మద్రాస్ హోటల్ కి వెళ్ళి కూర్చున్నారు. నాయర్ వచ్చి వీళ్ళని  చూసి రెండు ఇడ్లీ అని అరిచాడు.  పొన్ను గారు పెళ్ళాం వాడా సారూ అని కూడా అడిగాడు. కుప్పుస్వామి నాయర్ ని కోప్పడ్డాడు. “నువ్వు తెలుగు సొల్లుంగా,  తమిళ్ చెప్పుంగా,  రెండు బోలు నా ఇల్లై” అని  . కుప్పుస్వామి చెప్పింది వాడికి అర్ధం అయిందో లేదో కుప్పుస్వామి పట్టించుకోలేదు. నాయరు ప్రొప్రైటరు కం సర్వర్.  క్లీనరు వేరే ఉన్నాడు. యెస్ మై  వైఫ్ Mrs. కుప్పుసానమ్మ కుప్పుస్వా మి అని పరిచయం చేశాడు. రొంబ పేరు సామి హిహిహి అని వెళ్ళి పోయాడు.  ఇడ్లీ పట్టుకొచ్చి ఎన్న సామీ అన్నాడు. రెండు మసాలా దోసలు చెప్పాడు కుప్పుస్వామి.  ఆపైన కొసరుగా కాఫీ తాగి బిల్ ఇవ్వబోతుంటే  నాయరు మొహమాట పడ్డాడు. మొదటి  మాటు భార్యా సమేతం గా వచ్చారు కాబట్టి  దిస్ ఇస్ మై ట్రీట్ అని కూడా అన్నాడు. ఇంకో ఊతప్పం తిననందుకు విచారించాడు కుప్పుస్వామి. అన్నీ మంచి శకునములే  హోటల్ బిల్లు మిగిలెనులే అని కూడా పాడుకున్నాడు.

 

సినిమా హాలు  కి వెళ్ళి టికెట్ కొని హాల్లో అడుగుపెట్టేరు.   వెనక వరస లో Dr. ఆరోరా సతీ సమేతుడై కూర్చున్నాడు. సినిమా కి వచ్చావా అన్నాడు. లేదు కూరగాయలు కొనుక్కుందుకు వచ్చాను అన్నాడు కుప్పుస్వామి .  హాహాహహ అన్నాడు. ఆరోరా పంజాబీ వాడు. వీరికి భాంగ్రా అంటే చాలా ఇష్టం. మాట్లాడేటప్పుడు కూడా చేతులు పైకి ఎత్తి  తిప్పేస్తాడు. ఉన్నట్టుండి కాలు గోక్కుంటాడు. మరీ ఉత్సాహం వచ్చిందంటే పక్కనున్న వాడి వీపు మీద ఫెడేల్ మని చరుస్తాడు. అందుకని ఆయనకి అందనంత  దూరంలో నుంచుని మాట్లాడుతారు తెలిసిన వాళ్ళు . పెళ్ళాం పక్కనుంటే మాత్రం చేతులు కట్టుకొని వివేకానంద ముద్ర లో నుంచుంటాడు.  ఈయన ఎక్కువగా ఏమైనా చేస్తే,  ఆవిడ ఆయన కాలు  తొక్కుతుంది. ఎల్లా వచ్చావు అన్నాడు. రిక్షా అన్నాడు  కుప్పుస్వామి. మాతోటి వచ్చుండాల్సింది. అన్నాడు. మీరు వస్తున్నట్టు నాకు తెలియదు కదా అన్నాడు కుప్పుస్వామి.    వెళ్ళేటప్పుడు  తీసుకెళ్లతాను  మా కారు లో అన్నాడు ఆరోరా . లేదు, భోజనం చేసి బయల్దేరుతాము అన్నాడు కుప్పుస్వామి. ఎక్కడ ? బ్రాడ్వే నా,  ఈస్ట్రన్  నా, మేము కూడా వస్తాము అన్నాడుఆరోరా  . శ్రీమతి ఆరోరా  ఆయన డొక్కలో తన మోచేతితో పొడిచింది. కొత్త  దంపతులు సరదాగా వెళ్ళుతుంటే పానకం లో పుడకలా మనమెందుకు అంది ఆయన చెవిలో.  హోటల్ కి ఎందుకు మా ఇంటికి వచ్చేయండి  ఆలూ పరోటాలు తినేద్దాము అని కూడా అంది కుప్పుస్వామి తో . యెస్, రైట్, వచ్చేయండి మా ఇంటికి అని ఆరోరా కూడా అన్నాడు.  తరవాత ఎప్పుడైనా అని తప్పించుకున్నాడు కుప్పుస్వామి.

 

కష్టపడి సినిమా చూసేశారు. సినిమా అయిన తరువాత  భార్యా మణి ని  అక్కడే  ఉండమని చెప్పి,  కుప్పుస్వామి 100 mts. దూరం లో ఉన్న దుకాణంలోకి వెళ్ళాడు ఏదో కొనాల్సివచ్చి. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ  ‘టుక్లై  టీ  రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’   రంగనాధం గారు కనిపించారు.  ఆయనతోటి రెండు మాటలు మాట్లాడి తిరిగి వద్దామనుకుంటే ఆయన ఆపేశాడు. ఉండు మా ఆవిడ వస్తుంది. మీ ఆవిడని పరిచయం చెయ్యవా అంటూ. నేను హాల్ దగ్గర ఉంటాను. మీరు రండి అంటే ఉండవయ్యా వస్తున్నాము.  మళ్ళీ మిమ్మలని అక్కడ ఎక్కడ వెతకాలి అంటూ మొహమాట పెట్టేశాడు. అయ్యో పాపం అక్కడ ఒంటరిగా కుప్పుసానమ్మ అని జాలిపడ్డాడు కుప్పుస్వామి కానీ రంగనాధం గారిని తప్పించుకో లేకపోయాడు.  ఆవిడ షాపింగ్ ముగించుకు వచ్చేటప్పటికి ఇంకో  పావుగంట పైనే పట్టింది. వాళ్ళని తీసుకొని హాల్ దగ్గర కొచ్చేటప్పటికి అక్కడ కుప్పుసానమ్మ కనిపించలేదు. పక్కనే ఉన్న హోటల్ ఈస్ట్రన్ కి వెళ్ళి చూశారు. అక్కడా లేదు. బహుశా ఆరోరా గారితో వెళ్లి ఉంటుందేమో అన్నాడు కుప్పుస్వామి. సరేలే మేము రెండు మూడు రోజులలో వస్తాము అని చెప్పి రంగనాధం గారు వెళ్ళిపోయారు.

 

 

వాళ్ళతో అనడం అయితే అన్నాడు కానీ అల్లా వెళుతుందా అని అనుమానం వచ్చింది. మళ్ళీ అక్కడ , చుట్టుపక్కల అంతా వెతికాడు. ఆమె కనిపించలేదు. కుప్పుస్వామి బిక్క మొహం వేసేశాడు. ఏమైందో ఏమిటో అని కంగారు పడ్డాడు. అరోరా గారితో వెళ్ళి ఉంటుందనే ఆశతో ఒక రిక్షా పట్టుకొని వాళ్ళ కాలనీ కి వచ్చాడు. తిన్నగా ఆరోరా గారింటికి వెళ్ళాడు. ఆలూ పరాటాలు  తింటున్న ఆరోరా  విషయం విని కంగారు పడ్డాడు. వెంటనే డ్రస్ మార్చుకొని కారు తీసుకొని బయల్దేరాడు. ఆయన తోటి ఆవిడ కూడా బయల్దేరింది. మెయిన్ గేటు దగ్గరకి వచ్చేటప్పటికి  ప్రణవ్ గోగై , బసంత్ కలితా కనిపించారు మోటారు సైకిల్ మీద. వాళ్ళని కూడా తీసుకొని కుప్పుసా నమ్మని వెతకటానికి  బయల్దేరారు.  జోర్హట్  బస్ స్టాండ్ నించి నాలుగు గ్రూప్ లుగా విడిపోయారు. ఆరోరా, వారి సతీమణి JB. కాలేజీ, సర్క్యూట్ హౌసు , Das &Co, బంగాల్ పుక్రి, మళ్ళీ వెనక్కి దాస్ &కొ, మద్రాస్ హోటల్, ప్రైవేట్ బస్ స్టాండ్ నించి గారాలీ  లోని అగర్వాల్ కిరాణా షాప్ కి చేరేటట్టు. ప్రణవ్ శంకర్ టాకీస్ , చౌక్ బజార్, గారాలీ జంక్షన్ , మార్వాడీ పట్టి , గారాలీ అగర్వాల్ షాపు కి, బసంత్, కుప్పుస్వామి బస్ స్టాండ్ నించి గారాలీ Jn, జ్యోతి హాలు , అక్కడ  కుప్పుస్వామి ఆగి, వెనక్కి గారాలీ అంతా అగర్వాల్ షాప్ దాకా, బసంత్ ఇంకా ముందుకు వెళ్ళి Rly. St., చుట్టుపక్కల  వీధులు తిరిగి వెనక్కి అగర్వాల్ షాప్ కి చేరేటట్టు నిర్ణయించుకున్నారు.

 

 

పాపం కుప్పుసానమ్మ,  మొగుడు 5 నిముషాల్లో వస్తానని వెళ్ళింతరువాత, హాల్ దగ్గరే నుంచుంది. మాట్నీ టైమ్ కావడంతో  జనాలు ఎక్కువవడంతో  రోడ్ దాటి అటువైపు నుంచుంది. ఇంకో 5 నిముషాల్లో అక్కడ కూడా రష్ పెరగటం తో  ఒక 20 mts. ముందుకు నడిచింది. 15 నిముషాలు అయినా కుప్పుస్వామి రాకపోవడంతో కంగారు పడింది. ఇంతలో ఒక మిలటరీ ట్రక్ అక్కడ ఆగడం తో ఇంకో 20 mts. ముందుకు నడిచింది. ఈ నడకలో పాపం తనకు తెలియకుండానే హోటల్ ఈస్ట్రన్ దాటి ఒక ఇరవై  అడుగులు ముందరకు వెళ్లింది. ఇంకో 10 నిముషాల దాకా మొగుడు రాకపోయే టప్పటికి ఏం చెయ్యాలో తోచలేదు. మొగుడుకి ఎక్కడో ఏదో అయ్యిందేమో నని  భయం వేసింది. భయం తో ఏడుపు వచ్చింది. ఎటువైపు వెళ్లాడో కూడా చూడలేదు. ఏడుపు ఆపుకుంటూ  ముందుకు నడిచింది.

 

 

ఇల్లీ టాకీస్ దగ్గర ఆగింది తెలిసిన వారెవరైనా కనిపిస్తారేమో నని. ఎవరూ కనిపించలేదు. ఉబికి వస్తున్న దుఃఖం ఆపుకోవడం కష్టం అయింది. కళ్ళమ్మట నీరు కారుతోంది.  ‘కలడందురు అన్ని  దిశలన్ కలండు కలండను వాడు కలడో లేడో’  అన్న అయోమయావస్థ లో ముందుకే నడిచింది. చూసే వాళ్ళకి ఎందుకు ఏడుస్తోందో  అర్ధం కాలేదు. కానీ ఒక ఆడకూతురు ఏదో కష్టం లో ఉందని  గ్రహించారు. ఏమైంది అని అడిగారు. భాష రాదు. ఏం చెప్పాలో,  ఎల్లా చెప్పాలో తెలియక తెలుగు లోనే మాట్లాడింది. ఎవరికి ఏమి అర్ధం కాలేదు. నడుస్తూనే ఉంది. ఇంతలో అగర్వాల్ షాపు దగ్గరకి వచ్చింది. బయట నుంచున్న అగర్వాలు గుర్తు పట్టాడు. కుప్పుస్వామి భార్య అని. ఏమైందమ్మా అంటూ షాప్ లోకి తీసుకెళ్లి కూర్చోపెట్టాడు. తెలిసిన మొహం ఒకటి కనిపించడం తోటే కుప్పుసానమ్మ ఘట్టిగా  ఏడ్చేసింది. అగర్వాల్ బలవంతం చేసి కూల్ డ్రింక్ తాగించాడు. నాల్గైదు మాట్లు అడిగిన తరువాత వచ్చిరాని  హింది లో  కుప్పుస్వామి  చల్బసా  అంది. అగర్వాల్  నిర్ఘాంత పోయాడు.  వెంటనే ఎక్కడ, ఎల్లా,ఎప్పుడు అంటూ అడిగాడు. ఒకరి భాష ఒకరికి రాదు. గుచ్చి గుచ్చి అడగడంతోనే  సినిమా హాల్ దగ్గర గిర్గయా అంది. అగర్వాల్ వెంటనే అరిచాడు కొడుకుల  నుద్దేశించి  “బజ్జూ గాడీ నికాలో, పప్పూ డాక్టర్ కో బులావో” అంటూ ఆజ్ఙలు జారీచేశాడు. తను మేకుకు తగిలించిన చొక్కా వేసుకొని తయారయిపోయాడు, కుప్పుస్వామి ఎక్కడ పడ్డాడో వెతకటానికి.

 

 

ఇంతలో ఒక తమిళ మామి షాపు లోకి వచ్చింది. అదృష్టవశాత్తు మామీ కి కొంచెం తెలుగు వచ్చు. అగర్వాల్ మామి కి సమస్య చెప్పడంతో మామి కుప్పుసానమ్మ తో మాట్లాడింది. మామికి పూర్తిగా అర్ధం కాకపోయినా సంగతి గ్రహించింది. మొగుడు గాడు ఈవిడను జ్యోతి టాకీస్ దగ్గర నుంచోపెట్టి, ఎక్కడికో వెళ్లిపోయాడు అని. అగర్వాల్ ఎవరికి ఏమి అపాయం జరగ లేదని తెలుసుకొని స్థిమిత పడ్డాడు. కుప్పుస్వామి అక్కడ వెతికి ఇంటికి వెళ్లిఉంటాడు లేకపోతే ఇక్కడే ఎక్కడో ఇంకా  వెతుకుతూ ఉంటాడు  అని అనుకున్నారు. బజ్జు నీ  కుప్పుసానమ్మ ని కారులో ఇంటి దగ్గర దింపమని, పంపించాడు. బజ్జూ కుప్పుసానమ్మ ని ఇన్స్టిట్యూట్ కాలనీ లో వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చిన ఒక అరగంటకి ప్రణవ్ వారి వెనక్కాలే ఆరోరా దంపతులు అగర్వాల్ షాపు కి వచ్చారు. విషయం తెలుసుకొని  వాళ్ళు వెంటనే కాలనీకి బయల్దేరారు,  బసంత్, కుప్పుస్వామి రాగానే పంపింఛమని చెప్పి.

 

 

అక్కడ కుప్పుసానమ్మ  ఇంటిదగ్గర దిగిన తరువాత కానీ గుర్తుకు రాలేదు, ఇంటి తాళాలు లేవని. కారులోంచి ఈవిడ దిగగానే  పక్కింటి బెంగాలీ మౌసి అడిగింది కుప్పుస్వామి ఏడి అని.  రైల్ క్రాసింగ్  దగ్గర సినిమా హాలు దగ్గర ఈవిడని వదిలి కుప్పుస్వామి ఎక్కడికో వెళ్ళాడు అని బజ్జు చెప్పి వెళ్ళి పోయాడు. ‘లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబాయె ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను’  అన్న విధంగా   కుప్పుసానమ్మకి   ఏడుపు ముంచుకు వచ్చింది.  మౌసి కి అర్ధం కాలేదు కానీ కుప్పుసానమ్మని ఇంట్లో కూర్చోబెట్టి  ఓదారుస్తూ,   మొగుడికి వార్త చెప్పేసింది, కుప్పుసానమ్మని రైల్వే క్రాసింగ్ దగ్గర వదిలేసి కుప్పుస్వామి  వెళ్లిపోయాడు  అని. మౌసి మొగుడు ఆ వార్త పక్కింటి ఆయనకి, ఎదురింటి ఆవిడకి చెప్పేశాడు. యధాశక్తి వాళ్ళు కూడా ఆ కబురు ఇంకొంత మందికి చేరవేశారు , ‘’’కుప్పుస్వామి రైల్వే స్టేషన్ లో పెళ్ళాం ని వదిలేశాడు పుట్టింటికి వెళ్లిపొమ్మని’’ అని.  పెదవి దాటితే ఫృధివి దాటుతుందన్నట్టు వార్త శర వేగంతో విస్తరించింది వీధి వీధికి రూపాంతరం చెందుతూ.

 

 

‘అల వైకుంఠ పురంబు లో నగరిలో ఆ మూల సౌధమ్ము లో’   ఆఫీసులో తన చాంబరు లో కూచున్న ఇన్స్టిట్యూట్ డైరక్టరు  Dr. మురుగేశన్ కి  ఆ వార్త  ‘‘కట్నం ఇవ్వలేదని పెళ్లాన్ని కుప్పుస్వామి  టికెట్ కూడా కొనకుండా రైలు లో కూచోపెట్టి ఇంటికి బెజవాడ  వెళ్ళి పొమ్మన్నాడు.  కిరాణా కొట్టు అగర్వాలు కొడుకు, ఏడుస్తున్న కుప్పుసానమ్మను చూసి జాలిపడి కాలనీకి తీసుకొచ్చాడు’’ అని చేరింది. అంతే   ‘నాగేంద్రము పాహి పాహి అనగ యాలించి సరంభియై’  లేచాడు కుర్చీ లోంచి బాసు.  ‘సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు’   అన్నట్టుగానే  టీ లో నంచుకొని తింటున్న బిస్కట్ ఒకటి సగం నోట్లోనూ సగం బయట ఉండగా, మూతి తుడుచుకుందుకు ఉపయోగించిన టవలు భుజం మీద ఉండగా, సంతకం పెట్టటానికి తీసిన మూతలేని పెన్ను ఒక చేతిలో ఉండగా, బయల్దేరాడు.  ఆది వారమైనా, ఇంట్లో కూర్చోనివ్వడు అంటూ ఏడుస్తూ ఆఫీసు కొచ్చిన ఆయన PA, AO, Ac.O, వారి వారి PA లు, ఆయన వెనుక  ‘తన వెంటన్ సిరి, లచ్చి  వెంటన్ అవరోధాతవ్రాతమున్’ అన్నట్టుగా  వెంటపడ్డారు.  బాసు గారికి   ఇంత వెన్న పూసి తరిద్దామనుకొని వచ్చిన కొంతమంది సైంటిస్టు లు,           ‘తను వేంచేయు పధమ్ము పేర్కొనడు, అనాధ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృచ్చులు   మృచ్చలించెరో  ఖలల్వేద ప్రపంచంబులన్’  అనుకుంటూ   అనుసరించారు.  ఆదివారమైనా లాబ్ లో నుంచుని పని  చేసుకుంటున్న బుద్ధిమంతులు,  లైబ్రరీ లో కూర్చుని జ్ఙాన సముపార్జన చేస్తున్న ముముక్షువులు,  ‘తాటకాంచనములతో భుజనట ద్ధమ్మిల్ల బంధమ్ముతో’  అన్నట్టు  భుజం మీద తువ్వాలు తో,నోట్లో బిస్కెట్ తో, చేతిలో పెన్ను తో,    జాగింగ్ లాంటి  నడక తో, నడక  లాంటి పరుగుతో  వెళ్ళుతున్న బాసుగారిని చూసి  వెంట పడ్డారు.   ‘చక్రాయుధుండేడి  చూపుడని ధిక్కారించిరో  దుర్జనుల్’     ఎవడికి మూడిందో చూద్దాం  అనుకుంటూ.  ఆ వెంట పడ్డవారిలో  ఇన్స్టిట్యూట్  No.2  Dr. సొశోంకో భొట్టోచార్యో కూడా ఉన్నారు. ఆయనకి కానీ ఆ గుంపులోని చాలా మందికి కానీ  ఏమైందో తెలియదు. ఈయన  బాస్ ని అడిగెదనని వడివడిగా అడుగులు వేసి అడిగిన నుడువడేమో  నని తడబడి వెనకడుగేసి,  మందిలో వస్తున్న PA ని అడిగాడు. వారు వివరించిన తరువాత  ఔరా ఔరౌరా అంటూ బాస్ గారి పక్కకు చేరారు.

 

 

ఈ మంది మార్బలం తో ఇన్స్టిట్యూట్ గేటు దాటి కాలనీ లోకి అడుగు పెట్టారు బాస్ గారు.  ఆగి PA ని పిలిచి కుప్పుస్వామి ఇల్లెక్కడా అని అడిగి PA దారి చూపుతుంటే అనుసరించారు. కాలనీ రహదారుల పక్కన గుంపులు గుంపులుగా చర్చించుకుంటున్న వారంతా కూడా వీరివెంట పడ్డారు. బాసు గారు  కుప్పుస్వామి ఇంటికి చేరేటప్పటికి అక్కడ ఉన్న 5,6, గుంపులు కూడా వీరితో చేరి పోయారు. అంతా కలసి సుమారు ఒక 75 మంది వైకుంఠ పురంబునన్ గల్గు నాబాల గోపాలమున్  అక్కడకి వచ్చేశారు.

 

 

అక్కడికి చేరిన బాసు గారు గొంతు సవరించుకొని  “సహించ ఇంత అన్యాయంబు నా  రాజ్యమందు సహించ” అని గంభీరంగా అనేటప్పటికి ఆయన నోట్లో ఉన్న బిస్కెట్ సగం నోట్లోకి సగం కిందకు పడింది. చేతిలో పెన్ను PA చేతిలో పెట్టి భుజం మీద తువ్వాలుతో మూతి తుడుచుకొని “రూల్సు ఒప్పుకుంటే డిస్మిస్ కోకపోతే సస్పెండు చేసేస్తా” అని ఆగ్రహం గానూ. గంభీరంగానూ , ఉత్సాహంగానూ అనేశాడు. ఇంతలో  మోసి  కుప్పుసానమ్మను పట్టుకుని తీసుకొచ్చింది బయటకు ఇంట్లోంచి. ఇంతమందిని చూడగానే ఆపుకున్న ఏడుపు మళ్ళీ పెల్లుబికింది కుప్పుసానమ్మకి.  చినుకుగా రాలి, సెలయేరు గా పారి, నదిగా ప్రవహించే ఆ కన్నీటి సాగరం చూడగానే బాసు గారు చలించిపోయాడు. శోకా తప్త హృదయంతో , బాధా దగ్ధ గద్గదిక గొంతుతో అడిగాడు “ఏమైందమ్మా ఏమైంది’’ అని. షరా మామూలే అయింది. కుప్పుసానమ్మ తెలుగులో చెప్పడం ఆవిడ చెప్పింది ఎవరికి అర్ధం కాకపోవడం. ఏం చెయ్యాలో తోచక కుప్పుస్వామి ఇంటికి వేళ్లాడుతున్న తాళం చూసి “తోడ్ దో” అని గర్జించాడు  బాసు గారు.    అంతే PA గారు ఒక రాయి తీసుకొని దానిమీద ఒకటుచ్చుకున్నాడు.  ఒక్క దెబ్బకే విరిగి కింద పడింది. తలుపు తీసి ఇంట్లోకి అడుగు పెట్టేడు బాసు. ఆయన వెనకాలే  No. 2, PA, AO లు కూడా గృహములోకి వెళ్లారు. కుప్పుసానమ్మ ను తీసుకొని  మోసి కూడా వచ్చింది ఇంట్లోకి. మిగతా ఆబాల గోపాలం ఉత్కంఠ గా చూస్తున్నారు బయట నుంచి.

 

 

శాస్త్రి గారినో , రావు గారినో పిలిపించండి అన్నారు బాసు. ఇద్దరూ ఇంట్లో లేరండి జవాబు ఇచ్చాడు మోసి భర్త. మూర్తి శలవు మీద ఉన్నాడు కదా అన్నాడు బాసు. అవును అన్నాడు పి‌ఏ. ఇంతలో గుమ్మం ముందు కారు ఆగింది. ఆరోరా గారు సతీసమేతుడై కారు దిగారు. లోపలికి వచ్చి  బాసు గారి కి కధాక్రమము వివరించాడు. బయట కారులోంచి దిగిన  ప్రణవ్ అందరికీ విషయం వివరించడం తో బాల గోపాలా లందరూ ఇంకో వార్త వెతకటానికి వెళ్ళిపోయారు. ఇంతలో మోటారు సైకిలు ఆగింది.   కుప్పుస్వామి ని చూసి కుప్పుసానమ్మ ముందుకు పరిగెత్తి కుప్పుస్వామి ని గట్టిగా పట్టుకుంది.

 

 

బాసు గారు ఉదారంగా “సారీ కుప్పుస్వామి,  నేను కూడా తప్పుగా అనుకున్నాను. Enjoy.”  అని    చెప్పి  వెళ్లిపోయాడు.

15 thoughts on “సంసారసాగరంలో సుడిగుండం

 1. “పెళ్ళాం పక్కనుంటే మాత్రం చేతులు కట్టుకొని వివేకానంద ముద్ర లో నుంచుంటాడు”

  :)) super!

 2. ఎన్నెల గార్కి,

  ధన్యవాదాలు. నవ్వితే ఆయుష్షు పెరుగుతుందని పరమ యోగీశ్వరులు నేను గారు సెలవిచ్చారు. అయినా నవ్వలేక అనియా నవ్వురాక అనియా మీ భావం :):)

 3. రాఘవ గార్కి,
  ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీరు జోర్హట్ ఎప్పుడైనా వెళ్ళారా?

  శ్రావ్య గార్కి,
  ఆ కాలం లో సెల్ ఫోన్ లేదు. అప్పుడు లాండ్ లైన్ దొరకడమే కష్టం అండి. ధన్యవాదాలు.

  హనుమంత రావు గార్కి,
  ధన్యవాదాలు. ఏదో రాసేస్తున్నాను కానీ మరీ అంత సీను లేదు సార్.

  కావ్య గారికి,
  కొంత మంది బాసులు అంతే. హ్యూమన్ రిలేషన్స్ అంటారు. ప్రమోషన్ ఇచ్చినా కౌన్సిలింగ్ చేసేవాడు, ఇవ్వకపోయినా చేసేవాడు. ధన్యవాదాలు.

 4. రాజ్ కుమార్ గార్కి,
  ధన్యవాదాలు. ఏమిటో మీ అభిమానం అల్లా అనిపిస్తుంది.:):)

  మధుర వాణి గార్కి,
  మీ కామెంటు కి, స్మైలి కి ధన్యవాదాలు. :):)

  కార్తీక్ గార్కి,
  నా కధ (అంటే నేను రాసిందని నా భావం) మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  ఫణి బాబు గార్కి,
  ధన్యవాదాలు. మరీ అంత కాకపోయినా నా హింది ఇప్పటికీ అల్లాగే ఉంది సారూ.:):)

 5. తరువాత వచ్చిరాని హింది లో కుప్పుస్వామి చల్బసా అంది. అగర్వాల్ నిర్ఘాంత పోయాడు. వెంటనే ఎక్కడ, ఎల్లా,ఎప్పుడు అంటూ అడిగాడు

  గురుజి చంపేశారు.. ఆఫీసులో నవ్వలేక చచ్చాను .. బాసు గారి వర్ణన అయితే అమోఘం 🙂

  నిజం చెప్పండి ఇది మీ కధే కదా 🙂

 6. కుప్పుస్వామి భాగోతం…చాలా బాగా నడిపించారు…కథలో ఉత్కంఠ
  కలగజేస్తూ హాస్యాన్ని పండించడం మా సుబ్రహ్మణ్యంగారి తర్వాతనే
  ఎవరైనా…..చాలా…చాలా….చాలా బాగుంది.

 7. చాల బావుందండి ! ఇలాంటి కష్టాలు లేకుండా సెల్ ఫోన్లు కనిపెడితే వాటినేమో తిట్టేస్తారు మీరు 😀

 8. జోర్హాట్ కథలు వ్రాస్తున్నారా ఏమిటండీ? చదివేందుకు ఆహ్లాదకరంగా ఉన్నాయి మీ వ్రాతలు. అభినందనలతో అభివందనాలతో భవదీయుడు.

 9. ” తరువాత వచ్చిరాని హింది లో కుప్పుస్వామి చల్బసా అంది. అగర్వాల్ నిర్ఘాంత పోయాడు. వెంటనే ఎక్కడ, ఎల్లా,ఎప్పుడు అంటూ అడిగాడు.”—బ్రహ్మాండం….

 10. ‘సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు’ అన్నట్టుగానే టీ లో నంచుకొని తింటున్న బిస్కట్ ఒకటి సగం నోట్లోనూ సగం బయట ఉండగా, మూతి తుడుచుకుందుకు ఉపయోగించిన టవలు భుజం మీద ఉండగా, సంతకం పెట్టటానికి తీసిన మూతలేని పెన్ను ఒక చేతిలో ఉండగా, బయల్దేరాడు>>>> కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్….

  ఇలాంటివి చాలా ఉన్నాయండీ.. అన్నీ రాస్తే పోస్టంత అవుతుందీ కామెంట్… సూపరంతే..

Comments are closed.